iDreamPost
iDreamPost
దేశంలో ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ చర్యలతో మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ఈ పరిశ్రమలో తనకున్న వంద శాతం వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా బొగ్గు సరఫరా నిలిపివేసి ఆర్థిక భారం మోపుతోంది. ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచీ ఇనుప గనులు కేటాయించకుండా ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేసింది. దాంతో ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థం ఇనుప ఖనిజం కోసం ప్లాంట్ యాజమాన్యం బహిరంగ మార్కెట్ పై ఆధారపడుతోంది. ఇటీవల ఇనుప ఖనిజం ధర బాగా పెరిగి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఈ తరుణంలో పరిశ్రమకు చెందిన విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను నిలిపివేయడంతో అధిక ధరలకు విదేశీ బొగ్గు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది మరింత ఆర్థిక భారం మోపుతోంది.
బొగ్గు కొరత సాకుతో సరఫరా బంద్
గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా బొగ్గుకు బాగా కొరత నెలకొంది. కరోనా, భారీ వర్షాలు, వరదలు వంటి కారణాలతో బొగ్గు గనుల్లో ఉత్పత్తి, రవాణాకు విఘాతం కలిగింది. దాని పర్యవసానంగా బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకుని, విద్యుదుత్పత్తి నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిస్థితి మెరుగుపడే వరకు విద్యుత్ రంగానికి మాత్రమే బొగ్గు సరఫరా చేయాలని, విద్యుతేతర పరిశ్రమలు, రంగాలకు సరఫరా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా గత 15 రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంటుకు బొగ్గు రావడం లేదు.
Also Read : Chandrababu Delhi Tour – ఏపీలో ఉన్మాది పాలన అంటున్న బాబుకి హస్తినలో తప్పని ఎదురుచూపులు
నెలకు రూ.500 కోట్ల భారం
విశాఖ ఉక్కు కర్మాగారం తన సొంత అవసరాల కోసం పరిశ్రమ ఆవరణలోనే ఐదు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకుంది. వీటిలో ఒకటి గ్యాస్ ఆధారిత యూనిట్ కాగా.. మిగిలిన నాలుగు బొగ్గు ఆధారిత యూనిట్లు. గ్యాస్ యూనిట్ నుంచి 120 మెగావాట్లు, నాలుగు థర్మల్ యూనిట్ల నుంచి 315 మెగావాట్ల విద్యుతు ఉత్పత్తి చేసి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. మిగులు విద్యుత్ ఉంటే రాష్ట్ర గ్రిడ్ కు ఇస్తుంటారు. వీటికి అవసరమైన బొగ్గును ఒడిశాలోని తాల్చేరు బొగ్గు గనుల నుంచి తెప్పించుకుంటారు. ప్రతినెలా 23 రేక్ ల బొగ్గు వస్తుంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 15 రోజులుగా ప్లాంట్ కు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఉన్న నిల్వలు కూడా తరిగిపోతుండటంతో విధిలేని పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు నాలుగు రెట్లు పెరిగిపోవడం ప్లాంటుకు ఆర్థిక భారంగా పరిణమించింది. నెలకు సుమారు రూ.500 కోట్ల అదనపు ఖర్చు తప్పదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం విద్యుతేతర సంస్థలన్నింటినీ ఒకేగాటన కట్టి బొగ్గు సరఫరా నిలిపివేయాలని ఆదేశించడం వల్లే గడ్డు పరిస్థితి దాపురించిందని ప్లాంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బొగ్గు గనుల్లో పరిస్థితి మెరుగుపడుతున్నందున.. త్వరలోనే స్టీల్ ప్లాంటుకు సరఫరా పునరుద్ధరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Financial Experts – కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు?