iDreamPost
iDreamPost
వైఎస్ జగన్…ఈ రాష్ర్ట ముఖ్యమంత్రి. ఆయన ఆదేశిస్తే ఏదైనా జరిగితీరాల్సిందే…అని అందరూ అనుకుంటారు. కాని టీటీడీలో అందుకు రివర్స్‌గా పాలన సాగుతోంది. పోపో జగన్… నువ్వు ఆదేశిస్తే ఏంటి? వినాలా అని అనలేదు కాని..ఆచరణలో మాత్రం లెక్కలేని తనాన్నిటీటీడీలో ప్రదర్శిస్తున్నారు.
అయ్యా ఈ ఏడాది మార్చి 31కి ముందు రిటైర్డ్ అయిన తర్వాత కూడా నియమితులైన ఉద్యోగులు దిగిపోవాల్సిందే. అంతే కాకుండా ఎలాంటి పేపర్ నోటిఫికేషన్, సంబంధిత విధానం ద్వారా కాకుండా నియమితులై రూ.40వేలకు పైబడి వేతనం పొందుతున్న ఔట్‌సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణం తొలగించాలని నాలుగు రోజుల క్రితం జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అటానమస్, కార్పొరేషన్ సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ విషయమై ఈ నెల 31వ తేదీకి అలాంటి వారిని తొలగించాల్సి ఉంది.
అయితే ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ టీటీడీ ఇవేవీ తమకు వర్తించవన్నట్టు వ్యవహరిస్తోంది. ఈ జీవో జారీకి మూడు రోజుల ముందు వివిధ స్థాయిల్లో పది మంది రిటైర్డ్ ఉద్యోగులను నియమించారు. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీకి దగ్గరి వారిగా పేరు ఉంది. అలాగే 2014లో రిటైర్డ్ అయిన ఓ న్యాయశాఖ ఉన్నతోద్యోగి చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అతని పదవికి మరో ఏడాది పొడిగింపునిస్తూ ఈ రోజు (23వ తేదీ) జరిగే బోర్డు మీటింగ్‌లో తీర్మానించనున్నట్టు సమాచారం. అలాగే టీటీడీ పబ్లికేషన్స్ విభాగంలో బాబు హయాంలో సినీనటుడు బాలకృష్ణ సిఫార్సుతో నియమితుడైన ఓ రిటైర్డ్ ఉన్నతోద్యోగి ఇప్పటికీ కొనసాగుతున్నట్టు సమాచారం. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ సర్కార్ ఆదేశాలను భేఖాతర్ చేస్తూ విధుల్లో కొనసాగుతున్న వారి లిస్ట్ చేంతాడంత అని చెప్పక తప్పదు. మరోవైపు గత పదేళ్లుగా జగన్ సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో వైసీపీ కోసం పని చేసిన వారికి సరైన గుర్తింపు, గౌరవం దక్కక పోవడంతో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది.
జగన్ సర్కార్ ఆదేశాలను కొండెక్కిస్తున్న వారెవరో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడిన పాలకమండలిపై ఉంది. లేదంటే జగన్ ఆదేశాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ దేవుడే దిక్కేమో?