ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి, పబ్లిసీటీ కన్పిస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నంతగా ప్రత్యామ్నాయ మీడియా వ్యవస్థలు లేకపోవడంతో పెద్దగా జనానికి అర్ధమయ్యేది కాదు. కానీ ఇప్పుడుమాత్రం ప్రతి మాటను, వార్తను, కామెంట్‌ను కూడా గతంతో పోల్చి సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు.. ఇలా బైట పడ్డ కొన్ని విషయాలు జనాన్ని కాస్తంత ఆశ్చర్యపరుస్తున్నాయనే చెప్పాలి. ఇంకాస్త ముందుకువెళితే వాళ్ళకు నిజానిజాలను వెంటనే తెలియజేస్తున్నాయి.
గత ఇరవయ్యేళ్ళుగా వ్యవసాయ రంగంలో ఉన్న వారెవరినైనా.. నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలలో ఎవరు రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే వారి నుంచి వచ్చే జవాబు రాజశేఖర్‌రెడ్డి. ఒక పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య సేద్యం చేస్తున్న రైతులపై కరెంటు ఛార్జీల పిడుగువేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే. కష్టాల్లో ఉన్న రైతులకు ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది వైఎస్సార్ మాత్రమే. ఈ రెండు విషయాలను రైతులు ఎప్పటికీ మర్చిపోరనే చెప్పాలి. ఈ ఇద్దరు నాయకుల పాలనను చూసిన రైతులు ఉచిత విద్యుత్‌కు పేటెంట్‌ను వైఎస్సార్‌కే కట్టబెడతారు.
తన దెబ్బకు ఇరవయ్యేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు లేరనుకున్నారో, లేక రైతులకు ఆ మాత్రం గుర్తు ఉండదనుకున్నాడో గానీ చంద్రబాబునాయుడు ఉచిత విద్యుత్‌కు కూడా తానే ఆధ్యుడునని మైకందుకున్నారు. ఇదే ప్రస్తుతం ఆయన్ను ఇరుకున పెడుతోంది. విద్యుత్ బిల్లులకు నగదు బదిలీ విషయంలో కొంచెం వెనకబడ్డట్టు కన్పించిన వైఎస్సార్‌సీపీ నాయకులు పక్కాగా ఇక్కడే పట్టుకున్నారు. దీంతో చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు, బషీర్‌బాగ్, కాల్దారిల్లో రైతులపై చేసిన ఘనకార్యాల చిట్టాను బైటకు తీసారు.
ఉచిత విద్యుత్ తీసేస్తున్నారహో.. అంటూ చాటింపు వేయడం ద్వారా ప్రజలను తనవైపు తిప్పుకోవచ్చనుకున్న చంద్రబాబుకు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న ఎదురుదాడి నేపథ్యంలో దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబు హయాం నుంచీ ఉన్న విద్యుత్ బోర్డుల నష్టాలు, పెరిగిపోయే బిల్లులు, సరఫరా కష్టాలు తదితర విషయాలపై లోతుకు వెళితే తప్పకుండా టీడీకే నష్టం అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ మంత్రులు కూడా ఎత్తి చూపుతున్నారు.
అయితే టాపిక్ భుజానికెత్తుకోబోయే ముందు చంద్రబాబు ఎటువంటి హోం వర్క్‌చేయకుండానే మైకుముందుకొచ్చేసారా? అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేద్దామనుకున్నా గానీ చంద్రబాబు అండ్ బృందానికి చిరిగి చేటంత.. ఆ తరువాత చాపంత అవుతోంది. అంతిమంతా ప్రజల ముందు పలుచన కావాల్సి వస్తోంది. ప్రభుత్వంపై ఆరోపణల వరకు ఓకే గానీ.. ఉచిత విద్యుత్‌కు మేమే ఆధ్యులం అంటేనే చిక్కొస్తోందని టీడీపీ నాయకులే బుర్రలు గోక్కుంటున్న పరిస్థితి ఉంది.