iDreamPost
android-app
ios-app

ఆ రాష్ట్రాల మ‌ధ్య వివాదాల‌కు ప‌రిష్కార‌మెప్పుడు?ఘర్షణలు ఆగేదెప్పుడు?

ఆ రాష్ట్రాల మ‌ధ్య వివాదాల‌కు ప‌రిష్కార‌మెప్పుడు?ఘర్షణలు ఆగేదెప్పుడు?

ఈశాన్య భారతంలో మళ్లీ అలజడి రేగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం హింసకు దారి తీసింది. అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య స‌రిహ‌ద్దు వివాదం కాల్పుల వ‌ర‌కూ వెళ్లింది. నెల రోజులుగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న వాతావ‌ర‌ణం కొద్ది రోజులుగా మంట‌లు రాజేస్తోంది.

‘‘అమిత్‌షా గారూ… దయచేసి జోక్యం చేసుకోండి. ఈ విషయాన్ని పరిశీలించండి.. గూండాల దాడిలో సామాన్యులు గాయపడుతున్న తీరును గుర్తించండి. ” అంటూ మిజోరం సీఎం జోరామ్‌థాంగా అమిత్ షాను ట్యాగ్ చేస్తూ, ఓ వీడియో స‌హా ట్వీట్ చేయ‌గా, ‘‘గొడవలు సద్దుమణిగే వరకూ పోలీస్ పోస్టులను వదిలేసి వెళ్లాలని మిజోరాం ఎస్పీ సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం?” అంటూ అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అమిత్ షాకు ఫిర్యాదుచేశారు. ఇరు ముఖ్య‌మంత్రులూ అమిత్ షా జోక్యం కోరుతూ ట్వీట్ల యుద్ధానికి తెర తీశారు.

ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణం ఏంటంటే..

మిజోరాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు అసోంతో సరిహద్దు వివాదాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే గ‌త నెల‌లో కూడా అసోం – మిజోరాం మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాల మ‌ధ్య లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడువులు ఉన్నందున.. సరిహద్దులను కచ్చితంగా గుర్తించలేదు. హద్దురాళ్లను ఏర్పాటు చేయలేదు. ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన చట్టం-1971 ప్రకారం లుషాయ్‌ కొండలను అసోం నుంచి విడదీసి, మిజోరాం కేంద్రాపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. 1972లో మిజోరాం రాష్ట్ర హోదాను పొందింది. సరిహద్దులను నిర్ణయించకపోవడంతో.. అక్కడి వారు ఇక్కడి భూముల్లో.. ఇక్కడి వారు అక్కడి భూముల్లో వ్యవసాయాలు చేసుకోవడం.. సాధారణంగా మారింది. బ్రిటిష్‌ పాలకులు విడుదల చేసిన రెండు నోటిఫికేషన్ల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ఇప్పుడు ఘర్షణలకు దిగుతున్నాయి.

1875లో బెంగాల్‌ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం.. లుషాయ్‌ కొండలు, కచర్‌ మైదాన ప్రాంతాల సరిహద్దులను నిర్ణయించారు. 1933లో మణిపూర్‌-లుషాయ్‌ కొండల సరిహద్దులను నిర్ణయిస్తూ మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాన్ని అసోం అనుకూలంగా మలచుకుంటూ పలు ప్రాంతాలు తమ పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోంది. మిజోరాం స్థానికులు మాత్రం.. మ్యాపుల రూపకల్పన సమయంలో అధికారులు తమ అభిప్రాయడం తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఈ ఘర్షణలకు కారణమని ఆరోపిస్తున్నారు.

1994లో కూడా ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని, ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2006లోనూ ఈ ఘర్షణలతో 306వ జాతీయ రహదారి 12 రోజులపాటు మూతపడింది. పక్షం రోజుల క్రితం మళ్లీ ఘర్షణలు మొదలవ్వడం, ఐఈడీలు పేలడంతో కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల అధికారులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా.. కచ్చితమైన పరిష్కారం సూచించలేదు. ఇది జరిగిన రెండు రోజులకే.. కాల్పుల ఘటన సంచలనం రేపింది.

ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు

అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున పోలీసులు, స్థానికులు, రైతులు మోహరించి ఘర్షణకు దిగుతున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులపై మరో రాష్ట్రానికి చెందిన పౌరులు దాడులు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాల్పులు, గ్రనేడ్ దాడులు కూడా జరిగాయని, ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం రాత్రి తమ భూభాగంలోని పంటలు, పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెలను అస్సాం అధికారులు కాల్చేశారని మిజోరాం రైతులు ఆరోపిస్తుండగా, సదరు భూభాగం తమదేనని అస్సాం అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా గొడవ చెలరేగింది.

ముఖ్య‌మంత్రుల మాట‌ల యుద్ధం

ముఖ్యమంత్రుల మాటల యుద్దం.. రెండు రాష్ట్రాల మధ్య సోమవారం యుద్ధ వాతావరణం నెలకొంది. కచార్-కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వద్ద ఇరువైపులా వాహనాలను ధ్వంసం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా సరిహద్దు గుండా ప్రయాణించొద్దంటూ కార్లు, బైకులను చిత్తుచిత్తు చేశారు. దాడుల ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. సదరు వీడియోలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేస్తూ మిజోరాం, అస్సాం ముఖ్యమంత్రులు ట్విటర్ లోనే మాటల యుద్ధం చేసుకున్నారు.

అమిత్ షా స‌ర్ది చెప్పినా..

సరిహద్దు గొడవల నేపథ్యంలో ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల కిందటే కీలక మీటింగ్ నిర్వహించారు. షిల్లాంగ్ లో జరిగిన ఆ మీటింగ్ లో అస్సాం సర్కారు ఆక్రమణలపై మిజోరాం సీఎం ఫిర్యాదు చేయగా, మిజోరాం పోలీసులు, అధికారులే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అస్సాం సీఎం వాదించారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో చివరికి.. గొడవలు పడొద్దని అమిత్ షా సర్దిచెప్పగా, సీఎంలందరూ సరేనని తలూపారు. సీన్ కట్ చేస్తే, 24 గంటలు తిరిగేలోపే మళ్లీ అల్లర్లు రాజుకున్నాయి. ముఖ్య‌మంత్రులు మ‌ళ్లీ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడైనా ఆ రాష్ట్రాల స‌మ‌స్య‌కు క‌చ్చిత‌మైన ప‌రిష్కారం ల‌భిస్తుందా చూడాలి.