iDreamPost
android-app
ios-app

Central government – రామాయపట్నానికి రాం రాం అంటున్న కేంద్రం

  • Published Dec 01, 2021 | 2:07 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Central government –  రామాయపట్నానికి రాం రాం అంటున్న కేంద్రం

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ లో ప్రతిపాదించిన ప్రత్యేక హోదా ని మోదీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినా పూర్తి నిధులు కేటాయించేందుకు ససేమీరా అంటోంది. ఇప్పుడు విభజన చట్టంలోనే ఉన్న రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కొత్త మెలిక పెడుతోంది. పోర్టు నిర్మాణ బాధ్యత తమది కాదంటూ చెబుతోంది. రాజ్యసభలో మంత్రి సర్వానంద్ సోనోవాల్ సమాధానం అందుకు అనుగుణంగానే ఉంది. దాంతో ఏపీలో పోర్టుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆశలపై మరోసారి బీజేపీ సర్కారు నీళ్లు జల్లుతున్నట్టే కనిపిస్తోంది.

ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యతనిచ్చేందుకు మోదీ సర్కారు సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో ఇది స్పష్టమయ్యింది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అపారంగా నష్టపోయిన రాష్ట్రానికి తక్షణ విపత్తు సాయం కింద రూ వెయ్యి కోట్లు కోరినా ఇప్పటి వరకూ ఉలుకుపలుకూ లేదు. పైగా కేంద్ర బృందాలు మూడు రోజుల పాటు పర్యటించి, అపార నష్టం అని నిర్ధారించినా నేటికీ స్పందన రాలేదు. అదే సమయంలో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు గురించి చెప్పిన సమాధానం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో రామాయపట్నం, బందరు, భావనపాడు పోర్టుల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్లు పిలిచింది. రెండుసార్లు అవి పూర్తికాకపోవడంతో ఆ ప్రక్రియపై ప్రత్యేకంగా ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో రామాయపట్నం పోర్టుని కేంద్రం నిర్మిస్తుందని ఆశిస్తోంది. విభజన చట్టానికి సంబంధించి దుగ్గరాజపట్నంలో నిర్మించాల్సిన ప్రాజెక్టుని రామాయపట్నం వద్ద నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో నాన్ మేజర్ పోర్టుగా రాష్ట్రం నోటిఫై చేసినందున తాము నిర్మించబోమంటూ ఇప్పుడు కేంద్రం మెలిక పెడుతోంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. లేదంటే నాన్ మేజర్ పోర్టుకి కూడా కేంద్రం తగిన మోతాదులో నిధులు కేటాయించడానికి వీలుంటుంది. కానీ కేవలం నాన్ మేజర్ పోర్టు అనే సాకుతో తప్పించుకునే యత్నంలో ఉందనే అబిప్రాయం పలువురి నుంచి వినిపిస్తోంది. నోటిఫై చేసింది ఏపీ ప్రభుత్వమే గనుక మారిటైమ్ బోర్డు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ నిర్మించాలని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందంటూ వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి అంటే నాన్ మేజర్ పోర్టు అనే నోటిఫై చేసిన దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పాలని, నిర్మాణానికి అదే అడ్డంకి అయితే వెనక్కి తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెబుతున్నారు.

కేంద్రం మాత్రం ఇప్పటికే అనేక అంశాలలో కొర్రీలు వేసినట్టుగా ఇప్పుడు ఏడున్నరేళ్ల తర్వాత రామాయపట్నం విషయంలోనూ నిధులు కేటాయించేందుకు సుముఖంగా లేనట్టు కనిపించడం సమస్యగా మారుతోంది. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం కేంద్రంగా అభివృద్ధికి అవకాశాలుంటాయని పలువురు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణపట్నం , కాకినాడ మధ్య ప్రస్తుతం పోర్టులు లేవు. రామాయపట్నం, మచిలీపట్నం వస్తే ఏపీకి సముద్రతీర ఆధారిత అభివృద్ధి వేగవంతమవుతుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో విభజన చట్టంలో ఉన్నందున కొత్త పోర్టు ఖాయం అనుకుంటున్న దశలో కేంద్రం తాజా ప్రకటన నిరాశ కలిగిస్తోంది. ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించి, పోర్టు నిర్మించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Also Read : VSP, Export House Status – విశాఖ ఉక్కుకు ప్రత్యేక హోదా