iDreamPost
android-app
ios-app

గొంతెమ్మ కోరికలతో బాబు నిరసన పిలుపు..

  • Published Jan 10, 2022 | 2:19 PM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
గొంతెమ్మ కోరికలతో బాబు నిరసన పిలుపు..

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. తన సొంత అజెండా అమలు కోసం పార్టీ కేడర్ నిరసనలకు దిగాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. మంత్రి పెద్దిరెడ్డిని బర్త్ రఫ్ చేయాలి, పీఆర్సీని పున‌ఃస‌మీక్షించాలి, ధరలు తగ్గించాలి వంటి పరిష్కారానికి వీలు కాని గొంతెమ్మ కోరికలు వంటివి కొన్ని డిమాండ్లుగా పేర్కొంటూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునివ్వడం విచిత్రం. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైఎస్సార్ సీపీ డిఫెన్స్‌లో పడిందని అన్నారు. మైనింగ్ దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు.

పీఆర్సీని పున‌ఃస‌మీక్షించాలి,నిత్యావసరాల ధరలు తగ్గించాలని, గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లోనే మైనింగ్ దోపీడీ జరుగుతోందని, తక్షణమే మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రూ. కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నాడు-నేడు కార్యక్రమాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. పంచాయతీలలో జగన్ రెడ్డి విపరీతమైన పన్నుల భారాన్ని మోపారు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న హామీ నెరవేర్చాలి. సమగ్ర తాగునీటి పథకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అసెంబ్లీపై అలిగాక పెరిగిన ఆతృత..అసహనం..

మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబులో ఆతృత..అసహనం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆవేశంలో శపథం అంటే చేసేశారు కానీ దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకు అర్థం కావడం లేదు. పరిస్థితులు అన్నీ ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. అందుకే అసహనం, అర్థం పర్థం లేని నిరసన పిలుపులు.
సీఎం కావాలంటే ముందుగా ఎమ్మెల్యేగా గెలవాలి. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలవడానికి తరచుగా అక్కడకు వెళ్లి రోడ్డు షోలు వగైరాలు చేస్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీని మునిసిపల్ ఎన్నికల్లో ఓడించిన విషయం గుర్తుకువస్తుంది. అందుకే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఒకసారి, బర్త్ రఫ్ చేయాలని మరోసారి డిమాండు చేశారు. బాబు కోరుకుంటున్నట్టు అది సాధ్యం అయి కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచినా ముఖ్యమంత్రి కావాలంటే ఎలా? అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలి అనే డిమాండ్. మామూలుగా ముఖ్యమంత్రిని పదవి నుంచి దిగిపో అంటే బాగుండదు కనుక ధరలు తగ్గించాలి, పీఆర్సీని పున సమీక్షించాలి. సచివాలయ ఉద్యోగులను తక్షణం పర్మినెంట్ చేయాలి అనే పరిష్కారానికి వీలు కాని డిమాండ్లు తెరపైకి తెచ్చారు. వీటి ఆధారంగా తెలుగు తమ్ముళ్లు వీధి పోరాటాలు చేసైనా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. అదీ బాబు గారి అంతరార్థం!

అయితే అంత సినిమా ఉందా?

అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్దమని, అందులో తెలుగు తమ్ముళ్లే సిద్దహస్తులని, వారి బండారం బయట పెడతామని మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. పీఆర్సీపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే దానిపై పునర్ సమీక్ష ఎందుకు? సచివాలయ ఉద్యోగులకు జులై నుంచి పే స్కేల్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా వారిని రెచ్చగొట్టాలని చూడటం రాజకీయం కాక మరేమిటి? ధరలు తగ్గించాలనే డిమాండ్ జనం అంతా తన వెనుక నడిచేస్తారని బాబు ఊహ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని సార్లు ధరలు తగ్గించారు? అన్న సంగతి జనానికి బాగా తెలుసు. విద్యుత్తు చార్జీలు తగ్గించమని జనం కోరితే ఏకంగా పోలీసులతో కాల్పులు జరిపించిన చరిత్ర బాబుగారిది. అందుకే ఈయన ఇచ్చే ఇలాంటి పిలుపులను జనం ఎప్పుడో పట్టించుకోవడం మానేశారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా గెలవాలని, జనం పల్స్ తెలుసుకోవాలని బాబుకు అంతగా ఆత్రుతగా ఉంటే ముందు తను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవాలని సవాల్ చేస్తున్నారు.