iDreamPost
iDreamPost
గత కొన్నేళ్లుగా ఓటు బ్యాంక్ పెంచుకుంటూ అధికారాన్ని సుస్థిరం చేసుకున్న భారతీయ జనతాపార్టీ నోట్ల వేటలోనూ తనకు తిరుగులేదనిపించుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సింహ భాగం బీజేపీకే అందాయి. మరో జాతీయ పార్టీ, బీజేపీకి ప్రత్యామ్నాయమైన కాంగ్రెసు ఈ విషయంలోనూ బాగా వెనుకబడింది.
కమలానికి రూ.785.75 కోట్లు
రాజకీయ పార్టీలు తమకు వివిధ సంస్థలు, ట్రస్టులు, వ్యక్తుల నుంచి అందిన విరాళాల వివరాలను ప్రతి ఏటా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు అందించిన వివరాల ప్రకారం.. బీజేపీ రూ.785.75 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. వాస్తవానికి 2018-19లో ఇంతకు రెట్టింపుగా రూ. 1612 కోట్లు అందుకుంది. అయితే కరోనా సంక్షోభం, అన్నిరంగాలు ఇబ్బందుల్లో పడటంతో అన్ని పార్టీలకు అందిన విరాళాల్లో తగ్గుదల కనిపించింది. బీజేపీకి అందిన విరాళాల్లో రూ. 271 కోట్లు.. ఆ పార్టీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖరుకు చెందిన జూపీటర్ కేపిటల్ తోపాటు ఐటీసీ, భారతి ఎయిర్టెల్, జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్స్ వంటి బడా సంస్ధలతో కూడిన ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే అందాయి. బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉన్న కాంగ్రెసుకు రూ. 139.01 కోట్లు అందాయి. ఇందులో రూ. 58 కోట్లు ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి అందాయి. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి రూ. 59.94 కోట్లు అందాయి. వామపక్ష పార్టీలైన సీపీఎంకు రూ. 8.08 కోట్లు, సీపీఐకి రూ.1.29 కోట్ల విరాళాలు అందగా.. బహుజన సమాజ్ పార్టీకి ఒక్క పైసా కూడా అందకపోవడం విశేషం. 2017-18లో రూ. 738 కోట్లు పోగేసుకున్న ఆ పార్టీ పరిస్థితి రెండేళ్లలోనే తిరగబడింది.
ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ ఎస్ టాప్
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 130.46 కోట్లతో అగ్ర స్థానంలో ఉంది. దాని తర్వాత శివసేన రూ.111.40 కోట్లు అందుకుంది. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీకి రూ. 92.70 కోట్ల విరాళాలు అందాయి. ఏడీఎంకే రూ.89.60 కోట్లు, డీఎంకే రూ. 64.90 కోట్ల విరాళాలు అందుకున్నట్లు ఈసీకి లెక్కలు సమర్పించాయి.