iDreamPost
android-app
ios-app

ఇద్దరు సీఎంలను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి పెద్దిరెడ్డి

  • Published Oct 11, 2021 | 7:06 AM Updated Updated Oct 11, 2021 | 7:06 AM
ఇద్దరు సీఎంలను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి పెద్దిరెడ్డి

సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో రాణించడం చిన్న విషయం కాదు. అందులోనూ ఇద్దరు సీఎం స్థాయి నేతలను ఎదుర్కొని.. అడుగడుగునా ఆటుపోట్లను తట్టుకొని రాజకీయాల్లో చక్రం తిప్పగలగడం ఏ కొద్దిమందికో తప్ప అందరికీ సాధ్యం కాదు. అలా నిలబడి తనకు ఎదురులేదని నిరూపించుకున్న నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజకీయం కోసమే రాజకీయాలు చేయడం కాకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి.. వారి సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ వారి ఆదరణతో అంచెలంచెలుగా ఎదిగిన ప్రజా నాయకుడిగా పెద్దిరెడ్డి గుర్తింపు పొందారు. మొదట కాంగ్రెసులో.. ఇప్పుడు వైఎస్సార్సీపీలో కొనసాగుతూ చిత్తూరు జిల్లాను పార్టీకి కంచుకోటగా మలిచారు.

విద్యార్థి సంఘ నేతగా మొదలు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1954లో జన్మించిన పెద్దిరెడ్డి ఎంఏ, పీహెచ్డీ చేశారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆయన ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో తిరుపతిలో హౌస్ సర్జన్ కోర్స్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీవెంకటేశ్వర మెడికల్ కళాశాల హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సందర్బంగా కొంత పరిచయం తప్ప వారిద్దరి మధ్య సాన్నిహిత్యం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు సహచరులు అయ్యారు. కాగా వర్సిటీలో పెద్దిిిరెడ్డికంటే చంద్రబాబు సీనియర్ స్టూడెంటుగా ఉండేవారు.

Also Read: పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…

మొదటి అడుగు తడబడినా.. తర్వాత తిరుగులేదు

వైఎస్ రాజశేఖరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1975లో క్రియాశీల రాజకీయాల్లో చేరిన పెద్దిరెడ్డి నీలం సంజీవరెడ్డి సలహా మేరకు 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పీలేరు నుంచి పోటీ చేశారు. అదే ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ తరఫున వైఎస్, ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రబాబు పోటీ చేశారు. అయితే వారిద్దరూ గెలవగా పెద్దిరెడ్డి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెసులో చేరిన ఆయనకు 1983లో టికెట్ లభించలేదు. 1985లో టికెట్ వచ్చినా విజయం వరించలేదు. 1989 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. 1999, 2004 ఎన్నికల్లోనూ పీలేరు నుంచి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గం మారి పుంగనూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ కేబినెట్లో మంత్రి అయ్యారు. వైఎస్ తదనంతరం వైఎస్సార్సీపీ లో చేరి పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. 2014, 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించి ప్రస్తుతం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.

బాబు, కిరణ్ లను ఎదుర్కొని..

చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన రాజకీయ శక్తులను తన ప్రజాబలంతో ఎదుర్కొని పెద్దిరెడ్డి ఈ స్థితికి ఎదిగారు. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సొంత ప్రాంతమైన పీలేరుకు చెందినవారే. ఆయనది జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబం. కిరణ్ తండ్రి నల్లారి అమరనాథ్ రెడ్డి మంత్రిగా పనిచేయడమే కాకుండా.. ఒక సమయంలో సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది. పార్టీ పరంగా అమరనాథ్ రెడ్డితో పెద్దిరెడ్డికి కొంత సాన్నిహిత్యం ఉండేది. వైఎస్ తదనంతరం ఏర్పడిన రోశయ్య తర్వాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన పెద్దిరెడ్డిని ఈ విభేదాలతోనే మధ్యలో పదవి నుంచి తప్పించారు.

Also Read:మాజీమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు?

ఇక విద్యార్థిగా తనకంటే సీనియర్, రాజకీయాల్లో సమకాలికుడు అయిన చంద్రబాబుతో పెద్దిరెడ్డికి మొదటి నుంచీ రాజకీయంగానే విభేదాలు ఉన్నాయి. 1983లో ఓటమి తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరగా.. పెద్దిరెడ్డి కాంగ్రెసులో చేరారు. 1994 నుంచి 2004 వరకు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రారెడ్డి సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబును రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. సీఎం సొంత జిల్లాలోనే టీడీపీని ఎదగకుండా చేశారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలిచి చంద్రబాబు మళ్లీ సీఎం అయినా తన సొంత జిల్లాలో మాత్రం ఎక్కువ స్థానాలు సాధించడంలో విఫలమయ్యారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుంటే రాష్ట్రంలోనే అత్యధికంగా తొమ్మిదింటిలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ తన వ్యూహాలతో జెడ్పీ అధ్యక్ష పదవి కాంగ్రెసుకే దక్కేలా చేశారు.

వైఎస్సార్సీపీకి కంచుకోటగా

రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించినా చిత్తూరు జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఆధిక్యత దక్కకుండా అడ్డుకోవడంలో పెద్దిరెడ్డి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో అయితే చంద్రబాబు పోటీ చేసిన కుప్పం తప్ప మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంలో ఆయనదే కీలకపాత్ర. అనంతరం జరిగిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలపై స్పందిస్తే రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా రాణిస్తారనడానికి తానే నిలువెత్తు నిదర్శనంగా పెద్దిరెడ్డి నిలుస్తున్నారు.

తిరుగులేని వారసత్వం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున లోక్ సభకు ఎన్నికయ్యాడు. తండ్రి వారసుడిగా మిథున్ చిత్తూర్,రాజంపేట లోక్ సభ పరిధిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ స్థాయిలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా మంచి గుర్తింఫు తెచ్చుకున్నాడు. మంచి వాగ్ధాటి కలిగిన మిథున్ రెడ్డి రాష్ట్ర సమస్యల మీద గళంవిప్పుతుంటాడు.

రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

చంద్రబాబుకు చమటలు పట్టిస్తున్న పెద్దిరెడ్డి

1989 నుంచి కుప్పంను తన కోట గా మలుచుకున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో చమటలు పట్టాయి. కౌంటింగ్ రోజు తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనకపడ్డాడు. కుప్పం సీట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి ఒక దశలో సొంత తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డినే కుప్పం బరిలో దించాలనుకున్నాడు కానీ బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని భావించి స్థానికుడైన రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కి పోటీచేసే అవకాశం ఇచ్చారు. ఆయన ఎన్నికలముందు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నా పెద్దిరెడ్డి కుప్పం ఎన్నిక బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు సీఎం అయినా తరువాత అత్యల్ప మెజారిటీ మొన్నటి ఎన్నికల్లో వచ్చింది .

Also Read:చంద్ర‌బాబు రెండు స్థానాల్లో పోటీ చేయ‌నున్నారా?

స్థానిక ఎన్నికల్లో కుప్పం లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది .. చంద్రబాబు పూర్తిగా పట్టుకోల్పోయాడన్న వాదనలతో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రెండు స్థానాల్లో పోటీచేస్తాడన్న వార్తలు రావటం గమనార్హం ..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు…