iDreamPost
iDreamPost
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడువి విలక్షణ రాజకీయాలు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నీతులు చెపుతారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని అస్సలు పాటించరు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు తనకు అధికారం ఇచ్చారని, అందువల్ల ఎవర్నీ సంప్రదించాల్సిన అవసరం లేదంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తారు. తాను అధికారం కోల్పోతే, ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని, ప్రతిపక్షం గొంతు నొక్కొద్దని పదేపదే చెప్తుంటారు.
అలాగే తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు బందులు చేయకూడదని, బందులు, ధర్నాలు విధ్వంసానికి కారణం అవుతాయని, అప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందని ఉపన్యాసం ఇస్తారు. బందులకు ప్రతిపక్షాలు పిలుపిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తారు. ప్రతిపక్ష నేతలను, లేదా బందుకు పిలుపు ఇచ్చిన పార్టీల, సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేయిస్తారు. ఇంకా కొంతమందిని గృహనిర్బంధం చేయిస్తారు. నేతలను అష్టదిగ్భంధనం చేసి బందులు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటారు. అదే తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యంలో బందులు, నిరసనలు, ధర్నాలు కీలకమైనవని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని చెపుతారు.
అవసరం అనుకుంటే తాను అధికారంలో ఉన్నా కూడా ఆయనే స్వయంగా బందులకు పిలుపిస్తారు. ధర్నాలకు నాయకత్వం వహిస్తారు. 2019 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా స్వయంగా చంద్రబాబే రాష్ట్ర బందుకు పిలుపిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే నిరసన ప్రదర్శనలు చేయించారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి వస్తే ఆయన కాన్వాయ్ పై రాళ్ళేయిస్తారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన దీక్షలు చేస్తారు. తన అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి చంద్రబాబు దగ్గర గేమ్ రూల్స్ మారుతుంటాయి. ఆ మార్పులు కూడా ఆయన రాజకీయాలకు అనుకూలంగానే ఉంటాయి.
Also Read : Chandrababu May Lost Pattabhiram – బాబు ఇంకొకరిని వెతుక్కోవాల్సిందేనా..?
గడచిన ఐదేళ్ళలో రాష్ట్రంలో బందులు వద్దని ఉపన్యాసాలిచ్చిన చంద్రబాబు, 2019 ఎన్నికల తర్వాత, తాను అధికారం కోల్పోయాక ఇప్పుడు బందులు చేయడం ప్రజాస్వామ్య హక్కు అంటూ ప్రసంగాలు ఇస్తున్నారు. దాడులకు దిగండి అంటూ తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉండగా అవినీతి ఆరోపణలు చేసినా, విశాఖ నుండి గంజాయి దేశంలోని అన్నిప్రాంతాలకు రవాణా అవుతోంది అని వార్తలు వచ్చినా, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా ఆయన తీవ్రంగా ఖండించేవారు. ఇలాంటి వార్తలు, ఆరోపణలు రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకాలు అంటూ, ఇలాంటివి ప్రచారం చేయడం వల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు రావని వాదించేవారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు, తనకు అధికారం లేకపోయే సరికి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రవాణా పెరిగిపోయిందని, యువత మత్తుపదార్ధాలకు బానిసలు అవుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ప్రచారం చేస్తున్నారు.
సాక్షాత్తు రాష్ట్రపతికి ఈ రోజు ఇచ్చిన వినతిపత్రంలో ఈ రాష్ట్ర ఇమేజ్ ను చంద్రబాబు చాలా పెద్ద దెబ్బ తీశారు. దేశం మొత్తానికి మత్తుపదార్ధాలు ఆంధ్రప్రదేశ్ నుండే సరఫరా అవుతున్నాయని, యువత మత్తులో జోగుతోందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో మాఫియా శక్తులు పెత్తనం చేస్తున్నాయని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేదని భయబ్రాంతులకు గురిచేసే విధంగా, రాష్ట్ర ఇమేజ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు చూస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పారిశ్రామికవేత్త కూడా ముందుకురారు.
ఈ రాష్ట్రం మాఫియా చేతుల్లో ఉంది అని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పడం రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీయడం కాక ఏమవుతుంది? తనకు అధికారం లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అవ్వాల్సిందేనా? తనకు అధికారం ఇస్తే ఈ రాష్ట్ర ఇమేజ్ ప్రపంచ వ్యాప్తం అవుతుంది, రాష్ట్రం వెలిగిపోతుంది. తనకు అధికారం లేకపోతే తానే స్వయంగా ఈ రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీస్తారు. ఇవేమి రాజకీయాలు చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రం కోసం మీరు పనిచేస్తారా లేక మీకోసం ఈ రాష్ట్రం మొత్తం పనిచేయాలా? వీటిని ఎలాంటి రాజకీయాలు అంటారో దేశంలోని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబే చెప్పాలి. ప్రజలు కూడా ఈ తరహా రాజకీయాలు చూసి తగిన నిర్ణయం తీసుకోవాలి.
Also Read : Chandrababu Delhi Tour – చంద్రబాబు కు మోడి దర్శనం దక్కనట్లే