iDreamPost
android-app
ios-app

మైక్రో ఫైనాన్స్ మోసాల వెనక చైనా హస్తం

మైక్రో ఫైనాన్స్ మోసాల వెనక చైనా హస్తం

మైక్రో ఫైనాన్స్ ఆన్‌లైన్‌ యాప్ ల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇన్‌స్టంట్‌ లోన్ల పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న యాప్ నిర్వాహకులను ఇప్పటికే సైబర్‌‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మైక్రో ఫైనాన్స్ యాప్ లను నిర్వహిస్తున్న వారి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ యాప్ ల వెనుక చైనా హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

మైక్రో ఫైనాన్స్ ఆన్‌లైన్‌ యాప్ ల మోసానికి వందలాది మంది గురయ్యారు. ఈ కేసులో ఆనియన్‌‌ క్రెడిట్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, క్రెడ్‌‌ ఫాక్స్‌‌ టెక్నాలజీస్‌‌ పేరుతో కంపెనీలను ప్రారంభించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పాటు కంపెనీల డైరెక్టర్లు, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా శరత్ చంద్ర అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్యాష్‌‌ మామ, లోన్‌‌ జోన్‌‌, ధనాధన్‌‌ లోన్‌‌, క్యాష్‌‌ అప్‌‌, క్యాష్‌‌ బస్, మేరా లోన్‌‌, క్యాష్‌‌ జోన్ పేర్లతో మైక్రో ఫైనాన్స్ యాప్స్ ని రూపొందించినట్లు గుర్తించారు. వీటిని బెంగుళూరు, ఢిల్లీ నగరాలకు చెందిన వేరు కంపెనీలకు విక్రయించాడు. స్వయంగా తానే నిర్వహిస్తున్న క్యాష్‌‌ మామ, లోన్‌‌ జోన్‌‌ యాప్స్‌‌ను ఢిల్లీ, బెంగుళూరు, నాగపూర్ కంపెనీలతో లింక్ చేసి జనాలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇన్ స్టంట్ లోన్ పేరితో జనాలను ఆకట్టుకొని, తీసుకున్న మొత్తంపై అధిక వడ్డీ విధించి వేధింపులకు గురిచేస్తున్న ఈ కంపెనీలు అమాయకుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ యాప్స్ వెనక చైనా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చైనాకు చెందిన ఓమహిళను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై మహిళను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, గూర్ గావ్ లలో ఈ మహిళ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలు లక్షలాది మందిని పీల్చిపిప్పి చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా భావించి ఇప్పటికే భారత దేశం పలు చైనా యాప్ లను నిషేధించింది. కానీ… తాజా కేసులోనూ చైనా హస్తమున్నట్లు వెల్లడవ్వడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మైక్రో ఫైనాన్స్ యాప్స్ వ్యవహారంలో చైనాకు చెందిన మహిళ ప్రమేయం వ్యక్తిగతమైందా? లేక పరోక్షంగా చైనా వెనకుండి ఇలాంటి యాప్ లను నిర్వహిస్తుందా? అనే చర్చమొదలైంది. ఇప్పుడీ తీగ ఏ డొంకను కదిలిస్తుందో చూడాలి మరి.