iDreamPost
android-app
ios-app

Bitcoin Scandal, Karnataka CM – బిట్ కాయిన్ కుంభకోణం.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బొమ్మై సర్కారు

  • Published Nov 16, 2021 | 5:40 AM Updated Updated Nov 16, 2021 | 5:40 AM
Bitcoin Scandal, Karnataka CM – బిట్ కాయిన్ కుంభకోణం.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బొమ్మై సర్కారు

వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వానికి ఆ ఆనందం లేకుండా పోయింది. బిట్ కాయిన్ కుంభకోణం బీజేపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీన్నే ప్రచార అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ నిత్యం ఆరోపణలతో ఇరుకున పెడుతోంది. ఈ స్కాము చాలా పెద్దదని.. రూ.5 వేల కోట్లకు పైగా చేతులు మారాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కేసులో అరెస్ట్ అయిన హ్యాకర్ శ్రీకృష్ణ రమేష్ ద్వారా ప్రముఖుల వెబ్సైట్లను, ఖాతాలను హ్యాక్ చేయించి అధికార పార్టీ నేతల వారసులు తమ బినామీ అకౌంట్లకు బిట్ కాయిన్ల రూపంలో బదిలీ చేయించుకున్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి బొమ్మై ఖండిస్తున్నా.. రోజురోజుకూ ఆరోపణల దాడి తీవ్రం అవుతుండటంతో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఎవరీ హ్యాకర్ శ్రీకృష్ణ?

గత ఏడాది నవంబర్ 4న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీకృష్ణ రమేష్ అలియాస్ శ్రీకి అనే యువకుడిని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ అబస్టన్సెస్ (ఎండీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతన్ని విచారించిప్పుడు విస్మయం కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. శ్రీకృష్ణ ప్రభుత్వాలు, అత్యంత ప్రముఖుల వెబ్సైట్లు హ్యాక్ చేయడంలో సిద్ధహస్తుడని తేలింది. చిన్నతనం నుంచే కంప్యూటర్లపై అవగాహన, పట్టు పెంచుకున్న అతగాడు బెంగళూరు జయనగర్లో తాను చదువుతున్న పాఠశాల వెబ్సైట్ నే హ్యాక్ చేశాడు. నెదర్లాండ్స్ లో ఉన్నప్పుడు 2019లో అక్కడి బిట్ ఫినిక్స్ ఎక్స్చేంజినే రెండుసార్లు హ్యాక్ చేసేశాడు. తద్వారా 20,008 బిట్ కాయిన్లు సంపాదించాడు. వీటి ద్వారా వచ్చిన ఆదాయంలో బెంగళూరుకు చెందిన హేమంత్ మందప్ప అనే వ్యక్తి పేరుతో ఉన్న రెండు బ్యాంక్ ఖాతాలకు రూ.18 కోట్లు, రూ.28 కోట్లు చొప్పున ట్రాన్స్ఫర్ చేశాడు. కేసు దర్యాప్తు అధికారులు మాత్రం ఆ మొత్తం రూ.11 కోట్లనే అంటున్నారు. 2019లోనే కర్నాటక ప్రభుత్వానికి చెందిన ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ను కూడా హ్యాక్ చేశాడు. హ్యాకింగ్, నగదు బదిలీల ద్వారా వచ్చే ఆదాయంతో జల్సాలు చేసేవాడు. శ్రీకృష్ణ నుంచి రూ. 9 కోట్ల విలువైన 31 బిట్ కాయిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Bandi Sanjay -బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి

బీజేపీ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలు

బిట్ కాయిన్ స్కాంలో కర్ణాటక బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ క్రైమ్ బ్రాంచి ద్వారా శ్రీకృష్ణను అధికార పార్టీకి చెందిన వారు నిర్బంధించి.. అతని ద్వారా ప్రముఖుల వెబ్సైట్లు హ్యాక్ చేయించి అక్రమ లావాదేవీలు జరిపారని ఆరోపించారు. గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 14 మధ్య జరిగిన లావాదేవీల విలువ సుమారు రూ.5240 కోట్లని సూర్జేవాలా పేర్కొన్నారు. ఇవన్నీ బిట్ కాయిన్ల రూపంలో అధికార పార్టీ ప్రముఖుల వారసుల ఖాతాల్లోకి, హ్యాకర్ శ్రీకృష్ణకు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ లావాదేవీల సమయంలో రాష్ట్ర హోంమంత్రిగా ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మై ఉన్న విషయాన్ని సూర్జేవాలా గుర్తు చేశారు. ఇందులో ఆయన పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

తిప్పికొట్టడానికి బొమ్మై పాట్లు

నానాటికీ తీవ్రం అవుతున్న బిట్ కాయిన్ ఆరోపణలు బొమ్మై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే కుంభకోణం ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత సీఎం ఎదురు దాడి మొదలు పెట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తూ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు ఇస్తే ప్రభుత్వంలో, పార్టీలో వారు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు హ్యాకర్ శ్రీకృష్ణను అరెస్టు చేసిందే తమ ప్రభుత్వమని గుర్తు చేశారు. 2018లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని విడిచి పెట్టిందని ప్రత్యారోపణలు చేశారు. ఆరోపణలను ఖండిస్తున్నా.. ఈ స్కాం తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా మాజీ సీఎం యడ్యూరప్ప ను ఆశ్రయించి.. పార్టీ పెద్దలతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానన్న హామీ పొందినట్లు సమాచారం.

Also Read :Telangana MLC Elections -ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్న బీజేపీ