ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తరవాత తొలిసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ నేత చంద్రబాబు నాయుడుకు తీవ్ర వ్యతిరేకత రాజధాని ప్రాంత రైతుల నుండి ఎదురవుతుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబు పర్యటన సాగుతుంది. తాళ్లాయపాలెం సీడ్ ఆక్సెస్ రోడ్ లో బాబు పర్యటనకు నిరసనగా నలుపురంగు బ్యానర్లు వెలిసాయి. రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా చంద్రబాబు గో బ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేస్తూ చంద్రబాబు పర్యటన పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నినాదాలు చేయవద్దని హెచ్చరికలు జరీ చేసారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.
చంద్రబాబు రాజధాని పర్యటనలో టీడీపీ ఎంపీలు,ఎంఎల్ఏలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు చెప్పులు,రాళ్లు విసిరారు, దారి పొడవునా ఫ్లకార్డులు నల్ల బ్యానర్లతో రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన రాజధాని అభివృద్ధి గురించి, అక్కడి రైతులకు వివరించే ప్రయత్నం చంద్రబాబు చేయనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని జగన్ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను పరిశీలించారు. ప్రధాని శంఖుస్థాపన చేసిన ప్రాంతాన్ని, గృహ సముదాయాలను సందర్శించిన తర్వాత రైతులతో ముచ్చటించనున్నారు.