దేశంలో కోవిడ్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రస్తుతం కర్ణాటక టాప్ లో ఉంది. యాక్టివ్ కేసులు 3 లక్షలకు చేరువలో ఉండగా.. రోజువారీ కేసులు, మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. దాంతో రాష్ట్రమంతా లాక్ డౌనులో ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అక్కడి అధికార పార్టీ అయిన బీజేపీలో నేతలు ఆధిపత్య కుమ్ములాటలకు పాల్పడుతుండటం ప్రజలను అసంతృప్తికి గురిచేస్తోంది. బీజేపీ నేతలు సీఎం యడియూరప్ప అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయి ఎత్తులు పైఎత్తులతో కాలక్షేపం చేస్తున్నారు. యాడియూరప్ప పీఠాన్ని కదిలించేందుకు వ్యతిరేక వర్గీయులు పావులు కదుపుతుంటే.. సీఎం తనయుడు విజయేంద్ర ఏకంగా ఢిల్లీకి వెళ్లి ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేయడంతో కర్ణాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
యెడ్డీపై ఆరోపణలు
రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ పతనం తర్వాత మళ్ళీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్న యడియూరప్ప వయసు మీద పడటం, ఆరోగ్యం బాగోకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండలేకపోతున్నారు. అదే అదనుగా ఆయన తనయుడు, యువమోర్చా నేత అయిన విజయేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చి తానే సీఎం అన్నట్లు రెచ్చిపోతున్నారని వ్యతిరేక వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. సీఎం ఆరోగ్యం బాలేదు.. పరిపాలన కూడా సక్రమంగా లేదు.. దీనిపై పార్టీ నాయకత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ కోరారు. మైసూరులోని ఎంపీ శ్రీనివాస్ నివాసంలో జరిగిన భేటీలో పలు అంశాలకు ముహూర్తాలు నిర్ణయించాం.. కొద్ధిరోజులు వేచి చూడండి..అని ఆయన రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. మంత్రి యోగేశ్వర్ అయితే తమ ప్రభుత్వాన్ని మూడు ముక్కల ప్రభుత్వంగా అభివర్ణించారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతలతో కొందరు పెద్దలు కుమ్మక్కై మూడు గ్రూపుల ప్రభుత్వంగా మార్చేశారని సాక్షాత్తు ఒక మంత్రే వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
తనయుడి రాయబారం
వైరి వర్గీయుల విమర్శలు, ఆరోపణలపై పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేసేందుకు సీఎం యడియూరప్ప తరఫున ఆయన తనయుడు విజయేంద్ర ఢిల్లీ వెళ్లి రెండు రోజులు అక్కడే మకాం వేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిణామాలను వివరించి.. పార్టీలోని ఒక వర్గం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రి యోగేశ్వర్ చేసిన ఆరోపణలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వాటిపై పార్టీ పెద్దల స్పందన వెల్లడికాకపోయినా.. యడియూరప్ప నాయకత్వంపై అగ్రనేతలు ఏమంత సంతోషంగా లేరని మాత్రం తెలుస్తోంది. అందుకే ఏడాదిన్నర నుంచి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సీఎం ప్రయత్నిస్తున్నా ఢిల్లీ పెద్దలు అనుమతివ్వడం లేదు. రాష్ట్రంలో బలమైన లింగాయత్ వర్గానికి యెడ్డీ ప్రాతినిధ్యం వహిస్తుండటం.. అంత బలమైన నాయకుడు పార్టీలో మరొకరు లేకపోవడం కమల దళపతులను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి నేట్టేసిందంటున్నారు.