iDreamPost
iDreamPost
రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోకసభ, రాష్ట్రాల శాసన సభల కాలపరిమితి ఐదేళ్లు. దానికి అనుగుణంగానే ఐదేళ్లకోసారి లోకసభ, అసెంబ్లీల ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఎన్నికల్లో నెగ్గి అధికార పగ్గాలు చేపట్టే పార్టీ లేదా కూటమి ఆ ఐదేళ్లకు నాయకుడిని ఎన్నుకొని.. ఆయన నేతృత్వంలో పరిపాలన సాగించాలి. అంటే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి, ప్రధాని పదవి చేపట్టినవారు ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగాలి. చట్టసభల విశ్వాసం కోల్పోయి.. అవిశ్వాస గండం ఎదుర్కొనే వారు మాత్రం మధ్యలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వారి స్థానంలో పాలక పక్షం కొత్త నేతను ఎన్నుకోవడం రాజ్యాంగ సంప్రదాయం. కానీ కాలక్రమంలో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముఖ్యమంత్రులను అర్థాంతరంగా తప్పించే దుస్సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి.
ముఖ్యంగా జాతీయ పార్టీలు రాష్ట్రాల్లోని తమ పార్టీ సీఎంలను ఆటబొమ్మల్లా తరచూ మార్చేస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి తమకు నచ్చలేదని, తమ అదుపాజ్ఞల్లో లేరనో, పార్టీలో కలహాల కారణాలతోనో సీఎంలను మార్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే రాజ్యాంగ బద్ధమైన సీఎం పదవిని కూడా వాటాలు వేసి పంచుతున్నారు. పదవి కోసం ఎక్కువమంది నేతలు పోటీ పడిన సందర్భాల్లో పార్టీ నాయకత్వాలు ఎటూ తేల్చలేక చివరికి పదవీ కాలాన్ని విభజించి ఇద్దరు ముగ్గురు నేతలు ఒకరి తర్వాత ఒకరు సీఎం అయ్యేలా సర్దుబాటు చేస్తున్నారు. సాంకేతికంగా ఇందులో అభ్యంతరాలు లేకపోయినా.. నైతికంగా మాత్రం సమంజసం కాదని తెలిసినా రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు.
Also Read:రెండు జిల్లాల పార్టీగా మిగిలిన జనసేన, అక్కడ కూడా అంతంతమాత్రమే
జాతీయ పార్టీల్లోనే ఈ సంస్కృతి
ముఖ్యమంత్రులను అర్థాంతరంగా మార్చే సంస్కృతి జాతీయ పార్టీలోనే కనిపిస్తోంది. మొదట్లో కాంగ్రెసు దీనికి శ్రీకారం చుట్టింది. తర్వాత జనతా పార్టీ, జనతాదళ్, భారతీయ జనతాపార్టీలు దీన్ని అందిపుచ్చుకుని యథేచ్ఛగా సీఎంలతో కుర్చీలాట ఆడిస్తున్నాయి. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెంచుకోవడానికి ముఖ్యమంత్రులను మార్చుతున్నట్లు ఇవి తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి. కానీ ముఖ్యమంత్రులను మార్చినంత మాత్రాన ప్రజలు పాత విషయాలు మరచిపోయి పార్టీలను అక్కున చేర్చుకోబోరని, అధికారం కట్టబెట్టబోరని గత నాలుగైదు దశాబ్దాల రాజకీయాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప సీఎంలను మార్చిన పార్టీలు.. తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాల్లేవు.
కొన్ని ఉదాహరణలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978 నుంచి 1983 మధ్య కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా సీఎంలను మార్చడం రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికినే ప్రశ్నర్థకం చేసింది. ఆ ఐదేళ్లలో మొత్తం నలుగురు సీఎంలను మార్చడం పార్టీని ప్రజల్లో చులకన చేసింది. మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రాం రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంలు అయ్యారు. అయినా తర్వాత 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
Also Read:కవరింగ్ టైం: బాబు వదిలేశాడు కాబట్టే ఆ పాప గెలిచిందంట …!
ఇదే అంశం ఆధారంగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలు దెబ్బతీస్తున్నారంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెసును రాష్ట్రంలో మొదటిసారి గట్టి దెబ్బకొట్టారు. 1989లో తిరిగి అధికారం చేపట్టిన కాంగ్రెస్ తన పాత విధానాలనే అనుసరించి 1989-94 మధ్య చెన్నారెడ్డితో మొదలు పెట్టి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వరకు ముగ్గురు సీఎంలను మార్చింది. అయినా 1994 ఎన్నికల్లో విజయం సాధించలేక పోయింది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన రెండు సందర్భాల్లోనూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉండటం విశేషం.
మన పొరుగునున్న కర్ణాటకలోనూ సీఎంలను మార్చిన పార్టీలు తర్వాతి ఎన్నికల్లో భంగపడ్డాయి. 1985-1989 మధ్య అధికారంలో ఉన్న జనతాపార్టీ రామకృష్ణ హెగ్డే, ఎస్సార్ బొమ్మై..ఇద్దరు సీఎంలను మార్చినా 1989 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ 1989-94 మధ్య వీరేంద్ర పాటిల్, బంగారప్ప, వీరప్పమొయిలీల రూపంలో ముగ్గురు సీఎంలను మార్చినా 1994 ఎన్నికల్లో చతికిల పడింది.
ఇక 2008-13 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ ముగ్గురు సీఎంలు యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ లను మార్చినా ఫలితం సాధించలేకపోయింది. 2013 ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఉత్తరాదిన
1956లో రద్దయిన ఢిల్లీ రాష్ట్రం 1993లో పునరుద్దరించాక 1993-1998 మధ్య బీజేపీనేతలు మదన్ లాల్ ఖురానా,సాహిబ్ సింగ్ వర్మ,సుష్మాపై స్వరాజ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సుష్మాపై స్వరాజ్ అయితే కేవలం 52 రోజులు మాత్రమే సీఎం గా పనిచేశారు.. 1998 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి షీలా దీక్షిత్ సీఎం అయ్యారు..1998 నుంచి 2013 వరకు ,మూడుసార్లు కాంగ్రెస్ గెలిచి షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు సీఎం గా పనిచేశారు. కాంగ్రెస్ తరువాత అరవింద్ కేజ్రీవాల్పైరెండు ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతంకూడా సీఎం గా ఉన్నాడు కానీ బీజేపీకి ఢిల్లీలో మరోసారి అవకాశం దక్కలేదు.
ఉత్తరప్రదేశ్ లో 1996-2002 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ ముగ్గురు సీఎంలు.. కళ్యాణ్ సింగ్, రాంప్రకాశ్ గుప్తా, రాజనాథ్ సింగులను మార్చింది. 57 రోజుల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి బీఎస్పీ అధినేత్రి మాయావతికి అధికారం అప్పగించింది.
Also Read:పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ
మధ్యప్రదేశ్ లో 1985-90 మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముగ్గురూ ముఖ్యమంత్రులు అర్జున్ సింగ్, మోతిలాల్ వోహ్రా, శ్యామ చరణ్ శుక్లాలను మార్చినా ఫలితం లేకపోయింది. 1990 ఎన్నికల్లో బీజేపీకి అధికారం అప్పగించాల్సి వచ్చింది. ఇక 2003-08 మధ్య అధికారం చేపట్టిన బీజేపీ కూడా ముగ్గురు సీఎంలు ఉమాభారతి, బాబులాల్ గౌర్, శివరాజ్ చౌహాన్ లను మార్చింది. ఈసారి మాత్రమే బీజేపీ మార్పుల మంత్రం ఫలించింది. 2008 ఎన్నికల్లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రాగా.. శివరాజ్ చౌహాన్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు.
ఉత్తరాఖండ్లో ఎప్పుడు ఓటమే
రెండు దశాబ్దాల క్రితమే ఏర్పడిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రుల మార్పు వికటించింది. 2007 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ 2012 వరకు ఐదేళ్లలో ముగ్గురిని మార్చింది మొదట బీసీ ఖండూరి తర్వాత రమేష్ పోఖ్రియాల్.. ఆయన తర్వాత మళ్లీ ఖండూరి సీఎం అయ్యారు. అయినా 2012 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేక పోయింది.
ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ తన ఐదేళ్ల పాలనలోనూ విజయ్ బహుగుణ, హరీష్ రావత్..ఇద్దరు సీఎంలను మార్చి 2017 ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం పొందింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పటి వరకు త్రివేంద్ర సింగ్, తీరథ్ సింగ్ లను మార్చి మూడో సీఎంగా పుష్కర్ సింగును కూర్చోబెట్టింది.