“అమరావతి రాజధానిగా ఉంటుంది అని సీఎం జగన్ చెప్పాలి లేదా జగన్ రెఫరెండంకు సిద్ధం కావాలి. 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందాం, జగన్ గెలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. అధికారం కోసం పోరాటం చేయడం లేదు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని తేలితే నేను రాజీనామాకు సిద్ధం”
– అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనభేరి సభ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
“ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళదాం.. మూడు రాజధానులపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. ముందుగా మీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించు”
– అమరావతిపై ప్రారంభించిన జూమ్ యాప్ ఉద్యమం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.
“హెరిటేజ్ మాదేనని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేస్తారా?”
– గతంలో అసెంబ్లీలో ఉల్లి కొరత, ధరల పెరుగుదలపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి, రెండు, మూడు కాదు.. పదుల సార్లు చంద్రబాబునాయుడు రాజీనామా డ్రామాలు లేవనెత్తారు. ఇప్పుడు మరోసారి మళ్లీ వాడేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారు.
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తి మాట కూడా అనకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయొద్దంటూ కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పేరు కూడా ప్రస్తావించలేదు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలంటూ వింత వాదన చేశారు. అంతేకాకుండా ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా విమర్శలకు దిగారు. అంతటితో ఆగకుండా రాజీ”డ్రామా”లు మొదలెట్టేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఏ ఆందోళన కార్యక్రమాలకు వెళ్లినా చంద్రబాబు వారికి మద్దతుగా తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్దం అంటూ ప్రకటించడం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. పదే పదే అవే మాటలు చెప్పడం బాబుకు అలవాటైందో ఏమో కానీ.. విని విని ప్రజలు మాత్రం విసుగు చెందుతున్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో చంద్రబాబు ఈ రాజీనామా డైలాగు కొట్టడం ఎన్నోసారి అని లెక్కలేసుకుంటున్నారు.
అసలు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు విశాఖ కోసం రాజీనామా చేస్తారు? పోనీ రాష్ట్రం మొత్తం రాజీనామా చేస్తే ఎన్నికలొస్తాయి కానీ, ప్రైవేటీకరణ ఆగుతుందా..? అంటే లేదని చెప్పాల్సిందే. ఎందుకంటే అలా జరిగే వీలుంటే తమ ప్రయోజనాల కోసం ఏదో ఒక అంశంపై పోరాడే ప్రతీ ప్రభుత్వమూ అదే పని చేస్తుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రతీసారి రాజీనామాల ప్రస్తావన తేవడం తనకే చేటు తెస్తుందని ఎప్పటికి గుర్తిస్తారో, ఏమో!
అధికారములో ఉండగా ఏ సమస్య మీదైనా చంద్రబాబు రాజీనామ చేశాడా?లేక రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం?అని ప్రతిపక్షానికి సవాల్ విసిరాడా ?.. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నిత్యం రాజీనామా సవాల్ విసురుతుంటారు.