కరోనా అలియస్ కోవిడ్ 19 మహమ్మారిగా మారి ప్రపంచ దేశాల నవరంధ్రాలను కట్టిపడేసింది. వ్యాధి ఆనుపానులు తెలుసుకునే లోపుగానే విస్తృతంగా వ్యాపించేసింది. ఇంతిలా వ్యాపించేందుకు ఎవ్వరిని బాధ్యులను చేస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య రంగ సంస్థలు వ్యాధిని అరికట్టేందుకు, మానవాళిని కాపాడేందుకు అందుబాటులో ఉన్న సాంకేతికతలను ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలనే అన్వేషిస్తూనే ఉన్నారు.
అయితే గాలి ద్వారా కోవిడ్ వైరస్ వ్యాపిస్తుందా? అయితే ఎంత మేరకు ప్రభావం చూపుతుంది? ఇటువంటి ప్రశ్నలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవలి కాలంలో రెండొందలకు పైగా శాస్త్రవేత్తలు గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికే తీసుకు వచ్చారు. దీంతో సర్వత్రా కలకలం రేగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ద్వారా కూడా వ్యాపించేందుకు అవకాశం ఉంటుందని, అయితే ఖచ్చితంగా నిర్దారించడానికి ఇంకా ప్రయోగదశలోనే ఉన్నామంటూ డబ్లు్యహెచ్‌వో చెప్పుకొచ్చింది. ఆ తరువాత కూడా గాలి ద్వారా వ్యాప్తి విషయంలో అనేక సవరణలతో కూడిన వివరణలు కూడా ఇచ్చింది. అంతే తప్ప ఖచ్చితమైన ఆధారాలతో కూడిన నివేదికలైతే లేవు.
కాగా ఇప్పుడు గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందా? లేదా? అన్నది తేల్చేందుకు ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీయంబీ) రంగంలోకి దిగింది. హైదరాబాదులో ఉన్న ఈ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలను పూర్తిచేసిన ఘనత కూడా ఈ సంస్థకు ఉంది. ఈ నేపథ్యంలో గాలి ద్వారా వ్యాపిస్తుందా లేదా అన్నది తేల్చేందుకు సీసీయంబీ రంగంలోకి దిగడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పాజిటివ్ వ్యక్తులకు చుట్టూ ఎంత మేరకు వైరస్ ప్రభావం ఉంటుంది? అన్న ప్రశ్నతో మొదలు పెట్టి వైరస్ గాల్లో ఎంత దూరం వ్యాపించగలుగుతుంది అన్నంత వరకు అనేక ప్రశ్నలు సీసీయంబీ ప్రయోగాల్లో తేలాల్సి ఉంటుంది. రోజుల వ్యవధిలోనే దీనిని గురించి తేల్చేందుకు సీసీయంబీ కంకణం కట్టుకున్నట్లుగా సమాచారం. ఇందుకోసం గాలి శాంపిల్స్‌ను సేకరించే ప్రత్యేక పరికరాలను వాడనున్నారు.
ఇటువంటి పరీక్షల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న వైద్య సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్నది తేలుతుంది. అలాగే వైరస్ వ్యాప్తిని ఎక్కడ కట్టడి చేయొచ్చని కూడా ఒక నిర్ధారణకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వైద్య సేవల విధానంలో కూడా మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. ఏది ఏమైనా సీసీయంబీ ఫలితాల ద్వారా మహ్మారిని కట్టడిచేసేందుకు ప్రపంచానికి ఒక దారి దొరుకుతుందన్న ఆశాభావం అందరూ వ్యక్తం చేస్తున్నారు.