ఉత్తరాంధ్రపై భారతీయ జనతాపార్టీకి హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురై వెనుకబడి పోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై అపారమైన సానుభూతి కురిపించేస్తోంది. ఈ ప్రాంత వెనుకబాటు తనంపై విజయనగరంలో చర్చా వేదిక పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించింది. ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరింది. ఉత్తరాంధ్రపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు డిమాండ్ చేయడం విడ్డురంగా ఉంది.
ఈ పాపం తమదేనన్న విషయాన్ని దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. తాను దాచిపెట్టినా ప్రజలు గుర్తించలేరని బీజేపీ భావించడం దాని భ్రమే. రాష్ట్ర విభజన చట్టంలో ఉత్తరాంధ్రకు ఇచ్చిన పలు హామీలను ఆ తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కిన విషయం ఉత్తరాంధ్ర వాసులందరికీ తెలుసు.
వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ సహా పలు కేంద్ర విద్యా సంస్థలను ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా అప్పటి యూపీఎ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ వాటిని పొందు పరిచారు. ఏడేళ్లు గడిచాయి. ఈ ఏడేళ్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారం చెలాయిస్తోంది. కానీ ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేసిందా.. అని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముందు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వీటి సంగతేంటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొట్టినప్పుడు రూపొందించిన పునర్విభజన చట్టంలో సీమాంధ్రలో వెనుకబడిన ఏడు జిల్లాల ప్రగతికి రెండు పంచవర్ష ప్రణాళికా కాలాల్లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వీటిలో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. యూపీలోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి, ఒడిశాలోని కోరాపుట్-బోలంగీర్- కలాహాండి (కేబీకే) ప్రాంతాలకు ఇస్తున్న తరహాలో ఈ ప్యాకేజి ఉంటుందని ఊదరగొట్టారు.
కేబీకేకు రూ 5527 కోట్లు, బుందేల్ ఖండ్ కు రూ. 7266 కోట్లు అప్పట్లో ప్యాకేజీ ఇచ్చారు. ఇందులో 90 శాతం కేంద్ర గ్రాంటు, 10 శాతం రుణంగా ఉంటుంది. ప్రత్యేక ప్యాకేజి నిధులతో వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం, పరిశ్రమలు, పౌష్టికాహారం వంటి రంగాలను అభివృద్ధి చేస్తామన్నారు. దాంతో ఉత్తరాంధ్ర వాసులు ఎంతో సంబరపడ్డారు. కానీ ఏడేళ్లలో ఒక్కసారైనా మోదీ ప్రభుత్వం ఈ ప్యాకేజి ఊసు ఎత్తలేదు. ఒక్క పైసా అయినా విదల్చలేదు.
Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?
పట్టాలెక్కని రైల్వే జోన్
మరో ముఖ్యమైన హామీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు. మొదట్లో ఆగ్నేయ రైల్వే, ఇప్పుడు తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా ఉంటూ అన్ని విధాలుగా నష్టపోతున్న ఉత్తరాంధ్రను విడదీసి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూడేళ్ళ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి.. అందులోనూ మెలిక పెట్టారు. రాయగడను విడదీసి ప్రత్యేక డివిజన్ చేస్తూ.. విశాఖ డివిజన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల కొత్త జోన్ వచ్చినా ఆదాయం లేక చతికిల పడుతుంది. ఆ తర్వాత కొత్త జోన్ ఏర్పాటులో ప్రగతి కనిపించలేదు. విశాఖ మీదుగా పలు కొత్త రైళ్లు, దశాబ్దాలుగా కోరుతున్న రైల్వే లైన్లు ఇప్పటికీ మంజూరు కావడంలేదు.
విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు పెట్రో యూనివర్సిటీ మరికొన్ని కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేయటామని హామీ ఇచ్చారు. విశాఖలో పెట్రో వర్శిటీ, మేనేజ్మెంట్ వర్సిటీ ఏర్పాటు చేసినా వాటికి సొంత భవనాలకు నిధులు ఇవ్వడం లేదు. మిగిలినవి ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు.
ఇక ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీంతోపాటు విశాఖ పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థలపై కూడా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది.
వాస్తవాలు ఇలా ఉంటే చర్చావేదికలో కేంద్రం ఏదో చేసేస్తోందని నమ్మబలకడానికి జీవీల్ తదితరులు ప్రయత్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయమని, దానివల్ల ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయని ఉవాచించారు. అదే నిజమైతే సంస్థ ఉద్యోగులే ఎందుకు వ్యతిరేకిస్తారు? అలాగే రైల్వే జోన్ ప్రక్రియ ఏడేళ్లయినా ఇంకా కొనసాగుతోందని చెప్పడం చెవిలో పువ్వులు పెట్టడమే.
ఉత్తరాంధ్రపై శ్వేతపత్రం అడగడానికి ముందు వీటిపై బీజేపీ స్పష్టమైన వివరణ ఇవ్వాలి. అప్పుడే ఎవరి మీద తిరగబడాలో ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది.
Also Read : ఆలయాల కూల్చివేత.. బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..?