జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంత పుంజుకోవాలని ప్రయత్నిస్తుంటే అంతగా దిగజారిపోతోంది. అంతర్గత కలహాలు, నేతల రాజీనామాలు, తిరుగుబాట్లు పార్టీని నగుబాటుకు గురి చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి నాటి నుంచి ఇవి మరింత పెరిగాయి. ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ రాజీనామాతోనే ఈ పరంపర మొదలై ఇప్పటికీ ఆగకుండా కొనసాగుతోంది. రాజీనామాలు, తిరుగుబాట్ల వల్ల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి. రాజీనామా చేసిన వారిలో రాహుల్, సోనియాల సన్నిహితులు కూడా ఉండటం విశేషం. సంక్షోభాలను త్వరత్వరగా పరిష్కరించడంలో పార్టీ అధిష్టానం విఫలం కావడం వల్ల మరింత నష్టం వాటిల్లుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.
కుప్పకూలిన రెండు ప్రభుత్వాలు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసుకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మునుపటి కంటే ఎక్కువ స్థానాలతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండోసారి పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆ పదవి భర్తీ కాకపోగా తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నెట్టుకొస్తున్నారు.
Also Read : ఇందిరా గాంధీ హాయంలో కింగ్‌మేకర్ రాయవరం మునసబు గురించి తెలుసా..?
సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండు నెలల్లోనే అదే ఏడాది జూలైలో కర్ణాటకకు చెందిన పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆ దెబ్బతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారం చేపట్టింది.
అనంతరం మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారి తీసింది. రాష్ట్రంలో పార్టీ కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్యతో పాటు ఆయన వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెసుకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చింది.
Also Read : పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా – బీజేపీ పెద్దలతో భేటీకి మాజీ సీఎం అమరీందర్
అదే సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సంక్షోభం మొదలైంది. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నేతృత్వంలో 20 మంది ఆయన వర్గ ఎమ్మెల్యేలు సీఎం అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేశారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సీఎం గెహ్లాట్ రాజకీయ చాతుర్యం వల్ల బలపరీక్షలో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. అయినా ఇప్పటికీ అసమ్మతి బెడద ఎదుర్కొంటోంది.
ఇక పంజాబులో రెండేళ్లుగా అసమ్మతి రగులుతోంది. అక్కడ పార్టీని రిపేర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసికొడుతున్నాయి. రెండు నెలల క్రితం సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఈ నెల 18న సీఎంను కూడా మార్చారు. అయినా అసమ్మతి చల్లారకపోగా పరిస్థితి మరింత దిగజారింది. మాజీ సీఎం అమరీందర్ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తుండగా.. సిద్ధూ కూడా పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Also Read : టీడీపీపై చంద్రబాబు కంట్రోల్ తప్పుతోందా?ఇన్ని అసమ్మతి స్వరాలా ?
రాష్ట్రాల్లో కీలక నేతల వలసలు
ఇవే కాకుండా ఇంకా చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసి.. కీలక పదవులు చేపట్టారు.
-ఉత్తరప్రదేశ్ కు చెందిన కీలక నేత జితిన్ ప్రసాద మూడు నెలల క్రితం బీజేపీలోకి వెళ్లిపోయారు. యూపీ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం లభించింది.
-అసోం కు చెందిన హిమంత బిశ్వ శర్మ రెండేళ్ల క్రితమే కాంగ్రెసును వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన అసోం సీఎంగా ఉన్నారు.
-సిల్చర్ ఎంపీ, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ తృణమూల్ కాంగ్రెసులో చేరిపోయారు. ఆమెను టీఎంసీ రాజ్యసభ సభ్యురాలిని చేయడంతో పాటు త్రిపుర పార్టీ బాధ్యతలు అప్పగించింది.
-గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసుతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న, సోనియాతో సాన్నిహిత్యం కలిగిన ఫెలీరో మూడు రోజుల క్రితమే కాంగ్రెసుకు రాజీనామా చేశారు. ఆయన కూడా టీఎంసీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.
Also Read : రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్