iDreamPost
android-app
ios-app

మాజీ ఏజీ దొమ్మాలపాటిపై మరో కేసు

మాజీ ఏజీ దొమ్మాలపాటిపై మరో కేసు

అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దొమ్మాలపాటి శ్రీనివాస్‌పై మరో కేసు నమోదైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపార సామ్రాజ్యంలో పలు మోసాలకు పాల్పడినట్లు తాజాగా వెల్లడైంది. తన వద్ద రెండు ఫ్లాట్లు నగదు తీసుకుని ఒక ఫ్లాట్‌ మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారని, రెండో ఫ్లాట్‌ విషయం అడిగితే బెదిరిస్తున్నారని కోడె రాజారామమోహనరావు అనే రిటైర్డ్‌ లెక్చరర్‌ మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు దొమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్యతో సహా మరికొందరిపై మంగళగిరి పోలీసులు మోసం, నేరపూరిత కుట్ర, విశ్వాసఘాతుకం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు.

దొమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య, బావ మరిది, క్యాపిటల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ నన్నపనేని సీతారామరాజు సహా పలువురు భాగస్వాములుగా సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో లేక్‌వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్నారు. ఫిర్యాదుదారుడి వద్ద రెండు ఫ్లాట్లకు డబ్బు తీసుకుని, ఒక ఫ్లాట్‌ మాత్రమే రిజిస్టర్‌ చేశారు. అంతేకాకుండా ఈ లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్స్‌ పక్కనే వారి స్థలంలో స్టార్‌ హోటల్స్‌ వస్తున్నాయని ఫిర్యాదుదారుడుకు చెప్పారు. దొమ్మాలపాటి శ్రీనివాస్‌ ఏజీ కావడంతో ఈ విషయం తమకు ముందుగానే తెలిసిందని నమ్మించారు. ఈ మేరకు రెండు ఫ్లాట్లకు ముందుగానే 75 లక్షల రూపాయలు తీసుకున్నారు. రెండో ఫ్లాట్‌ విషయంపై నిలదీయగా.. కేసులు పెట్టి జైలులో పెట్టిస్తామని వారు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదుదారుడు రాజా రామమోహనరావు వాపోయారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించక ముందు సీఆర్‌డీఏ పరిధిలో దొమ్మాలపాటి శ్రీనివాస్‌ భూములు కొనుగోలు చేసినట్లు ఆధారసహితంగా ఫిర్యాదు రావడంతో ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. అయితే దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కూడా బయటకు రాకూడదని కూడా హైకోర్టు గ్యాంగ్‌ ఆర్డర్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాంగ్‌ ఆర్టర్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో న్యాయవాది గలేటి మమతా రాణి పిటిషన్‌ వేశారు. ఈ విషయంలో తన వాదనలు కూడా వినాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగుతోంది.

దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ ( ఎన్‌వీ రమణ) ఇద్దరు కుమార్తెలు సహా మొత్తం 13 మందిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ వేసింది. గ్యాంగ్‌ ఆర్డర్‌ ఎత్తివేస్తే.. వీరు ఏ విధంగా నేరానికి పాల్పడిందనే ప్రాథమిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.