iDreamPost
iDreamPost
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖ నగరంలో పర్యటించారు. శ్రీ శారదా పీఠంలో జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం 11.30 కు విశాఖ చేరుకున్న ఆయన గంటకుపైగా శారదా పీఠంలో గడిపారు. రాజశ్యామల యాగంలో పాల్గొనడంతోపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
సుమారు 12 గంటల ప్రాంతంలో శారదా పీఠానికి చేరుకున్న సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, తదితరులు ఘనస్వాగతం పలికారు. పీతాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆయన్ను నేరుగా రాజశ్యామల యాగ ప్రాంగణానికి తీసుకెళ్లారు. యాగంలో పాల్గొన్న జగన్ కు వేద పండితులు సంకల్పం చెప్పించారు. అనంతరం కలశ స్థాపన చేయించారు. తర్వాత రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పీఠం ప్రాంగణంలోనే ఉన్న విజయగణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సందర్శించారు. రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జగద్గురు ఆది శంకరాచార్య వేద పాఠశాలలో వేద విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా పట్టాలు, మెడల్స్ ప్రదానం చేశారు.
సీఎం హోదాలో మూడోసారి
విశాఖ శారదా పీఠాన్ని ముఖ్యమంత్రి హోదాలో జగన్ మూడోసారి సందర్శించారు. అంతకుముందు కూడా ఆయన పీఠాన్ని సందర్శించారు. మూడురోజులుగా జరుగుతున్న శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన జగన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 11.30కు విశాఖ విమానాశ్రయం చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో చిన ముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విశాఖ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు.