iDreamPost
android-app
ios-app

రిపబ్లిక్ డే పెరేడ్ కొన్ని రాష్ట్రాలకేనా?

  • Published Jan 19, 2022 | 2:00 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
రిపబ్లిక్ డే పెరేడ్ కొన్ని రాష్ట్రాలకేనా?

దేశం గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోంది. స్వతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండుతున్న తరుణంలో ఈసారి వేడుకలకు ప్రాధాన్యత ఉంది. అన్ని చోట్లా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట సాక్షిగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా ఈ వేడుకలు జరగబోతున్నాయి. సహజంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే కవాతులో వివిధ రాష్ట్రాల తమ ఔన్నత్యాన్ని చాటే రీతిలో శకటాల ప్రదర్శన చేస్తుంటాయి. కానీ ఇటీవల ఈ శకటాల ఎంపిక విషయంలోనూ రాజకీయ విమర్శలు రావడం విస్మయకరంగా మారుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకే తప్ప ఇతరులకు అవకాశం ఉండదా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వంటి వారు ప్రశ్నించడం ఆశ్చర్యమేస్తోంది.

ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాలు తమ శకట నమూనాలు కేంద్రానికి పంపించాయి. రక్షణ శాఖ వాటిని పరిశీలిస్తుంది. అవసరమైన మార్పులు చెబుతుంది. లేదంటే శకటాలను తిరస్కరించే అధికారం కూడా రక్షణ శాఖదే. దానికి సంబంధించిన కారణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మూడు రాష్ట్రాల శకటాల నమూనాలను తిరస్కరించారు. అందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఉన్నాయి. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించాయి. కేంద్రం తీరుని తప్పుబట్టాయి. ప్రధాని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ ని తిరస్కరించిన రాష్ట్రాలుగా ఈ మూడు రాష్ట్రాలకు గత ఏడాది ఎన్నికల సందర్భంగా తీర్పు వచ్చిన తరుణంలో ఈ శకటాల తిరస్కరణ ఆసక్తిగా మారింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ నమూనాతో తాము శకటం రూపొందిస్తే తిరస్కరిస్తారా అంటూ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు సుభాష్‌ చంద్రబోస్ చుట్టూ బీజేపీ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆయన స్ఫూర్తిని చాటే శకటాన్ని తిరస్కరించిందనే వాదన చర్చనీయాంశం అవుతోంది. అదే రీతిలో కేరళ ప్రభుత్వం నారాయణ గురు నమూనా పంపించింది. 2016లోనే నారాయణ గురు వారసులను బీజేపీలో చేర్చుకున్నారు. సాంఘిక సంస్కరణోద్యమాలతో సమాజంలో మార్పులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఆయన్ని బీజేపీ కొనియాడింది.

రాజకీయంగా ఆయన ఫోటోలను వాడుకున్నారు. తీరా ఇప్పుడు కేరళ ప్రభుత్వమే నారాయణ గురు నమూనాతో శకటం రూపొందిస్తే కాదనడం ఏమిటంటూ కేరళ ప్రభుత్వం నిరసన తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది. తమ రాష్ట్ర ప్రభుత్వ శకటాన్ని అనుమతించాలని కోరింది. కేంద్రం వైఖరిని తప్పుబట్టింది.

వాటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల శకటాలకు కూడా ఈసారి ఛాన్సివ్వకపోవడం విశేషం. 12 రాష్ట్రాలతో పాటుగా 9 కేంద్ర ప్రభుత్వశాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలకు మాత్రం కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతి వచ్చింది. వాటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉండడం, దక్షిణాది నుంచి కేవలం బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకకు మాత్రమే అవకాశమివ్వడం విమర్శలకు తావిస్తోంది. తాము పంపించిన శకట నమూనాలను తిరస్కరించిన తరుణంలో ఏపీ, తెలంగాణా ప్రభుత్వాల తరుపున ఈ వేడుకలకు హాజరుకావాలా లేదా అనేది కూడా పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి మొత్తం 56 ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరిలో 21 ని షార్ట్‌లిస్ట్ చేశామని, ప్రతి సంవత్సరం ఇదే విధమైన ఎంపిక ప్రక్రియను అవలంబిస్తున్నామని వారు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి అందిన పట్టిక ప్రతిపాదనలు కళ, సంస్కృతి, శిల్పం, సంగీతం, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ రంగాలలో ప్రముఖులతో కూడిన నిపుణుల కమిటీ వరుస సమావేశాలలో చర్చించి ఎంపికలు చేయడం జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. రాజకీయ విమర్శలను తోసిపుచ్చింది. కానీ పరిణామాలు దానికి భిన్నంగా ఉండడంతో గణతంత్ర వేడుకల చుట్టూ రాజకీయాలు అలముకోవడం విశేషం.