తెలంగాణలో అభివృద్ధి శూన్యం, కుటుంబ పాలన నడుస్తోంది అంటూ తెలంగాణ బీజేపీ నేతలు వాపోతుంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం మా కర్ణాటక కంటే తెలంగాణలోని అభివృద్ధి బాగుంది, మా నియోజకవర్గాన్ని తెలంగాణలో కలిపేసుకోండి అని కోరడం సంచలనంగా మారింది. ఆసక్తి కలిగిస్తున్న ఈ వ్యవహారం తాజాగా చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయచూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నా డాక్టర్ శివరాజ్ పాటిల్ తాజాగా ఒక సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో డాక్టర్ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ ఉత్తర కర్ణాటక (హుబ్లీ, ధార్వాడ, బెల్గాం), హైదరాబాద్ కర్ణాటక (గుల్బర్గా, బీదర్)లను అభివృద్ధి చేస్తున్నారని, రాయచూర్‌ను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉండిపోవడం కంటే తెలంగాణలో కలిసిపోతే అక్కడి ప్రభుత్వం అయినా మనల్ని అభివృద్ధి చేస్తుందని ఆయన అనడంతో సమావేశానికి హాజరైన ప్రజలందరూ చప్పట్లతో స్వాగతించడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని కన్నడ లోకల్ ఛానల్ ఒకటి ప్రసారం చేయగా ఆ వీడియోని మంత్రి కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశారు.
ఇక గతంలో కూడా ఐదు మహారాష్ట్ర గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఎంతో కాలంగా అభివృద్ధి నోచుకోని తమ గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం అయినా అభివృద్ధి చేస్తుందని వారు అప్పట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ టెక్నికల్ గా అంత ఈజీగా అయ్యే పనులు కావు అనుకోండి. కాకపోతే ఎలా అయినా తెలంగాణలోకి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.