iDreamPost
android-app
ios-app

వైఎస్సార్ అంటే ఫీజు రియంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ – మరి జగన్ అంటే?

  • Published Oct 08, 2020 | 11:32 AM Updated Updated Oct 08, 2020 | 11:32 AM
వైఎస్సార్ అంటే ఫీజు రియంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ – మరి జగన్ అంటే?

కొందరు నేతలకు కొన్ని బ్రాండెడ్ స్కీములుంటాయి. ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్ వరకూ అనేక పథకాలు అలాంటి ముద్రలు వేశాయి. చంద్రబాబు మాత్రం ఇంకుడుగుంతలు అంటూ తొలిసారి, అమరావతి వంటూ రెండోసారి ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజా సంక్షేమం విషయంలో తగిన ముద్ర వేయలేని సీఎంగా మిగిలిపోయారు. కానీ జగన్ అందుకు భిన్నం. తన పూర్వీకులను గుర్తు చేసేలా సంక్షేమ కార్యక్రమాలను తీర్చిదిద్దుతున్నారు. తండ్రి బాటలో బలమైన ముద్ర వేస్తున్నారు.

వైఎస్సార్ కూడా అన్ని రంగాలతో పాటు విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించారు. తిరుగులేని పథకాలతో ప్రజల్లో నిలిచిపోయారు. నేటికీ వైఎస్సార్ గుర్తు రాగానే పెద వారికి ఆరోగ్య శ్రీ,, యువతరానికి ఫీజు రీయంబెర్స్ మెంట్ గుర్తుకొచ్చేటంత స్థాయికి తీసుకెళ్లారు. తాజాగా జగన్ తన తండ్రి ఒక అడుగు వేస్తే, తాను రెండడుగులు వేస్తాననే మాట నిలబెట్టుకునేలా సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే విద్య, వైద్యం విషయంలో ఆయన ఉదారంగా వ్యవహరిస్తున్నారు. సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. శాశ్వత ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.

జగన్ అంటే గిట్టని ప్రత్యర్థులు, కొన్ని పచ్చ పత్రికలకు అర్థం కాకపోవచ్చు గానీ అభివృద్ధి అంటే మానవవనరుల మీద పెట్టిన పెట్టుబడులనే విషయం ప్రపంచమంతటికీ తెలుసు. వాటికి మించిన పెట్టుబడి, అభివృద్ధి ఉండదనేది అందరూ అంగీకరించే సత్యం. సరిగ్గా ఇప్పుడు జగన్ అభివృద్ధి విషయంలో అక్కడే దృష్టి సారించారు. దానికి అనుగుణంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ బోధనాసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఏకకాలంలో భారీగా ప్రభుత్వ కాలేజీలలో మెడికల్ సీట్లు పెంచుతూ యువతరానికి, ఆసుపత్రలలో బెడ్లు పెంచుతూ పెద్ద వారికి మేలు చేసేందుకు సంకల్పించారు. దానికి అనుగుణంగా మారుమూల పాడేరు, కురుపాం వంటి ప్రాంతాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన కూడా చేసేశారు.

ఆరోగ్యం, చదువులు తన రెండు కళ్లు అన్నట్టుగా జగన్ చెప్పకనే పనులు చేస్తున్నారు. విద్యారంగంలో నాడు-నేడు పథకం విప్లవంగానే చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్న తీరు దేశమంతా చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో సామాన్యులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అమ్మ ఒడి ఎందరికో ఊరటిన్తుంటే జగనన్న గోరుముద్ద బడిపిల్లలకు సంపూర్ణ ఆహారాన్ని అందిస్తోంది. తాజాగా జగనన్న విద్యాకానుక ద్వారా పేదల చదువులకు సంబంధించిన ప్రతీ వస్తువును అందిస్తూ నవతరానికి రాచమార్గం ఏర్పాటు చేస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి విషయంలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి ఓవైపు ప్రయత్నాలు చేస్తూనే రెండో వైపు ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం ద్వారా పగడ్బందీ చర్యలకు పూనుకుంటున్నారు.

రాబోయే కొన్ని దశాబ్దాల పాటు జగన్ తీసుకున్న నిర్ణయాలు నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. రాజకీయాలు, ఇతర వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఇవి మూల స్తంభాలుగా మారబోతున్నట్టు భావించవచ్చు. విద్య, వైద్య రంగాలు బలోపేతం చేయడం ద్వారా సుదీర్ఘ కాలం పాటు సమాజ అవసరాలకు అనుగుణంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎందరికో ఉపశమనం అవుతాయిన చెప్పవచ్చు. ఇటీవల ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి దాదాపుగా 3లక్షల మంది వచ్చి చేరారు. అంటూ ఆయా కుటుంబాల్లో కనీసం ఏడాదికి రూ. 25వేల ఆదాయం మిగిలినట్టే భావించాలి. ప్రైవేటు బడులకు ఫీజుల, ఇతర రూపాల్లో పెట్టాల్సిన ఖర్చు ప్రభుత్వ బడుల్లో చేర్చడం వల్ల ఆయా కుటుంబాలకు మిగిలుతాయనే చెప్పవచ్చు. తద్వారా ఆయా కుటుంబాల్లో మిగులుతో మరింత అభివృద్ధి జరుగుతుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో సమూల మార్పులకు ఇలాంటివి కీలకం అవుతాయనడం నిస్సందేహం. తద్వారా జగన్ జన హృదయాల్లో నిలిచిపోయేందుకు ఇవన్నీ ఉపయోగపడే అంశాలనేనని చెప్పవచ్చు.