Idream media
Idream media
మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు వ్యక్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ (పీఎస్ నరసింహ) మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి శ్రీనరసింహం స్వ గ్రామం. ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జస్టిస్ పీఎస్ నరసింహ న్యాయవాద వృత్తి నుంచి నేరుగా న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుత సీనియారిటీ ప్రకారం 2027 అక్టోబర్ నుండి మే 2028 వరకు షుమారు 8 నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే అవకాశం కూడా దక్కనుంది.
మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. నరసింహం పూర్వీకులు మోదేపల్లిలో నివాసం ఉండి వ్యవసాయం చేశారు. అది లాభసాటిగా లేకపోవటంతో పిల్లల ఉన్నత చదువుల కోసం గుంటూరు వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు మారారు. శ్రీనరసింహ తండ్రి కోదండరామయ్య హైదరాబాద్‌లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తెలు. వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. బడీచౌడీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో, నిజాం కళాశాలలో పీఎస్ నరసింహ విద్యాభ్యాసం చేశారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడానికి ఢిల్లీ వచ్చిన ఆయన పట్టభద్రుడయ్యాక దేశరాజధానిలోనే ప్రాక్టీసు కొనసాగించారు.
1990 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న పీఎస్ నరసింహ 2014-2018 మధ్య నాలుగేళ్లు అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. అయోధ్యలో రామమందిరం అనుకూలంగా కేసు వాదించిన ప్యానెల్ లో ఆయన ముఖ్యుడు. అలాగే 15 సంవత్సరాలు లిటిగేషన్లో ఉన్న బీసీసీఐ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి 145 గంటలపాటు చర్చించి, అందర్నీ ఒప్పించి దాని పరిపాలనకు సంబంధించిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం ఆయనకెంతో పేరు తెచ్చింది. ఇవాళ క్రికెట్ ని శాసిస్తున్న బీసీసీఐ ఇంత బలంగా ఉండడానికి కారణం ఆయనేనంటే అతిశయోక్తి కాదు.
సుప్రీం కోర్ట్ న్యాయవాదిగా పీఎస్ నరసింహ అనేక పర్యావరణ, అటవీ చట్టాలకు సంబంధించి పలు కేసులు కూడా వాదించారు. పర్యావరణ, అటవీ బెంచ్‌కు అమికస్ క్యూరీగా 3 సంవత్సరాలు ఉన్నంతకాలం ముఖ్యమైన పర్యావరణ, అటవీ చట్టాలు, గిరిజన హక్కుల రూపకల్పనలో శ్రీనరసింహ ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు కేసులో కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన కీలక వాదనలు చేశారు.
పీఎస్ నరసింహ పూర్వికులు అద్దంకి మండలం అలవలపాడు గ్రామంలో కరణికాలు చేసేవారు. వీరు శ్రీరామభక్తులు. పీఎస్ నరసింహ గారి కుటుంబానికి అద్దంకి మండలం మోదేపల్లిలో కూడా కొంత వ్యవసాయ భూమి ఉండడంతో వారి తాత గారు అలవలపాడు నుండి వెళ్లి ఆ గ్రామంలో స్థిరపడ్డారు.
జస్టిజ్ నరసింహ తాత సోదరులు (పెద్ద తాత ) శ్రీరామభక్త పమిడిఘంటం వెంకటరమణ దాసు గారు భద్రాచలంలో అంబా అన్నదాన సత్రం (అలవలపాటి వారి సత్రం) ను నెలకొల్పి భద్రాచలం వచ్చే రాములవారి భక్తులకు విశిష్ట సేవలందించారు. ఇటీవల దేవస్థానంవారు దీనిని పునర్నిర్మించారు. ఈ సత్రానికి భక్తులు కొన్ని వందల ఎకరాల భూములు విరాళంగా ఇచ్చారు. ఇటీవల వరకు పీఎస్ నరసింహ గారి తండ్రి రిటైర్డ్ హైకోర్ట్ జడ్జీ పమిడిఘంటం కోదండరామయ్య ఈ సత్రం ట్రస్టిగా సత్రం వ్యవహారాలు చూసేవారు.. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రస్తుతం ఈ సత్రాన్ని శ్రీ భారత తీర్ధ మహాస్వామి వారి పీఠానికి అప్పగించారు.
Also Read : కుదిరిన పదవుల పంపకం,రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కినట్లే !