iDreamPost
android-app
ios-app

ఊమెన్‌చాందీ ప్రకటన.. శైలజానాథ్‌ వివరణ

ఊమెన్‌చాందీ ప్రకటన.. శైలజానాథ్‌ వివరణ

ఆంధ్రప్రదేశ్ లో పేరుకే ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు పెద్ద చిక్కువచ్చి పడింది. దాదాపు ఏడేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ వైపు కన్నెత్తి చూడని సినీ నటుడు చిరంజీవి విషయంలో ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారా..? లేదా..? అనే అంశాన్ని కాంగీయులు కూడా తేల్చుకోలేకపోతున్నట్లుగా తాజాగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల ద్వారా అర్థమవుతోంది.

ఊమెన్‌ చాందీ అలా..

2014 తర్వాత రాజకీయాలను పూర్తిగా వదిలేసిన చిరంజీవి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చిరంజీవి చేయలేదు. 2019 ఎన్నికల్లోనూ అయన సైలెంట్‌గానే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగాకానీ, ఆ పార్టీలో ఉన్నట్లుగా కానీ ప్రకటన చేయలేదు. అయితే చిరు రాజకీయ పయనంపై ఎవరికి వారు ఊహించుకుంటుండగా.. ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి ఊమెన్‌ చాందీ ఇటీవల చేసిన ప్రకటన ఆసక్తిరంగా మారింది. చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జినే ఈ ప్రకటన చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.

శైలజానాథ్‌ ఇలా..

ఊమెన్‌చాందీ ప్రకటన అలా ఉండగా.. అందుకు భిన్నమైన ప్రకటనను ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ చేశారు. చిరంజీవి కాంగ్రెస్‌వాదేనంటూ పేర్కొన్నారు. సినిమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారని, భవిష్యత్‌లో మళ్లీ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారంటూ సాకే చెప్పుకొచ్చారు. చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాల్లో తీరక లేకుండా ఉండడం వల్లే చిరంజీవి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఊమెన్‌ చాందీ అన్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

చిరంజీవే తేల్చాలి..

చిరంజీవి కాంగ్రెస్‌లో లేరని ఊమెన్‌ చాందీ అనగా.. లేదు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారంటూ శైలజానా«థ్‌ ప్రకటించారు. ఒకరు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కాగా.. మరొకరు ఆ పార్టీ రాష్ట్ర రథసారథి కావడంతో.. ఇద్దరి ప్రకటనలకు ప్రాధాన్యత ఉంది. అయితే చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారా..? లేదా..? అనేది తెలియాలంటే.. మెగాస్టార్‌ మైక్‌ అందుకోవాలి. అప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. మరి చిరంజీవి క్లారిటీ ఇస్తారా..? లేక మౌనమే తన సమాధానమని చాటుతారా..?

Also Read : చిరంజీవి కాంగ్రెస్ లో లేరంట..