iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో విపక్షానికి మింగుడుపడిన పరిణామాలు జరుగుతున్నాయి. చంద్రబాబుని చూసి, ఆయన సమర్థత మెచ్చుకుని ఏపీకి అప్పులు ఇస్తున్నారు గానీ, జగన్ పాలన వస్తే అప్పులే పుట్టవని గతంలో ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మాట మార్చేశారు. జగన్ హయాంలో అప్పులు పెరిగిపోతున్నాయని కొత్త వాదన మొదలెట్టారు. కేంద్ర ప్రభుత్వమే అప్పుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఏపీ అప్పుల చుట్టూ పెద్ద రాద్ధాంతం సృష్టించి ప్రజలను మభ్యపెట్టవచ్చని విపక్షం భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
అదే సమయంలో ప్రభుత్వం మాత్రం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. పలు కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తోంది. వాటికి సంబంధించిన కార్యాచరణకు పూనుకుంది. వివిధ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందుకుంటోంది. ఇప్పటికే విద్యారంగంలో ప్రపంచబ్యాంకు రుణం ఖాయమయ్యింది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకూ పలు మార్పులకు అది దోహదం చేయబోతోంది.
దానికి తోడుగా పలు ఎత్తిపోతల పథకాలకు ఆర్ఈసీ రుణాల మంజూరుకి సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అందులో చింతలపూడి ఎత్తిపోతల పథకం, పలనాడు కరువు నివారణ పథకం, పురుషోత్తపట్నం, కొండవీటి లిఫ్ట్ స్కీములు వంటివి ఉన్నాయి. వాటన్నింటికీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి రుణాలు మంజురు కాబోతున్నాయి. రాయలసీమ కరువు నివారణ పథకానికి కూడా 10.65 శాతం వార్షిక వడ్డీ కింద రుణం మంజూరు చేస్తున్నట్టు విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ లోక్ సభలో ప్రకటించారు. 2026 నుంచి వాటిని తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఎఫ్ ఆర్ బీ ఎం చట్ట పరిధికి లోబడి ఈ రుణాలు ఉంటాయని స్పష్టం చేశారు.
దాంతో ఏపీలో రాయలసీమ లిఫ్ట్ సహా పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం అవుతున్నట్టు చెప్పవచ్చు. ఇప్పటికే పలు అభ్యంతరాలు, టీడీపీకి చెందిన నేతల ఫిర్యాదులు ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం రాయలసీమ కరువు నివారణ పథకానికి సంసిద్ధత వ్యక్తం చేయడం శుభసంకేతంగా పలువురు భావిస్తున్నారు. జగన్ సర్కారు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఆయా పథకాలన్నీ కార్యరూపం దాలిస్తే విస్తృతంగా సాగునీటి సరఫరా జరుగుతుందని, రాష్ట్రాభివృద్ధికి అవన్నీ తోడ్పడతాయని భావిస్తున్నారు.