iDreamPost
android-app
ios-app

కరోనా నిర్దారణ పరీక్షల్లో నిజమెంత?

కరోనా నిర్దారణ పరీక్షల్లో నిజమెంత?

కరోనా నిర్దారణ పరీక్షల నిర్దారణ ఫలితాలు అనేక అనుమానాలకు కారణమవుతున్నాయి. కరోనా ఫలితాల్లో పాజిటివ్ అని నిర్దారణ అయితే చాలు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఆ వచ్చిన ఫలితం తప్పుగా వచ్చిందని తెలిస్తే ఆయా వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం..కరోనా నిర్దారణ కిట్లలో ఉన్న లోపాల ప్రభావంగా నెగెటివ్ ఉన్న వ్యక్తులకు పాజిటివ్ అని నిర్దారణ అయితే జరిగే నష్టం తక్కువే అని చెప్పుకోవచ్చు. నిజానికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా నిర్దారణ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ అని రాగానే మరోసారి నిర్దారణ పరీక్షలు చేయించుకోకుండా డాక్టర్ల సలహాతో హోం క్వారెంటయిన్ కి వెళ్లేవారే అధికంగా ఉన్నారు. ఇలా తప్పుగా నిర్దారణ జరిగినప్పుడు ఆయా వ్యక్తుల మానసిక ప్రవర్తనపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అలా కాకుండా పాజిటివ్ అయిన వ్యక్తికి నెగెటివ్ అని తేలితే మాత్రం జరిగే నష్టాన్ని గుర్తించడం కష్టం. పీసీఆర్ కిట్లు,రాపిడ్ టెస్ట్ కిట్లలో ఉన్న లోపాల కారణంగా పలువురికి నెగెటివ్ అయితే పాజిటివ్ గాను, పాజిటివ్ అయితే నెగెటివ్ గాను చూపించడం మూలంగా కరోనా నిర్దారణ పరీక్షల విశ్వసనీయతపై సందేహాలు మొదలయ్యాయి. తాజాగా తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఈ కరోనా నిర్దారణ పరీక్షలు తప్పుగా నిర్దారణ అయ్యాయి. ఎలాంటి లక్షణాలు లేకున్నా తనకి పాజిటివ్ గా నిర్దారణ కావడంతో మరో మూడుచోట్ల కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు నెగెటివ్ అని తేలింది. కిట్లలో లోపం వల్ల ఆయనకు పాజిటివ్ అని రిజల్ట్ వచ్చిందని తేలిపోయింది. తమ అభిమాన నటుడికి కరోనా నిర్దారణ కావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనకి కరోనా నెగెటివ్ అని చిరంజీవి ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు ఆనందపడినా కరోనా కిట్లలో నెలకొని ఉన్న లోపాలు చిరంజీవి విషయంలో బయటపడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా నెగెటివ్ అని నిర్దారణ అయిందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.”కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి.. నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోలో డాక్టర్లను అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ట్రేస్స్ లేవని నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక, మరోసారి, మరో చోట నివృత్తి చేసుకుందామని నేను Tenet Labలో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా RT-PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ faulty కిట్ వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ నాపై చూపించిన అభిమానానికి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

చిరంజీవికి అనుమనం రావడంతో మూడుచోట్ల నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అలా కాకుండా ఆ ఒక్క పరీక్షతోనే ఆగిపోతే తనకి కరోనా కిట్లలో ఉన్న లోపం కారణంగా పాజిటివ్ గా నిర్దారణ అయిందని తెలిసేది కాదు. ఇలా నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో మానసికంగా కృంగిపోయి కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఒకవేళ లోపం కారణంగా తప్పుగా ఫలితం వచ్చిందని తేలితే ఆ ఫలితం ఖరీదు ఒక ప్రాణం అవుతుంది. అందుకే కరోనా వచ్చిందని తేలాగానే మరోసారి నిర్దారణ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.