ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆవేశంతో అన్నమయ్య డ్యాం కట్టలు తెంచుకోగానే తొలిగా గుట్టమింద ఉండే యాకిరెపల్లె ఆనవాళ్లను మొత్తం సదరం చేసింది చెయ్యేరు. తర్వాత సృష్టి స్థితిలయ కారుడైన శివయ్యకే సవాలు విసిరి పాలేశ్వరం గుడి ఆనవాళ్లే లేకుండా పెకిలించివేసింది. ఆ తర్వాత చెయ్యేటి ధాటికి విలవిల్లాడింది పులపత్తూరు.
చెయ్యేటి మీదుగా సూర్యోదయం, శేషాచలం కొండల మీదుగా సూర్యాస్తమయాన్ని చూస్తూ పచ్చని పైరుల మీదుగా వచ్చే పిల్లగాలుల లాలనలో సేదతీరే నూట యాభై కుటుంబాల పులపత్తూరు మొత్తం జలమయం అయింది.
చూస్తు చూస్తుండగానే పొలాలు, కళ్లాలు, కొట్టాలు నీటిలో కలిసిపోయాయి. ఇక ఇంట్లో ఉన్న ధాన్యం, గింజల సంగతి సరే సరి. నలభై ఇళ్లు తమ అస్థిత్వాన్ని మరిచి నేల సదరం అయ్యాయి. మిగితావి కూడా తమ రూపు రేఖలు కోల్పోయి మొండి గోడలుగా మిగిలాయి.
ఏ జరుగుతుందో తెలుసుకునేలోపే తెల్లవారుజాము నిద్రమత్తు నుంచి ఇంకా తేరుకోని ముప్పై పైగా శరీరాలు మంచంతో సహా , రాబోయే ప్రమాదాన్ని గ్రహించినా ఏమీ చెయ్యలేని మూడు వందలకు పైగా బర్రెలు, ఆవులు కొన్ని అలాగే తలుగులకే తమ ప్రాణాన్ని అర్పిస్తే మరికొన్ని జివ్వాలు నీటి సుడులలో గింగిరాలు తిరుగుతూ నింగికేగాయి. ఆ జల ప్రళయం నుంచి బతికి బయటపడ్డ ప్రతి ప్రాణిదీ ఒక జీవన్మరణ సమరమే అన్నట్టుగా సాగింది ఆ కొద్దిసేపు సమయం పాటూ.
పులపత్తూరును ముంచెత్తిన తర్వాత చెయ్యేటి ప్రతాపం ఎగువ మందపల్లె మింద పడింది. నదీ ప్రవాహానికి వాలుగా ఉండడంతో ఆ ప్రభావం మరింత ఉధృతంగా పడ్డం పడ్డమే మందపల్లె పులపత్తూరు మధ్యనున్న తారురోడ్డను లేవగొట్టింది. ఆ..! మన చెయ్యేరేలే ఎంత పెద్ద ఎల్లవొచ్చినా రాతి కట్టకం దాటి రాని వరద ఇప్పుడేం చేస్తుందిలే అనే అజాగ్రత్తలో అధికారుల మాటల్ని లెక్కచెయ్యకుండా అక్కడే ఉండిపోయిన ఊరి జనాలకు అప్పుడు గానీ అర్థం కాలేదు తామెంత పెద్ద జలగండాన్ని ఎదుర్కోబోతున్నామోనని.
ముందు జాగ్రత్తగా ఊరు ఖాళీ చెయ్యండని గ్రామ అధికారులు చెప్పినప్పుడు వినకుండా సగం తెలియని మొండితనంతో, సగం తెలిసిన మూర్ఖత్వంతో తామెంత తప్పు చేశామో ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. అప్పటికే నీళ్లు ఊరి మొత్తాన్ని ముంచెత్తి ‘కాల నాగు వలె కోరలు చాస్తూ’ పైపైకి రాసాగింది. ‘అమ్మా తల్లి నువ్వే మాకు దిక్కు’ అంటూ ఉందో లేదో తెలియని మారమ్మ తల్లికి మొక్కుకోవడం తప్ప చెయ్యదగింది ఏమీ లేదు అనుకుంటూ ముప్పై మందీ మిద్దె పైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ చెయ్యేటి భీభత్సానికి వణికిపోతూ నిలబడ్డారు.
కబంద హస్తాల్లా అంతెత్తునుంచి వచ్చే అలల ధాటికి పక్కనున్న ఇళ్లు ఆనవాళ్లు లేకుండా పోయింది. అరభయ్యేళ్లనుంచి ఎన్నో తరాలను చూసిన పాత మిద్దె ఫెట ఫెటమని కళ్ళముందే సగానికి కొట్టుకుపోయింది. అప్పటివరకూ నేను బాగుండాలి, మా వాళ్లు బాగుండాలి, మా ఇళ్లు బాగుండాలి, వ్యాపారం నిమిత్తం రైతుల దగ్గర నేను సేకరించిన వంద మూటెల వడ్లు బాగుండాలి అని దండం పెట్టుకుంటున్న ఆ ఇంటి యజమానికి వెన్నులో వణుకుపుట్టి ఈ క్షణం బతికితే చాలురా అనిపించింది.
అప్పుడే పెద్ద అల ఒకటి వచ్చి ప్రహరీ గోడని బద్ధలు చేసింది. తన వాళ్ల వైపు చూశాడు ముప్పై మందీ ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇంకొక్క అల ఇంకొక్క రాకాసి అల ఏ మాత్రం వచ్చి తాకినా ఇళ్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అదే జరిగితే ఊహించడానికే కష్టంగా ఉంది. ఈ ముప్పై శరీరాల తాలూకు ఆనవాళ్లు కూడా దొరకవేమో. ప్రకృతి ప్రకోపం తాలూకు భయంతో శరీరం కంపించిపోతోంది. నోట మాట రావడం లేదు. కాపాడ్తుందనుకున్న మారమ్మ తన గుడిని తాను రక్షించుకునే పనిలో ఉన్నెట్టుంది కాబోలు.
ఊర్లో అందరిదీ దాదాపూ అదే పరిస్థితి. అధికారుల మాట విని అప్పుడే ఖాళీ చేసింటే ఎంత బాగుండేది. కనీసం ప్రాణాలైనా దక్కిండేవేమో అనే సందిగ్ధంలో కొట్టుకుంటున్నాయి. ప్రాజెక్టు కట్ట తెగుతుందని ముందు రోజే చెప్పింటే ఖాళీ చేద్దుము కదా అని అధికారులను ఎంతమంది తిట్టుకుంటునినారో చివరి నుమిషంలో వాళ్ల మాటలు వినకుండా మొండిగా అక్కడే ఉండిన తమ పొరపాటును అంతే మంది చింతిస్తున్నారు. చెయ్యేటి ధాటికి ఊర్లో ఇళ్లన్నీ ఒక్కొక్కటే మొండి గోడలుగా, మరికొన్ని కళ్ళముందరే నేలమట్టమయి పోతున్నాయి.
“అమ్మా మన మిద్దెకేం అయితది పిల్లర్లు పోసి కట్టాం” అని బలంగానమ్మిన సందీప్ కు ఆ ఇళ్లు పిల్లర్లతో సహా పది అడుగులు కుడి పక్కకు జరిగి, భూమిలోకి కుంగిపోవడం చూస్తే గుండే గుభేల్మనింది. ఎట్నో పక్క ఇంటిపైకి వచ్చి సరిపొయింది గానీ అదే తన మాట విని ఆ ఇంటి పైకి వెళ్లింటే తను, తన, తల్లి, బిడ్డ, భార్యతో పాటు కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి అల్లెం తినడానికొచ్చిన తన బామ్మర్ది కుటుంబాన్ని కూడా తలుకుంటేనే ఒళ్లంతా పదురుపుడుతోంది.
తక్కువలో తక్కువ ముప్పై ఇళ్లను, పదకొండు మంది ప్రాణాలను, వందలాది పశువులను తనలో కలిపేసుకుని గానీ ఎగువ మందపల్లెను వదల్లేదు చెయ్యేరు వరద.
ఆ ఊరిమింద కొంతలో కొంత వరద ప్రభావం తగ్గించడంలో ఆ ఊరికి పడమర దిక్కున వరుసగా ఉన్న పాతకాలం చెట్ల పాత్ర మరువలేనిది. అంత వరదను తట్టుకుని కూడా నిటారుగా నిలబడి ఉండడం చూస్తే ప్రకృతి విలయతాండవం నుంచి ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది అనేది అక్షర సత్యం.
Also Read : చెయ్యేటి వరద#1