iDreamPost
iDreamPost
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి.. చివరికి ఒక చిన్న మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదయ్యారు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కొత్తగా కుప్పం మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదుచేయించుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఆ మున్సిపాలిటీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆయనకు అక్కడి పరిణామాలు, పార్టీ పరిస్థితి తీవ్ర టెన్షన్ కు గురిచేస్తున్నాయి. కుప్పంను కంచుకోటగా భావించిన బాబుకు గత సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానికులు వరుసగా షాక్ ఇస్తూనే ఉన్నారు. పరాజయాల పరంపరకు బ్రేక్ వేసి.. కనీసం ఈ ఒక్కటైనా గెలుచుకోలేకపోతే ఇటు పార్టీ పరువు.. అటు తన ప్రతిష్ట మంటగలిసిపోతాయి. అందుకే కుప్పం విషయంలో ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ తో పార్టీ నాయకులను కూడా నిద్రపోనివ్వడం లేదు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షక కమిటీని వేసినా.. నిరంతరం ఫోనులో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబుతో ఇంత టెన్షన్ ఎప్పుడూ చూడలేదని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడే ఎందుకు నమోదు
కుప్పం ఎమ్మెల్యేగా ఏడుసార్లు గెలిచిన చంద్రబాబు ఇంతకు ముందెప్పుడూ స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో మెంబరుగా నమోదు చేసుకోలేదు. ప్రజాప్రతినిధిగా తొలిసారి ఇప్పుడే కుప్పం కౌన్సిల్లో నమోదయ్యారు. సాంకేతికంగా, నిబంధనల ప్రకారం అది తప్పు కూడా కాదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏదైనా ఒక స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదయ్యే వెసులుబాటును చట్టం కల్పించింది. కానీ దాన్ని ఇంతకు ముందెన్నడూ ఉపయోగించుకోని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆ పని చేశారన్నదే ఆసక్తికరం. స్థానిక సంస్థల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ, కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల బలం సరిసమానంగా లేదా ఒకటి రెండు అటూఇటుగా ఉన్నప్పుడు జరిగే ఓటింగులో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే నిర్ణయాత్మకంగా మారతాయి. కుప్పం ఎన్నికల్లో ఒకవేళ అటువంటి పరిస్థితే తలెత్తితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు.
Also Read : Tdp,Nara Lokesh – చినబాబూ.. ఎందుకయ్యా? ఈ రాజకీయం.. తమ్ముళ్లే ఫీలవుతుంటే?
టెన్షన్ మామూలుగా లేదు
గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన కంచుకోటపై వైఎస్సార్సీపీ పట్టు బిగించడం చంద్రబాబుకు రాజకీయంగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అందులోనూ తన చిరకాల ప్రత్యర్థి ,రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత రెండున్నరేళ్లుగా కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడంతో అక్కడ టీడీపీ పరిస్థితి దిగజారిపోయింది. సొంత నియోజకవర్గాన్నే కాపాడుకోలేకపోయారన్న అప్రతిష్ఠను బాబు మూటకట్టుకోవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రమైన కుప్పం మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడటం.. అక్కడ వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా మళ్లీ మంత్రి పెద్దిరెడ్డే రంగంలోకి దిగడంతో చంద్రబాబు టెన్షన్ తారాస్థాయికి చేరింది.
టీడీపీ పరంగా ఎన్నిక పర్యవేక్షణకు మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీలతో ఏకంగా ఒక కమిటీనే వేశారు. అయినా నమ్మకం కుదరని చంద్రబాబు 24 గంటలూ ఫోనులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తన పార్టీ కార్యక్రమాల కంటే ప్రత్యర్థుల కదలికలపైన ఎక్కువగా ఆరా తీస్తున్నారు. రోజుకు ఐదారుసార్లు ఫోన్లు చేస్తున్నారు. దాంతో ఆయన నుంచి ఫోన్ వస్తే చాలు టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఇంత చేస్తున్నా కుప్పంలో వైఎస్సార్సీపీని నిలువరించలేక పోతున్నారు. 25 వార్డుల్లో ఇప్పటికే ఒక వార్డును ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న అధికార పార్టీని మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ నేతల ఊహకు అందని వ్యూహాలతో పరుగులు తీయిస్తున్నారు.
Also Read : Muncipal Nominations, Chandrababu, TDP – అడ్డుకుంటే.. అన్ని నామినేషన్లు ఎలా వేశారు బాబూ..?