iDreamPost
android-app
ios-app

అప్పుడు ఆక్సిజన్, ఇప్పుడు బొగ్గు కొరత, ఎందుకిలా జరుగుతోంది..

  • Published Oct 13, 2021 | 4:09 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
అప్పుడు ఆక్సిజన్, ఇప్పుడు బొగ్గు కొరత, ఎందుకిలా జరుగుతోంది..

అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఆరేడు నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న సమయంలో కూడా కేంద్రం మన దగ్గరి ఆక్సిజన్ నిల్వలను విదేశాలకు ఎగుమతి చేయడం ఆపలేదు. దేశీయంగా నిల్వలు పెంచుకోవడానికి బదులుగా విదేశాలకు తరలించడానికే ప్రాధాన్యతనిచ్చారు. తీరా ఏప్రిల్ మధ్యలోకి వచ్చే సరికి దేశమంతా వైరస్ వేగంగా విస్తరించడంతో ఆక్సిజన్ లేక జనం అల్లాడిపోయారు. అనేక చోట్ల పిట్టల్లా రాలిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. చివరకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఆక్సిజన్ సహాయం అర్థించాల్సి వచ్చింది. అందరూ మనవైపు బేల చూపులు చూడాల్సిన స్థితి కొనితెచ్చుకున్నట్టయ్యింది.

ఆ వెంటనే కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అదే పంథా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ కూడా తొలుత దేశీయ అవసరాలకు కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే లక్ష్యంతో ముందుకు సాగారు. ఫలితంగా దేశంలో వ్యాక్సిన్ అవసరమైన వారు గంటల కొద్దీ క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఓవైపు మన వ్యాక్సిన్లు విదేశాల్లో అందుబాటులో ఉండగా మన దేశంలో మాత్రం తీవ్ర కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు పరిస్థితిని గ్రహించి మళ్లీ దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికే ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యింది.

ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్రం నెపాన్ని రాష్ట్రాల మీదకు నెట్టేసే ప్రయత్నం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలదే బాధ్యత అన్నట్టుగా వ్యవహరించింది. ఆక్సిజన్, వ్యాక్సిన్ కూడా తమ పరిధిలో అంశాలే అయినప్పటికీ వైఫల్యం తమది కాదని చెప్పుకోవడానికే ప్రయత్నించారు. చివరకు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు యుద్ధ విమానాలను సైతం వినియోగించి సమస్య నుంచి గట్టెక్కాం. వ్యాక్సిన్ల సరఫరా పెరగడంతో కనీసం మొదటి డోసునయినా దేశంలో సగం మందికి అందించి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఆయా సందర్భాల్లో ముందుగా మేలుకుని ఉంటే అపార నష్టాన్ని నివారించే అవకాశం మన చేతుల్లో ఉన్నప్పటికీ చివరకు చేతులెత్తేసే వరకూ వెళ్లాల్సి వచ్చింది.

Also Read : బొగ్గు కొరతపై జగన్ సూచనలను కేంద్రం పట్టించుకుందా?

ప్రస్తుతం బొగ్గు కొరత విషయంలో కూడా కేంద్రం తీరు మారలేదని స్పష్టమవుతోంది. ఆక్సిజన్ గానీ, వ్యాక్సిన్లు గానీ కొరత లేదని తొలుత చెప్పుకున్నట్టే ప్రస్తుతం బొగ్గు కొరతని కూడా కేంద్రం అంగీకరించడం లేదు. దేశంలోని 135 థర్మల్ పవర్ ప్లాంటులకు గానూ 115 ప్లాంటులలో అవసరాలకు అనుగుణంగా బొగ్గు లేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అందులో 42 ప్లాంట్లలో అయితే కనీసం 2 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని సెంట్రల్ ఎలెక్ట్రసిటీ అథారిటీ చెబుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ గానీ, ఆ తర్వాత హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ భిన్నంగా వాదిస్తుండడం విస్మయకరంగా మారింది.

నిజానికి దేశంలో బొగ్గు కొరత ఏర్పడుతుందనే అంచనా మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేశాయి. కానీ దానికి అనుగుణంగా కోల్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రసిటీ అథారిటీ అప్రమత్తం కాలేదు. ఫలితంగా ప్రస్తుతం సమస్య తీవ్రమవుతోంది. ఆంధ్రా నుంచి అసోం వరకూ దేశంలో ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో సమస్య ముదురుతోంది. అది మరింత పెరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. దాంతో ఇప్పటికైనా కేంద్రం సమస్య పరిష్కారం విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

రాష్ట్రాలకు సంబంధం లేని కోల్ ఇండియా గానీ ఇతర ఎగుమతులు, దిగుమతుల వ్యవహారం గానీ మోడీ సర్కారు సరిదిద్దాల్సిన అవసరం కనిపిస్తోంది. గత ఏడాది మార్చి నాటికి టన్ను బొగ్గు అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లుంటే ఇప్పుడది ఏకంగా సుమారు 200 డాలర్లకు చేరుతోంది. అంటే 400 రెట్లు ధరలు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని తగిన రీతిలో అంచనా వేసి సమస్య ముదరకముందే ఉత్పత్తి, సరఫరా విస్తృతం చేయాల్సిన ఆవశ్యం కనిపిస్తోంది.

Also Read : ప్రధానికి జగన్‌ లేఖ .. సమస్య రాకుండా చూస్తారా..?