మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా కేంద్ర మంత్రినే అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన నారాయణ్ రాణే ని పార్టీ కార్యక్రమంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రమంత్రి అరెస్ట్ ని పోలీసులు ధృవీకరించారు. జనఆశీర్వద్ సభలో ఉండగా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆయన ముందే గ్రహించారు. ముందస్తు బెయిల్ యత్నాలు చేశారు. కానీ కోర్ట్ తిరస్కరించడంతో నారాయణ్ చిక్కుల్లో పడ్డారు. అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం వేసిన స్క్వాష్ పిటిషన్ కూడా బాంబే హైకోర్టు తిరస్కరించింది.
నారాయణ్ రాణే 1999లో సీఎంగా ఉన్నారు. అంతకుముందు రెవెన్యూ, పరిశ్రమల శాఖ వంటివి నిర్వహించారు. 2005లో శివసేన వీడి కాంగ్రెస్ గూటిలో చేరారు. కొంతకాలానికే బీజేపీలో చేరారు. సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి స్థాపనలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గవిస్తరణలో ఆయనకు పీఎం మోడీ బెర్త్ కేటాయించారు. ఈలోగా తాజా వివాదం కలకలం రేపుతోంది. గడిచిన 20 ఏళ్ల కాలంలో అరెస్ట్ అయిన తొలి కేంద్ర మంత్రిగా ఆయన జైలుకి వెళ్లాల్సి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది.
Also Read : బాలాజీ బ్యాక్‌గ్రౌండ్ బెడిసికొడుతోందా..?
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని ఉద్దేశించి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదానికి మూలం. సీఎంని చెంపదెబ్బ కొట్టాలని ఆయన చేసిన కామెంట్స్ తో కాక రేగింది. చివరి నిమిషంలో ఆయన అరెస్ట్ నిలుపుదల కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నిబంధనలు అనుసరించండి అంటూ కోర్టు పేర్కొనడంతో కేంద్రమంత్రి ఖంగుతినాల్సి వచ్చింది
మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలపై దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద్యాత్రలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రులు వాటికి హాజరవుతున్నారు. అందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో సోమవారంనాడు సీఎం ని ఉద్దేశించి నారాయణ్ రాణే తీవ్ర విమర్శలు చేసారు. స్వాతంత్ర్యదినోత్సవ ఉపన్యాసంలో ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందో కూడా సీఎం మరచిపోయారని ఎద్దేవాచేశారు. అది సిగ్గుచేటు అన్నారు. పక్కవాళ్ళు చెప్పాల్సి రావడం బాధాకరం అంటూ.. తాను అక్కడ ఉంటే చెంప వాయించే వాడినంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన శివసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పూనుకున్నారు. పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. వాటిపై స్పందించిన పోలీసులు అరెస్ట్ కి పూనుకోవడం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.
Also Read : ఆస్తులన్నీ ప్రైవేటుకే, కేంద్రం కీలక నిర్ణయం, సర్వత్రా ఆందోళన