కొన్నేళ్ళ క్రితం వరకూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2019 జూన్ 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకూ, రాష్ట్రంలోని కొన్ని వేల గ్రామాల్లో ఉండే ఏకైక ప్రభుత్వ ఆస్తి ఒక్క పాఠశాల మాత్రమే. కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయితీ కార్యాలయం కూడా ఉన్నా అత్యధిక గ్రామాల్లో ఒక ప్రాధమిక పాఠశాల లేదా ప్రాధమికోన్నత పాఠశాల ఉండేవి.
ఈ పాఠశాల కూడా చాలా గ్రామాల్లో పక్కా భవనం కాదు. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం కట్టించిన పెంకుటిళ్ళు లేదా రెండు గదుల పక్కా భవనం. గతంలో ఓ సారి ఎన్టీఆర్ హయాంలో గ్రామాల్లో పేదలకు నిర్మించే రెండు గదుల పక్కా ఇళ్ళతో పాటు ఓ రెండు గదుల భవనం ఆ గ్రామంలో పాఠశాలకోసం కూడా నిర్మించారు.
సహకార రంగంలో పాలఉత్పత్తి కార్యక్రమాలు మొదలై అనేక గ్రామాల్లో పాలశీతలీకరణ కేంద్రాలు నెలకొల్పాలని సహకార సంఘాలు అనుకున్నా చాలా గ్రామాల్లో ఈ పాఠశాల వరండాలోనో, ఇక ఆ గ్రామ పంచాయితీ కార్యాలయం వరండాలోనో పాల సేకరణ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఎక్కడో మూడువేల పైబడి జనాభా ఉన్న గ్రామాల్లో మాత్రం పంచాయితీ కార్యాలయం, పాఠశాల, పాలశీతలీకరణ కేంద్రం ఉండేవి. పాఠశాల భవనంలోనో, పంచాయితీ కార్యాలయ భవనంలోనో ఓ గదిలో చిన్న గ్రంధాలయం కూడా నడుస్తుండేది.
ఇక 1980 దశకంలో ఎన్టీఆర్ పాలన ప్రారంభం అయ్యాక తాలూకాల స్థానంలో మండలాలు ఏర్పాటయ్యాక మండల ప్రధాన కేంద్రంగా ఎంపికైన పెద్ద గ్రామాల్లో పోలీస్ స్టేషన్ భవనం కూడా నిర్మించారు.
అంటే రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తిగా చెప్పుకోదగినవి ఒకటి గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం కాగా రెండోది ప్రాధమిక లేదా ప్రాధమికోన్నత పాఠశాల మాత్రమే. అంతకు మించి గ్రామాల్లో కనిపించే ప్రభుత్వ ఆస్తి అంటూ ఏమీ ఉండేది కాదు.
సరిగ్గా 20 నెలల జగన్మోహన్ రెడ్డి పాలన తర్వాత గ్రామాలను సందర్శిస్తుంటే ప్రభుత్వ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గ్రామంలో పాఠశాల, పంచాయితీ కార్యాలయంతో పాటు ఓ అంగన్వాడీ భవనం, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం దర్శనం ఇస్తున్నాయి.
ఇవి మాత్రమే కాక గ్రామాల్లో జనతా బజార్లు రానున్నాయి. అలాగే రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా రైతు సహాయ కేంద్రాల పేరుతో రైతులకు ఎరువులు, విత్తనాలు అందించేందుకు దుకాణాలు, రైతుల పంట దాచుకునేందుకు గోదాములు, విలేజ్ క్లినిక్ లు, పశువైద్యశాల, ఇలా అనేక భవనాలు గ్రామాల్లో దర్శనం ఇవ్వబోతున్నాయి. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినట్టు అధికారులు చెపుతున్నారు.
ప్రభుత్వ ఆస్తిగా చెప్పబడే ఇన్ని భవనాలు గ్రామాల్లో కనిపించడం, వాటిద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాలకు తరలి రావడం ఏ రకంగా చూసినా అభివృద్ధి అనాల్సిందే. రాజకీయ ప్రత్యర్ధులు అంగీకరించకపోవచ్చు కానీ, ప్రజలకు తమ గ్రామాల్లో కొత్తగా వచ్చిన సదుపాయాలేంటి, కొత్తగా వచ్చిన ప్రభుత్వ కార్యాలయాలు, అందుతున్న సేవలు ఏంటి అని తెలియకపోదు.
ఆ కొత్త భవనాలు మొత్తం ఇప్పుడు ఆయా గ్రామాలకు నేరుగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆస్తి. ఒకప్పుడు గ్రామాల్లో ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు కనిపించేవారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, పంచాయితీ కార్యాలయంలో పంచాయితీ సెక్రటరీ. ఇప్పుడు షుమారు ఐదు నుండి ఏడు వరకూ ప్రభుత్వ భవనాలు వచ్చేశాయి. ఆ మేరకు పది మంది నుండి పదిహేను మంది వరకూ ప్రభుత్వోద్యోగులు వచ్చేశారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి అన్నీ గ్రామస్థాయిలో మారుతున్న, మనకు కనిపిస్తున్న మార్పు. ఈ మార్పు ఆయా గ్రామాల ప్రజల జీవన విధానంలో కూడా మార్పు తెస్తుంది.
పల్లె పట్టణంగా మారడం అంటే జనాభా సంఖ్య పెరగడం మాత్రమే కాదు. పెరుగుతున్న జనాభాతో పాటు సౌకర్యాలు పెరగడం, ప్రభుత్వ కార్యాలయాలు రావడం, ప్రభుత్వ సేవలు పెరగడం ఇవన్నీ అభివృద్ధికి సూచికలు. ఈ సూచికలను విస్మరించి అభివృద్ధిని అంచనావేసే సూత్రీకరణలు ప్రపంచంలో ఏ సామాజిక ఆర్ధిక వేత్తలూ ఇప్పటివరకూ రూపొందించలేదు. అందువల్ల ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ప్రామాణికాలను మాత్రమే తీసుకుని చూస్తే గడచిన 20 నెలల కాలంలో గ్రామాల్లో ఏర్పాటయిన ఈ సదుపాయాలు, అందుతున్న సేవలు, కనిపిస్తున్న కార్యాలయ భవనాలు ఆయా గ్రామాల అభివృద్ధి క్రమానికి తొలివరుస మెట్లుగా అంగీకరించక తప్పదు.