iDreamPost
iDreamPost
రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తిరుగులేని జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఈ జిల్లాలో మేకపాటి, నల్లపురెడ్డి కుటుంబాలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఎదురులేకుండా చేస్తున్నాయి. పార్టీ ఏర్పడినప్పటి నుంచీ ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీకి సంపూర్ణ విజయం సాధించి పెడుతున్నాయి. మేకపాటి కుటుంబం ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నల్లపురెడ్డి కుటుంబానికి చెందిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సీనియర్ అయినప్పటికీ, పదవులు లేనప్పటికీ పార్టీ పట్ల అంకిత భావంతో.. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు చేస్తూ ఎప్పటికైనా అవకాశం లభిస్తుందన్న విశ్వాసంతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈసారి తమ నేతను తప్పకుండా గుర్తిస్తారన్న ఆశాభావాన్ని ప్రసన్నకుమార్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.
పనితీరుతో ప్రజల్లో గుర్తింపు
రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాదరణ పొందుతున్న ప్రసన్నకుమార్ రెడ్డి మాజీమంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరి ఎన్టీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచారు. 1983, 1985 ఎన్నికల్లో విజయం సాధించి ఎన్టీఆర్ మంత్రివర్గంలో నీటిపారుదల వంటి కీలక శాఖలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ తో విభేదించి కాంగ్రెసులో చేరారు. 1989లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మరణానంతరం కుమారుడు ప్రసన్నకుమార్ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1994, 99 ఎన్నికల్లో కోవూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఓడిపోయినా 2009లో మళ్లీ గెలిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచీ జగన్ వెంట నడుస్తున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రసన్న 2014లో మాత్రం ఓటమిపాలయ్యారు. అయినా ప్రజల్లోనే ఉంటూ.. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ 2019 ఎన్నికల్లో జగన్ హవా తోడుగా మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు
Also Read : ముత్యాలనాయుడు నిరీక్షణ ఫలించేనా?
అప్పట్లోనే పదవి వస్తుందనుకున్నా..
సీనియర్ ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్ రెడ్డికి 2019లోనే మంత్రి పదవి వరిస్తుందనుకున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో పార్టీకి కీలకంగా ఉన్న మేకపాటి కుటుంబం నుంచి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఈయనకు అవకాశం రాలేదు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నారు. లోటుపాట్లకు అవకాశం లేకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ నియోజకవర్గ ప్రజల ఆదరణ పొందుతున్నారు. టీడీపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నారు. పైగా టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చురుగ్గా లేకపోవడంతో టీడీపీలోని ఆయన ప్రత్యర్థులు చేజెర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వేరే గ్రూపుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనే పోలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయినా పార్టీ ఆయనకే టికెట్ ఇవ్వడం, ఆయన ఓడిపోవడంతో ఇప్పటికీ గ్రూపు విభేదాలు కొనసాగుతున్నాయి. ఇవి వైఎస్సార్సీపీకి కలిసి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసారి తప్పకుండా ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తుందని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు.
ముగ్గురిలో ఎవరికో..
అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రసన్నకుమార్ తో పాటు మరో ఇద్దరు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఆ సామాజికవర్గ కోటాలో పదవి లభించే అవకాశం ఉంది. సీనియర్లకు ఇవ్వాలనుకుంటే నల్లపురెడ్డి, ఆనం రేసులో ఉంటారు. అయితే పార్టీ ఏర్పాటు సమయంలో ఎమ్మెల్యే పదవిని త్యజించి మరీ వైఎస్సార్సీపీలో చేరిన ప్రసన్నకుమార్ రెడ్డికి కాస్త ఎడ్జ్ ఉండవచ్చని అంటున్నారు. అదే యువ నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే కాకాణి కి లభిస్తుందన్న చర్చ జరుగుతోంది.
Also Read : సునీల్ – మూడు ఎన్నికలు మూడు పార్టీలు , అయినా ఎందుకు గెలవలేకపోయాడు?