బలమున్నప్పుడే ఆ వ్యక్తితో చంద్రబాబుకి అవసరం , అవసరం తీరిన తరువాత పక్కన పెట్టటం ఆయన సహజ గుణం అని రాజకీయ వర్గాలలో ఒక ప్రచారం ఉంది,నాటి ఎన్టీఆర్ నుండి నేటి కోడెల వరకూ ఎందరో నాయకుల భంగపాటే ఇందుకు సాక్ష్యం అంటారు..
ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతికి , వర్ధంతికి ఆయన విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని తీర్మానం చేసే చంద్రబాబు తాను కేంద్ర ప్రభుత్వంలో రెండు దఫాలుగా 11 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో ఏనాడూ ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్ లో పెట్టించేందుకు కృషి చేయలేదన్నది నిష్ఠుర సత్యం.గత ఏడాది రాజధాని ప్రాంతంలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ వారసులెవరూ హాజరు అయ్యింది కూడా లేదు .
ఇటీవల గుంటూరు జిల్లా వినుకొండలో నాగార్జున సాగర్ కాలువ పై ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తొలగించాలని ఒక సామాజిక కార్యకర్త పిటిషన్ వేయగా అది తొలగించమని కోర్టు ఆర్డర్ ఇచ్చేవరకూ టీడీపీ తరపున ఏ విధమైన స్పందనా లేదు . వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 300 పై చిలుకు పిటిషన్లతో కోర్టు కెక్కారు కానీ పార్టీ వ్యవస్థాపకుని విగ్రహాన్ని కాపాడుకోవటానికి పిటిషన్ వేయలేకపోయారు . విగ్రహాన్ని కూల్చివేసిన తరువాత మాత్రం యధావిధిగా వైసీపీ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసి ఎన్టీఆర్ అభిమానుల కళ్ళు తుడిచే ప్రయత్నం చేశారు .
Also Read:న్యాయమూర్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సజ్జల
ఇదే గుంటూరు జిల్లాకి చెందిన మరో ప్రముఖ టీడీపీ నాయకుడు లాల్ జాన్ బాషా , 2013 లో రోడ్ ప్రమాదంలో దుర్మరణం చెందిన తర్వాత ఆ కుటుంబాన్ని ఏ మాత్రం ఆదరించారో అందరికీ తెలిసిందే . సుదీర్ఘ కాలం టీడీపీకి సేవలందించిన బాషా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించారు, గుంటూరు నుండి లోక్ సభ , రాజ్యసభలకు ప్రాతినిధ్యం వహించారు. లాల్ జాన్ బాషా దుర్మరణం చెందిన తర్వాతి ఏడాది ఎన్నికల్లో లాల్ జాన్ బాషా సోదరుడు ,మాజీ ఎమ్మెల్యే అయినా జియావుద్దీన్ కు టికెట్ కూడా కేటాయించలేదు . అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో సీనియర్ నాయకుడు , మైనార్టీల్లో పట్టున్న నేత భాషా స్మారకార్ధం కనీసం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో ఓ నిర్మాణానికి ఆయన పేరు పెట్టే ఆలోచన కూడా చేయలేదు .
ఇహ గత ఏడాది ఇదే రోజు బలవన్మరణం చెందిన కోడెల శివప్రసాద్ రావు విషయానికొస్తే టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేత . 1983 నుండి 1999 వరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల గుంటూరు జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా చెప్పొచ్చు . గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు నాయకులు కోడెల ఆశీర్వాదంతోనే టిక్కెట్లు పొందారన్నది బహిరంగ సత్యం . ఎన్టీఆర్ , బాబు కేబినెట్ లలో కీలక మంత్రి పదవులు నిర్వహించిన కోడెల ఒకానొక దశలో బాబు తర్వాత టీడీపీ నాయకుడు ఎవరంటే తన పేరే వినిపించేంత బలం సంపాదించుకున్నారు . 2014 ఎన్నికల తర్వాత కోడెలకి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా పక్కన పెట్టిన బాబు చివరికి స్పీకర్ గా ఎంపిక చేశారు .
2019 ఎన్నికల తర్వాత కోడెల కొన్ని ఆరోపణలలో చిక్కుకోగా బాబు అండగా నిలవకపోగా నిరాదరణకు గురి చేయటం , వర్ల రామయ్య లాంటి సొంత పార్టీ నేతలే పార్టీ పరువు తీశాడంటూ ప్రెస్ ముందు వ్యాఖ్యానించడంతో మనస్తాపం చెందిన కోడెల అనారోగ్యంతో గుంటూరులో హాస్పిటల్ లో చేరగా ఆ సందర్భంలో గుంటూరులో పర్యటించిన బాబు పరామర్శకి కూడా నోచుకోలేదు . తరువాత తన పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తానని అపాయింట్మెంట్ కోరినా ఇవ్వకపోవడం . చలో ఆత్మకూరు పేరిట పల్నాడులో టీడీపీ చేపట్టిన కార్యక్రమానికి పల్నాటి పులిగా పేరొందిన తనకు పిలుపు లేకపోవడంతో తీవ్ర అవమానానికి గురయ్యాడు కోడెల .
Also Read:దేవాలయాలలో వరుస ఘటనలు…కుట్రకోణం ఉందంటూ అనుమానాలు
తర్వాతిరోజుల్లో వివిధ కారణాలతో కోడెల బలవన్మరణం చెందగా , వెంటనే స్పందించిన బాబు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించటానికి కోడెల మరణాన్ని వాడుకోవడం విచిత్రం . హైద్రాబాద్ నుండి కోడెల భౌతిక కాయాన్ని కోడెల అభిమానులున్న పల్నాడు ప్రాంతం మీదుగా తీసుకురాకుండా తన సానుభూతి రాజకీయాల కోసం టీడీపీకి పట్టున్న విజయవాడ మీదుగా ఊరేగింపుతో తీసుకురావడం బాబు మార్క్ రాజకీయ వినియోగం అని చెప్పొచ్చు .
నాడు కోడెల అంత్యక్రియల తర్వాత కోడెల వారసులైన కొడుకు , కూతురుకి తాను , టీడీపీ పార్టీ అండగా ఉంటుందని , వారి భవిష్యత్ నా బాధ్యత అని మీడియా సాక్షిగా చెప్పిన చంద్రబాబు తరువాత ఆ ఊసే ఎత్తలేదు . 2014 నుండి 19 వరకూ నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ గా పని చేసిన కోడెల తనయుడు శివరాంకి మళ్లీ నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ భాద్యతలు అప్పచెబుతారని , కోడెల అభిమానులు పేట టీడీపీ శ్రేణులు ఆశించగా చంద్రబాబు అతన్ని నియమించకుండా 2019 ఎన్నికల్లో ఓడిపోయినా ఆర్ధికంగా బలంగా ఉన్న చదలవాడ అరవింద బాబుని నియమించారు . మరోవైపు 2014 , 2019 ఎన్నికల్లో కోడెల ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లిలో కోడెల మరణంతో ఖాళీ అయిన టీడీపీ ఇంచార్జ్ పదవి కోడెల తనయ , సత్తెనపల్లిలో ఫార్మా కంపెనీ నడుపుతున్న పూనాటి విజయలక్ష్మి ఆశించగా ఆమెకి కూడా మొండి చెయ్యి ఎదురైంది .
నేటికి కోడెల చనిపోయి యాడాది అయ్యింది . ఈ రోజు ప్రధమ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ వేధింపుల మూలంగా కోడెల మరణించారని రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు చేపట్టాలని బాబు పిలుపివ్వడంతో పాటు ప్రభుత్వం కోవిడ్ నిబంధనల పేరుతో కోడెల వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుపడుతుంది అని బాబుతో పాటు కొందరు టీడీపీ నేతలు ఆరోపించారు . అయితే కోడెల వర్ధంతికి మూడు రోజుల ముందు నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు 99 టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కోడెల తన గెలుపుకి సహకరించకుండా మోసం చేసారని దివంగత కోడెల పై సంచలన ఆరోపణలు చేయటంతో పాటు , తద్వారా టీడీపీ పార్టీకి ద్రోహం చేశారని అన్యాపదేశంగా తేల్చి చెప్పారు .
Also Read:దమ్మాలపాటి వాదన ఇలా.. ఆయన లాయర్ వాదన అలా.. ఏది నిజం..?
ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా కోడెల తనయుడు తన ఇంటి వద్ద వర్ధంతి కార్యక్రమం చేపట్టారు కానీ , టీడీపీ ఇంచార్జ్ హాస్పిటల్ పక్కనే ఉన్న నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి ఒక ఫ్లెక్సీ కట్టలేదు . నివాళులర్పించలేదు సరికదా కనీసం చిత్రపటం పెట్టి పూల మాల వేసింది కూడా లేదు . స్థానిక నియోజక వర్గ ఇంచార్జ్ కి కోడెల పట్ల వ్యతిరేకత ఉండొచ్చు . కానీ రాష్ట్ర వ్యాప్తంగా కోడెల వర్ధంతి నిర్వహించమని ప్రకటించిన బాబు గారు కోడెల సొంత నియోజక వర్గంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యాలయంలో నివాళులర్పించే కార్యక్రమం చేపట్టే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో నరసరావుపేట టీడీపీ శ్రేణులు , కోడెల అభిమానులు బహిరంగంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా , బాబు నైజం ఇంతే అని కొందరు సీనియర్ నాయకులు వ్యాఖ్యానించడం విశేషం