iDreamPost
android-app
ios-app

టీడీపీ మరో జాతీయ పోరాటం..!

  • Published Jan 25, 2022 | 1:33 PM Updated Updated Jan 25, 2022 | 1:33 PM
టీడీపీ మరో జాతీయ పోరాటం..!

ఎప్పుడు ఏ అవకాశం దొరకుతుందా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేద్దామా అని ఎదురుచూసే తెలుగుదేశం పార్టీ ఏ అవకాశమూ లేకపోయినా తానే ఏదో సమస్యను సృష్టించి రాద్ధాంతం చేయడం పరిపాటిగా మార్చుకుంది. గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారంటూ చేస్తున్న పచ్చ యాగీయే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదిక అందించింది. మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలసి కమిటీ సభ్యులు నివేదిక అందజేశారు. చంద్రబాబుతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వర్ల రామయ్య, ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత భేటి అయ్యారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు.

గుడివాడలో క్యాసినో నిర్వహణ అంశాన్ని ఇంతటితో వదలబోమని, జాతీయ స్థాయిలో పోరాడతామని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు. వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని కమిటీ పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని కమిటీ సూచించింది. గవర్నర్‌ సమయమిస్తే గుడివాడలో క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, ఐటీ విభాగాలు రంగంలోకి దిగి నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి కొడాలి నానికి బేడీలు తప్పవని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందని వర్ల రామయ్య ఆరోపించారు.

గతంలో పోరాటం ఏమైంది?

వర్ల రామయ్య వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో బాబు చేసిన జాతీయ స్థాయి పోరాటాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. 
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి నోటికొచ్చినట్టు దూషించిన సమయంలో ఆయన ఇంటిపై, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు జరిగాయని చంద్రబాబునాయుడు జాతీయ స్థాయి పోరాటానికి సిద్ధపడ్డారు. శాంతి భద్రతలు దెబ్బతిన్నందున 356 నిబంధన ప్రకారం ఏకంగా రాష్ట్ర ప్రభుతాన్ని రద్దు చేయాలని‍ డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిని కలిసి ఈ మేరకు వివరిస్తానంటూ ఆడంబరంగా ఢిల్లీ వెళ్లారు కూడా. అక్కడ రెండ్రోజులు పడిగాపులు పడినా ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇచ్చి వచ్చేశారు. బాబు చేసిన హంగామాను బీజేపీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆయన పరువు ఢిల్లీ స్థాయిలో తుస్సుమంది. దాన్ని కవర్‌ చేసుకోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తనకు ఫోన్‌ చేశారంటూ పచ్చ డ్రామా ఆడారు. మళ్లీ ఇప్పుడు గుడివాడ క్యాసినో అంశంపై జాతీయ స్థాయి పోరాటమంటూ టీడీపీ నేతలు పబ్లిసిటీ స్టంట్‌ చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

క్యాసినో ఎక్కడ జరిగిందో టీడీపీకే అవగాహన లేదు!

పది రోజుల్లో తాను క్యాసినో నిర్వహించినట్టు నిరూపించాలని మంత్రి కొడాలి నాని విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పడం చేతకాక టీడీపీ నిజనిర్ధారణ కమిటీ డ్రామానే కొనసాగిస్తోందని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. ఒకరోజు మంత్రి కె.కన్వెషన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారని, మరోరోజు ఆ పక్కన అని, ఇంకోరోజు గుడివాడలో అంటూ పసలేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు దీనిపై జాతీయ స్థాయి పోరాటం అనడమే విడ్డూరం. ఇంతోటి దానికి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలంటూ డిమాండ్‌ చేయడం మరీ విచిత్రం. తమకు తాము టీడీపీని ఒక జాతీయ పార్టీగా ప్రకటించుకుని చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, లోకేశ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అని పదవులు ఇచ్చేసుకున్నట్టుగా ప్రతి దానికి జాతీయ స్థాయి పోరాటం అంటే జనం నవ్వుతారని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టీడీపీ తెలంగాణాలో చాప చుట్టేసిందని, ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఓటములతో కుదేలైనా జాతీయ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. ముందు ఆ జాతీయ ట్యాగ్‌ తీసేసి ఆ తర్వాత జాతీయ స్థాయి పోరాటాలు చేయాలని ఎద్దేవా చేస్తున్నారు.