iDreamPost
android-app
ios-app

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

  • Published Oct 30, 2019 | 4:51 AM Updated Updated Oct 30, 2019 | 4:51 AM
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్‌ ప్రాజెక్టుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

హజ్‌ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు అందజేసే ఆర్థిక సాయాన్ని రూ.మూడు లక్షలలోపు వార్షికాదాయమున్న వారికి రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, మూడు లక్షలపైన వార్షికాదాయమున్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న క్రషర్స్‌కు పావలా వడ్డీకే రుణాలను ఏపీఎస్‌ఎఫ్‌సీ ద్వారా అందించేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ అడ్వొకేట్స్‌ సంక్షేమ నిధి చట్టంలో సవరణలు, అలాగే దేవదాయ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశముంది.