iDreamPost
iDreamPost
అల్లుడి ఆతృతే తప్ప..కూతురు కంగారు పడడం లేదన్న సామెతను తలపిస్తోంది ఏపీలో బీజేపీ పరిస్థితి. ఏదో విధంగా తాము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ కమలానికి ఏపీ కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. సాటి తెలుగు రాష్ట్రం మాదిరిగా దూకుడుగా వెళ్లాలని చూసినా ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. పైగా పాలక, ప్రతిపక్షాలు ఏదో మేరకు బలంగా కనిపిస్తున్నాయి. దాంతో మూడో పార్టీకి అవకాశం అంతంతమాత్రమేనా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అందులోనూ 2019లో కేవలం ఒక్క శాతం ఓటుకే పరిమితమయిన పార్టీకి జవసత్వాలు సమకూరాలంటే అంత సులువైన విషయం కాదు. ఇది తెలిసినప్పటికీ సోము వీర్రాజు మాత్రం ఒకరకంగా విన్యాసాల చేస్తున్నారని చెప్పవచ్చు తామే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలన్నది కమలదళం కోరిక. కానీ అవకాశాలు రాకపోవడంతో ఎంత ప్రయత్నించినా బీజేపీ మళ్లీ యధాస్థితిలో కనిపిస్తోంది.
గడిచిన సాధారణ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు బీజేపీకి షాక్ ఇచ్చారు. స్వయంగా పీఎం మోడీ పర్యటన చేసిన నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్ దక్కలేదు. దాంతో ఉత్తరాదిన బలం చూపించినప్పటికీ దక్షిణాన, అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అసలు అవకాశం లేదనే అభిప్రాయం వినిపించింది. అయితే అనూహ్యంగా టీడీపీ కుదేలుకావడంతో ఆ స్థానాన్ని తాము చేజిక్కించుకోవాలనే ఆతృత బీజేపీ నేతల్లో బయలుదేరింది. కానీ క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలంలేని పార్టీ వైపు మొగ్గుచూపేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితమే బీజేపీ కేంద్ర కార్యాలాయానికి కూడా వెళ్లి వచ్చిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు బీజేపీలో చేరడానికి సుముఖంగా లేరు. ఆయనతో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు కొందరు తమ వైపు వచ్చేస్తున్నరని ప్రచారం చేసుకున్న బీజేపీకి ఇది మింగుడుపడడం లేదు.
ఆ తర్వాత సోము వీర్రాజు ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే మొట్ట మొదట కలిసింది మెగాస్టార్ చిరంజీవిని. పవన్ కళ్యాణ్ కన్నా ముందే వీర్రాజు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ చిరు మాత్రం అమరావతి వచ్చి జగన్ కలిసిన తర్వాత మూడు రాజధానులకు సై అని చెప్పడంతో పాటుగా జగన్ పాలనను అభినందించారు. ప్రజారాజ్యం అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న చిరంజీవి ఇప్పుడు మళ్లీ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అంత సుముఖంగా లేరని అర్థమవుతోంది. అయితే ఎన్నికల నాటికి తమ వైపు చిరంజీవి వస్తారని, ఆయన చరిష్మాతో బీజేపీ ఎదుగుతుందనే ప్రచారం మాత్రం బీజేపీ నేతలు కొందరు చేసుకుంటున్నారు. ఆయన పేరుతో కొందరు నేతలను ఇతర పార్టీల నుంచి తమ వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ వ్యూహమే అయినా ఫలించడం లేదు.
ఈలోగా టీడీపీ మాజీ మంత్రి, ఇటీవలే ఏపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన కళా వెంకట్రావు కుటుంబానికి కండువా కప్పుతాం..రా రమ్మంటూ కమలం పిలిచింది. ఈ లిస్టులో కళా వెంకట్రావు కూడా ఉన్నారని ప్రకటన విడుదల చేసింది. దాంతో టీడీపీ అధిష్టానం ఖంగుతినాల్సి వచ్చింది. కళా వెంకట్రావుని బుజ్జగించి, ఇప్పుడే అలాంటి ఆలోచన లేదనే మాట మాత్రం చెప్పింగలిగారు. కానీ బీజేపీ నేతల ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. అదే సమయంలో కాపు ఉద్యమానికి బ్రేకులు వేసేస్తున్నట్టు ప్రకటించిన వయోవృద్ధ నేత ముద్రగడ పద్మనాభంతో తాజాగా సోము వీర్రాజు సమావేశయ్యారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరువురు చెప్పినప్పటికీ మళ్లీ బీజేపీలో చేరాలని ముద్రగడను ఆపార్టీ నేతలు ఆహ్వానించడం విశేషం. కానీ ముద్రగడ కూడా అవునని, కాదని చెప్పకపోవడంతో ఎప్పటికయినా ఆయనకు తామే దిక్కుని బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.
ఏపీలో బీజేపీ బలోపేతానికి కాపు సామాజికవర్గమంతా తమ వైపు తిప్పుకోవాలనే యత్నంలో సోము వీర్రాజు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తున్నట్టు లేదు. కొత్తగా గుర్తింపు ఉన్న నేతలెవరూ కండువాలు కప్పుకోడానికి సిద్ధం కాలేకపోవడం దానికో నిదర్శనం. అయితే బీజేపీ అధ్యక్ష హోదాలో తెలంగాణాలో బండి సంజయ్ దూసుకుపోతుండగా సోము మాత్రం తన ఆటలు సాగడం లేదనే కలవరంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా బీజేపీ అడుగులు తడబడుతూనే ఉండడంతో కమల దళం మథనపడుతున్నట్టు కనిపిస్తోంది. రాబోయే రెండేళ్లలో రాజకీయ మార్పులు వచ్చి, తమకు అనుకూలంగా మళ్లుతాయనే సానుకూల ఆశాభావం మాత్రం ఆపార్టీ నేతల్లో కనిపిస్తోంది.