సరికొత్త సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ పుట్టిల్లుగా మారుతోంది. మే 30, 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నాటి నుంచే కొత్త విధానాలను అమలులోకి తేవడం ప్రారంభించారు. అప్పటి వరకూ రాష్ట్రంలోని ఆయా విభాగాలలో ఉన్న పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి.. నిపుణులతో చర్చించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కొరకే పని చేసేలా నూతన విధానాలను అవలంబించాలని సంకల్పించారు. కొత్త చట్టాల రూపకల్పనలోనూ.. పథకాల అమలులోనూ యావద్దేశం దృష్టి ఏపీపై పడేలా విభిన్న పంథా అవలంబిస్తున్నారు. అందుకే పాలన ప్రారంభించిన 2 నెలల కాలంలోనే ఉత్తమ సీఎంల జాబితాలో చేరారు జగన్. ఇప్పుడు రైతుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. బహుశా ఇలాంటి విధానం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఉండకపోవచ్చు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొత్త విధానాలెన్నో..
– 2019 ఆగస్టు 15 ఏపీలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. స్వాతంత్య్రం దినోత్సవం రోజున గ్రామ వాలంటీర్ వ్యవస్థ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి.
– 2019 అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. మొత్తం 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను ఒకేసారి ప్రారంభించారు. ఇందులో 1,25,803 మంది ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు.
– మహిళల రక్షణకు ప్రత్యేకంగా దిశ చట్టం రూపొందించారు. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత 2019, డిసెంబరు 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ రానుంది. వీటితో పాటు.. ఆపదలో ఉన్న మహిళలు… ఫిర్యాదు చేసేలా దిశ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఇప్పటికే అనేక ఫిర్యాదులు స్వీకరించి… ఆపదలో ఉన్న ఆడవారికి సకాలంలో సాయం అందించి రక్షణ కల్పించారు.
– ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని అంతం చేయడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు 25 నవంబర్ 2019 కొత్తగా కాల్ సెంటర్ తీసుకొచ్చారు. ఏపీలోని సెక్రటేరియట్ నుంచి గ్రామ సచివాలయం వరకు ఎక్కడైనా అవినీతి కనిపిస్తే.. ఎవరైనా అధికారి లంచం అడిగితే.. నేరుగా ఈ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చు. ఈ కాల్ సెంటర్‌కు 14400 నెంబర్‌ను ఇచ్చారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్. పోలీస్, ఆంబులెన్స్ తరహాలో… దీనికి ఫోన్ చేసినా కూడా బిల్లు పడదు. ఏదైనా అవినీతికి సంబంధించి ఫిర్యాదు వస్తే, వాటిని 15 రోజుల నుంచి నెల రోజుల్లోపు పరిష్కరించాలని నియమం విధించారు.
– స్పెషల్ ఎన్ ఫోర్స మెంట్ బ్యూరో : మద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టే ప్రత్యేక సెల్ ఇది. ఎక్కడైనా మద్యం, ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలిస్తే 7993822444 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు.. వెంటనే అరికట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
– 1 ఫిబ్రవరి 2021 నుంచి ఇంటి నుంచే నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం 9 వేల 260 మొబైల్ యూనిట్లు, మోడర్న్ వేయింగ్ మిషన్స్ సిద్ధం చేశారు. పంపిణీ కోసం 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక వాహనాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించారు.
సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి సరికొత్త విధానాలు ఎన్నింటినో ఏపీలో ప్రవేశపెట్టారు జగన్. ఈ విధానాలన్నీ దేశమంతా చర్చనీయాంశంగా మారుతున్నాయి. వీటిలో కొన్నింటిని పలు రాష్ట్రాలు తమ వద్ద కూడా అవలంబించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పలు సందర్భాల్లో ఏపీ విధానాలను మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయితే బావుంటుందన్న సూచనలు చేశారు.
రైతు భరోసా పోలీసు స్టేషన్లు
ఇప్పుడు మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు జగన్. రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని ఆదేశించిన సీఎం.. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిల్చి, వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని యెచిస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై మేథోమథనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారలను ఆదేశించారు.