iDreamPost
android-app
ios-app

By Election – ఉప ఎన్నికలు.. దేశవ్యాప్తంగా 65 శాతం పోలింగ్

  • Published Oct 30, 2021 | 3:14 PM Updated Updated Oct 30, 2021 | 3:14 PM
By Election – ఉప ఎన్నికలు.. దేశవ్యాప్తంగా 65 శాతం పోలింగ్

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 29 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగులో సాయంత్రం ఆరు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 65 శాతానికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేఘాలయాలో అత్యధికంగా 78 శాతం ఓట్లు పోల్ కాగా.. బీహార్ లో అతితక్కువగా 50 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూల్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నందున పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రాల్లో ఓటింగ్ వివరాలు

– అసోంలో అత్యధికంగా ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో సగటున 55 శాతం పోలింగ్ నమోదైంది. బాబనీపూర్ లో 62 శాతం, గోసాయిగాంలో 58 శాతం, టౌవ్రాలో 55.72 శాతం, తముల్ పూర్ లో 47 శాతం, మరియనిలో అతి తక్కువగా 35 శాతం ఓట్లు పోలయ్యాయి.

– తెలంగాణలోని హుజురాబాదులో 76 శాతం పోలింగ్ జరిగింది.

– ఏపీలోని బద్వేలు నియోజకవర్గంలో సుమారు 60 శాతం ఓట్లు పోలయ్యాయి.

– కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. హనగల్ లో 62.72 శాతం, సింగ్డిలో 51.6 శాతం పోల్ అయ్యాయి.

– రాజస్థాన్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. దరియవాద్ లో 65.39 శాతం, వల్లభ్ నగర్లో 64.95 శాతం ఓటింగ్ నమోదైంది.

– మధ్యప్రదేశ్లో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖండ్వా పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఖండ్వాలో 59.02 శాతం మంది ఓట్లు వేశారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జోబాట్ లో 50.9 శాతం, పృధ్వీపూర్ లో 76.05 శాతం, రాయ్ గాంలో 66.66 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

– బీహార్లో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కుశ్వేశ్వర్ ఆస్థాన్లో 49.60 శాతం, తారాపూర్ లో 50.05 శాతం ఓటింగ్ జరిగింది.

– హిమాచల్ ప్రదేశ్లో మండీ పార్లమెంటు స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మండీలో 47.17 శాతం, మూడు అసెంబ్లీ స్థానాల్లో సగటున 65 శాతం పోలింగ్ జరిగింది.

– పశ్చిమ బెంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. దిన్హాతాలో 61.52 శాతం, శాంతిపూర్లో 64.18 శాతం, కర్దాహ్ లో 52.37 శాతం, గోసబలో 66.07 శాతం ఓట్లు పోలయ్యాయి. -హర్యానాలోని ఎల్లేనాబాద్ లో 73 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ రైతు ఉద్యమానికి మద్దతుగా ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా తన పదవికి రాజీనామా చేసి.. మళ్లీ ఉప ఎన్నికను ఎదుర్కోవడం విశేషం.

ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో నవంబర్ రెండో తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.

Also Read : Bihar By Elections -ఉప ఎన్నిక ఫలితాలు తేడా వస్తే ప్రభుత్వం కూలుతుంది