హీరోలకే కాదు ప్రతి ఒక్కరికి వారసులంటే ఎంత ప్రేమో వేరే చెప్పాలా. దీనికి ఎవరూ మినహాయింపు కారు. అందుకే స్టార్లు తమ పిల్లలను తెరమీదకు తీసుకొచ్చేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్త పడతారు. తమ స్టార్ డంని నిలబెట్టి గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. అయితే వాళ్ళ పేర్లనే సినిమాకు టైటిల్ గా పెట్టడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిదే ఈ ఉదాహరణ. 1991 సంవత్సరం. నాగార్జున శివ ఇమేజ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రయోగాలు చేద్దామని తీసిన ప్రేమ యుద్ధం, నేటి సిద్దార్థ, ఇద్దరూ ఇద్దరే దారుణంగా దెబ్బ తిన్నాయి. అదే సమయంలో తమిళ దర్శకుడు ప్రియదర్శన్ తో నిర్ణయం చేస్తున్నారు.
మరో అరవ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమానే చైతన్య. అప్పటికే ఆయనకు విజేతలు, మై డియర్ మార్తాండ రూపంలో తెలుగులో మంచి డబ్బింగ్ హిట్స్ ఉన్నాయి. అందుకే కారు రేసు బ్యాక్ డ్రాప్ లో ప్రతాప్ పోతన్ చెప్పిన క్రైమ్ డ్రామా స్టోరీ నాగార్జునకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశారు. బయట సినిమాలకు చాలా అరుదుగా డైలాగులు రాసే విఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు సంభాషణలు సమకూర్చేందుకు ఒప్పుకోవడం అప్పట్లో సంచలనం. గౌతమి హీరోయిన్ గా మెయిల్ విలన్ పాత్రలో గిరీష్ కర్నాడ్ ను తీసుకున్నారు. హీరో దర్శకుడు ఇద్దరికీ సంగీతానికి ఇళయరాజా కన్నా బెస్ట్ ఛాయస్ కనిపించలేదు.
శ్రీ తిరుమలేశా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యం బాబు మంచి బడ్జెట్ లోనే చైతన్యను తెరకెక్కించారు. జర్నలిస్ట్ సుధాకర్(చిన్నా) డిఐజి హత్యను కళ్లారా చూసి దాన్ని ఫోటోలు తీస్తాడు. వాటిని బయటపెడదాం అనుకునే లోపే విలన్లు చంపేస్తారు. కన్ను మూస్తూ చైతన్య(నాగార్జునా)కు ఓ క్లూ ఇస్తాడు. అది పెద్ద ఎత్తున జరగబోయే కారు రేసులో ఉంటుంది. అది చైతన్య పసిగట్టి దీని వెనుక ఉన్నది తను ప్రేమించిన పద్మిని(గౌతమి)తండ్రి హరిశ్చంద్రప్రసాదే(గిరీష్ కర్నాడ్)నని కనిపెడతాడు. లైన్ పరంగా బాగున్నప్పటికీ రేసుని ఎక్కువ సేపు సాగదీయడం, అక్కడ జరిగే ఎపిసోడ్లేవీ ఆసక్తికరంగా లేకపోవడంతో చైతన్య ఫ్లాప్ అయ్యింది. కానీ పాటలు మాత్రం ఆడియో పరంగా బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఓ లైలా ఓహో లైలా కోపమేల ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ హాట్ ఫేవరేట్.