iDreamPost
android-app
ios-app

భారత దేశంలో బ్రిటిష్ రాజ్యానికి పునాది వేసిన వెన్నుపోటు – ప్లాసీ యుద్ధం!!

భారత దేశంలో బ్రిటిష్ రాజ్యానికి పునాది వేసిన వెన్నుపోటు – ప్లాసీ యుద్ధం!!

క్రీ. శ. 1600 లో భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వ్యాపారం మీదనే దృష్టి పెట్టి, కలకత్తా, బొంబాయి, చెన్నపట్టణంలో ఫ్యాక్టరీలు, గోడౌన్లూ నిర్మించుకుని స్థానిక పాలకుల సహకారంతో కొత్త ప్రదేశాలకు వ్యాపారాన్ని విస్తరించడం మీదనే తన శక్తియుక్తులు వెచ్చించింది. మూడు చోట్లా కంపెనీకి ఆధునిక ఆయుధ సంపత్తితో కూడిన సైన్యం ఉన్నా స్థానిక పాలకుల మధ్య యుద్దాలలో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారి పక్షాన పోరాడే కిరాయి సైన్యంగానే అది పని చేసింది. అయితే దీన్ని పూర్తిగా మార్చివేసి భారతదేశంలో కంపెనీ పాలన, ఆ తరువాత బ్రిటిష్ రాణి పాలన ఏర్పడడానికి, దాదాపు రెండు శతాబ్ధాలు భారతదేశం బానిసత్వంలో మగ్గడానికి నాంది పలికింది 23 జూన్, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం!!

యుద్ధ నేపధ్యం

బెంగాల్ నవాబు అలివర్ధీ ఖాన్ కి తన కూతురు కొడుకైన సిరాజ్ ఉద్దౌలా అంటే ప్రత్యేక అభిమానం. అతడు పుట్టిన తర్వాత చిన్న పాలకుడైన అలివర్ధీ ఖాన్ అంచెలంచెలుగా ఎదిగి బెంగాల్ ప్రాంతానికి నవాబయ్యాడు. అందుకే చిన్నప్పటి నుంచి కాబోయే పాలకుడిలాగా అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పించి, తనతో పాటు యుద్ధ రంగానికి కూడా తీసుకెళ్ళేవాడు.

స్వతహాగా తాగుబోతు, తిరుగుబోతు అయినా, 1752లో సిరాజుద్దౌలాకి నవాబుగా అధికారం అప్పగించాడు. వృద్దుడైన అలివర్ధీ ఖాన్ సిరాజుద్దౌలాకి ఫ్రెంచి అమ్మాయిల మీద ఉన్న మోజు వల్ల బెంగాల్ ప్రాంతంలో ఉన్న ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ వారితో పరిచయం ఉండేది. సిరాజ్ నవాబు కాగానే ఫ్రెంచి వారి వ్యాపార విస్తరణకు అనుమతులు ఇవ్వడమే కాకుండా, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మీద ఆంక్షలు కూడా విధించాడు.ఫ్రెంచి వారికి తన సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వడం, వారి వద్ద తుపాకులు, ఫిరంగులు కొనడం చేశాడు సిరాజ్.

ఇదిలా ఉండగా తన అనుమతి లేకుండా బ్రిటిష్ వారు తమ ప్రాంతమైన ఫోర్ట్ విలియంలో కొత్త గోడౌన్ల నిర్మాణం చేస్తున్నారని తెలిసి, వారి ఫ్యాక్టరీలు, గోడౌన్లూ కూల్చి, బ్రిటిష్ వారందరినీ ఖైదు చేయించాడు సిరాజుద్దౌలా. గాలి కూడా ఆడని చిన్న గదిలో ఎక్కువ మందిని బంధించడంతో పిల్లల, మహిళలు చాలా మంది మరణించారు. అయితే సిరాజుద్దౌలాకి తెలియకుండా కింది స్థాయి సైనికులు చేసిన పని.

ఈ సంగతి చెన్నపట్టణంలో ఉన్న తమవారికి తెలియజేశారు మిగిలిన బ్రిటిష్ వారు. అక్కడ నుంచి రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో బ్రిటిష్ సైనికులు, భారత సిపాయిలతో కూడిన ఒక దళం బయలుదేరి కలకత్తా చేరుకుంది. నవాబుతో యుద్ధం అనివార్యం అని తెలిసిపోయింది క్లైవుకి. అయితే సంఖ్యాపరంగా సిరాజ్ సైన్యం చాలా పెద్దది. ఫ్రెంచివారు సరఫరా చేసిన ఆయుధాలు కూడా ఉన్నాయి. నేరుగా యుద్ధం జరిగితే తమని ఊచకోత కోస్తారని తెలిసుకున్న క్లైవ్ సిరాజుద్దౌలా మేనమామ, సైన్యాధ్యక్షుడు అయిన మీర్ జాఫర్ కు వల వేశాడు. అధిక మొత్తంలో ధనం ఇస్తామని, యుద్ధంలో సిరాజుద్దౌలా మరణించాక అధికార పీఠం ఎక్కడానికి సహకరించి, తోడుగా ఉంటామని ఆశ చూపించాడు.

యుద్ధం

23జూన్ 1757న ఇరు సైన్యాలు హుగ్లీ నది ఒడ్డున ఉన్న పలాషీ ప్రాంతంలో తల పడ్డాయి. పలాషీ ఆంగ్ల చరిత్రకారుల చేతిలో ప్లాసీగా మారింది.

యుద్ధంలో తన సైన్యాన్ని సిరాజుద్దౌలా త్రికూట వ్యూహంలో మోహరించాడు.ఒక పార్శ్వంలో మీర్ జాఫర్ నాయకత్వంలో కాల్బలం, మరో పార్శ్వంలో మీర్ మదన్ అనే మరో సైన్యాదక్షుడి నాయకత్వంలో అశ్విక దళాన్ని ఉంచి, మధ్యలో ఫిరంగి దళాన్ని తనే స్వయంగా నడిపించాడు.

బ్రిటిష్ సైన్యం, ఆంగ్లేయులూ, భారతీయులు కలిసి మూడు వేల మంది అయితే, సిరాజుద్దౌలా సైన్యంలో యాభైవేల మంది సైనికులు ఉన్నారు. వీరు కాక ఫిరంగులు పేల్చడానికి నలభై మంది ఫ్రెంచ్ సైనికులు కూడా ఉన్నారు. యుద్ధం మొదలై సిరాజుద్దౌలా పైచేయి సాధిస్తున్న దశలో అనుకోకుండా కాసేపు భారీ వర్షం కురిసింది. దీంతో మందుగుండు సామగ్రి తడిసిపోయి, తుపాకులు, ఫిరంగులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.

వర్షం ఆగిన వెంటనే బ్రిటిష్ వారి తుపాకులు పేలవని భావించిన మీర్ మదన్ తన అశ్విక దళాన్ని వారి మీదకు దూకించాడు. అయితే బ్రిటిష్ వారు వర్షం మొదలైన వెంటనే తమ తుపాకులు, ఫిరంగులు తమ వెంట తెచ్చుకున్న టార్పాలిన్ పట్టల కింద తడిచిపోకుండా పెట్టుకున్నారు. వర్షం ఆగిన వెంటనే బయటకు తీశారు. ఈ విషయం తెలియకుండా ముందుకు దూకిన మీర్ మదన్ తన దళంతో సహా ఆ తుపాకుల గుండ్లకు బలయ్యాడు. ఈ సమయంలో మరో వైపు నుంచి దాడి చేయమని మీర్ జాఫర్ కు ఆఙ ఇచ్చిన సిరాజుద్దౌలా అతను, అతని సైన్యం అంగుళం కూడా కదలక పోవడం చూసి కుట్ర జరిగిందని తెలుసుకున్నాడు. శత్రువుల తుపాకీ గుండ్లకి పిట్టల్లా రాలిపోతున్న తన సైన్యాన్ని వెనక్కి తగ్గమని, వేగంగా కదలగల ఒక ఒంటెనెక్కి యుద్ధరంగం వదిలిపోయాడు సిరాజుద్దౌలా.

సాయంత్రానికి బెంగాల్ సైన్యాన్ని ఊచకోత కోసిన క్లైవ్ దళం, సిరాజుద్దౌలాని వెతికి బంధించి ఆ తరువాత ఉరి తీసింది. అనుకున్న విధంగా మీర్ జాఫర్ నవాబు అయ్యాడు. క్లైవ్ ఖజానా లూటీ చేసి, అందులో కొంత మీర్ జాఫర్ కి ఇచ్చాడు. ఇప్పుడు బెంగాల్ ప్రాంతంలో ఆంగ్లేయుల హవా మొదలైంది. పేరుకే నవాబు ఉన్నా పాలన మొత్తం ఆంగ్లేయులదే.

అయితే ఆంగ్లేయుల పెత్తనం భరించలేక, డచ్చి వారితో కలిసి ఆంగ్లేయులను బెంగాల్ నుంచి తరిమివేయడానికి మీర్ జాఫర్ పధకం వేశాడు. 1760లో డచ్చి వారితో కలిసి ఈస్టిండియా కంపెనీ సైన్యంతో పోరాడి ఓడిపోయాడు మీర్ జాఫర్. కంపెనీ వారు మీర్ జాఫర్ అల్లుడు మీర్ ఖాసింని పీఠమెక్కించారు. అయితే మీర్ ఖాసిం కూడా బ్రిటిష్ వారి పెత్తనం తట్టుకోలేక వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో 1763లో అతడ్ని దించివేసి, ఈసారి బుద్ధిగా ఉంటానని వేడుకున్న మీర్ జాఫర్ కి మరోసారి అధికారం అప్పగించారు. రెండేళ్లు ఆంగ్లేయుల చేతిలో కీలుబొమ్మగా రెండేళ్లు పాలించి మీర్ జాఫర్ మరణించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈస్టిండియా కంపెనీ పాలన మొదలై భారత ఉపఖండం అంతటా విస్తరించింది.