కొద్ది రోజుల క్రితం జీవో 317కి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష, అరెస్టు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తన హక్కులను కాల రాసే విధంగా కరీంనగర్ పోలీసులు వ్యవహరించారని ఎంపీ సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి గతంలో ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఆ ఫిర్యాదు స్వీకరించడంతో బండి సంజయ్ నిన్న ఢిల్లీలో కమిటీ ఎదుట హాజరై వివరాలు వెల్లడించారు. తనను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తన చొక్కా కాలర్ పట్టుకుని దుర్భాషలాడుతూ తన ఆఫీస్ నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లేందుకు యత్నించారని బండి సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదో జరిగిపోతోంది అన్నట్టు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి తన ఆఫీస్ గ్రిల్స్‌ను కత్తిరించారని, ఇలా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సహా పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారని ప్రివిలేజ్ కమిటీకి తెలియజేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా 2019 అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని తనపై దాడి చేశారని వెల్లడించారు. ఆరోజు జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ప్రివిలేజ్ కమిటీకి సమర్పించారు. ఘటనకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారాలుగా బండి సంజయ్ కమిటీకి సమర్పించారు.
అంతే కాక ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించడంతో పాటు నిబంధలను ఉల్లంఘించిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి, జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్ రావు, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ చల్లమల్ల నరేష్ సహా ఇతర పోలీస్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కమిటీని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి, కరీంనగర్ సీపీకి లోక్‌సభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 3న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిని సైతం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.