iDreamPost
android-app
ios-app

ఏపీలో విద్యుత్‌ సంస్కరణలకు కేంద్రం ప్రశంస

  • Published Jan 23, 2022 | 6:03 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
ఏపీలో విద్యుత్‌ సంస్కరణలకు కేంద్రం ప్రశంస

వినూత్నమైన పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచుగా కేంద్రం ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా విద్యుత్తు సంస్కరణల అమలులో ఏపీకి కేంద్ర ప్రభుత్వం కితాబు ఇచ్చింది. విద్యుత్‌ రంగంలో నిర్దిష్ట సంస్కరణలను చేపట్టి, వాటిని కొనసాగించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తోందంటూ కేంద్రప్రభుత్వం ప్రశంసించింది.

వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలను సకాలంలో ప్రచురించడం, టారిఫ్‌ పిటిషన్‌ను దాఖలు చేయడం, టారిఫ్‌ ఆర్డర్ల జారీ, యూనిట్‌ వారీగా సబ్సిడీ అకౌంటింగ్, ఇంధన ఖాతాల ప్రచురణ, కొత్త వినూత్న సాంకేతికతలను అనుసరించడం వంటి సంస్కరణలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని కొనియాడింది.

విద్యుత్‌రంగ కార్యకలాపాలను మరింత పటిష్టంగా, సమర్థంగా, స్థిరంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వినియోగదారులందరికీ 24 గంటలూ నాణ్యమైన, నమ్మదగిన, చౌకవిద్యుత్‌ను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కేంద్రానికి బాగా నచ్చాయి. ప్రగతిశీల రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది.

రుణ పరిమితి పెంపు..

దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాలు 2020లో విద్యుత్‌రంగ సంస్కరణల అమలుకు, తద్వారా లబ్ధిపొందేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ రంగంలో నిర్దిష్ట సంస్కరణలను చేపట్టి, కొనసాగించాలనే షరతుపై అదనపు రుణాలు తీసుకునేందుకు ఆర్థికశాఖ గత ఏడాది జూన్‌లో ‘సంస్కరణ ఆధారిత, ఫలితం ఆధారిత పంపిణీ రంగ పథకం’ ప్రారంభించింది. ఈ పథకం అమలుకు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ని నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. గతేడాది 24 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా రూ.13 వేల కోట్ల అదనపు రుణ పరిమితిని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ సంవత్సరం ఈ పరిమితిని రూ.80 వేల కోట్లకు పెంచింది. అదనపు రుణ పరిమితి సంబంధిత రాష్ట్ర స్థూల, రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 0.5 శాతంగా కేంద్రం నిర్ణయించింది.