iDreamPost
iDreamPost
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హోరు పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణాలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. కేసీఆర్ క్యాబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహించి, బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ బరిలో ఉండడంతో ఆయన భవితవ్యం చుట్టూ ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. కేసీఆర్ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికలు కూడా భారీ అంచనాలతో సాగుతున్నాయి. ఇప్పటికే పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా ఉపసంహరించుకుంది. జనసేన తొలుత సంప్రదాయం పేరుతో తాము పోటీ చేయబోమంటూ ప్రకటించి, తాజాగా బీజేపీకి మద్ధతు ప్రకటించింది. ఏకగ్రీవాలు సంప్రదాయం అని చెప్పిన పార్టీ నాలుగు రోజులు గడవకముందే మాట మార్చడం చిత్రంగా ఉంది. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థి ప్రచారం ప్రారంభించి సానుభూతి పవనాలను సొమ్ము చేసుకునే దిశలో సాగుతున్నారు.
నామినేషన్ల గడవు ముగిసే సరికి బద్వేలులో 27 మంది నామినేషన్లు వేశారు. అందులో 9 నామినేషన్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు. పరిశీలన అనంతరం వివిధ కారణాలతో వాటిని తోసిపుచ్చడంతో ప్రస్తుతం 18 నామినేషన్లకు ఆమోదం లభించింది. ఉపసంహరణకు రెండు రోజులు గడువు ఉండడంతో బరిలో నిలిచేదెవరన్నది 14వ తేదీకి ఖరారవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. వారితో పాటుగా ఇండిపెండెంట్లు, డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు కూడా ఆమోదించడంతో కొందరు ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. ఈరోజు, రేపట్లో కనీసం ఐదారుగురు నామినేషన్లు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. దాంతో 10 మంది వరకూ పోటీలో నిలుస్తారని అంచనా.
Also Read : హుజురాబాదులో నాలుగు ‘ఈ’ల కలవరం
వైఎస్సార్సీపీకి చెందిన డాక్టర్ దాసరి సుధ ఇప్పటికే తన ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ప్రధాన నేతలను కలుస్తున్నారు. ముఖ్యమైన సెంటర్లలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బద్వేలు రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి రావడంతో స్థానికులు సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో జగన్ సంక్షేమ పథకాలు, దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణం ద్వారా ప్రజల్లో ఉన్న సానుభూతి తనను గట్టెక్కిస్తాయని ఆమె అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ తరుపున రంగంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు విస్తృత పరిచయాలున్నాయి. టీడీపీ బరిలో లేనందున రెండో స్థానం సాధించాలనే సంకల్పంతో ఆమె ప్రయత్నిస్తున్నారు. బీజేపీ యువనేత ను రంగంలో దింపడం ద్వారా ఏమేరకు ఫలితాలు సాధిస్తుందో చూడాలి.
పోటీ తీవ్రంగా ఉన్న తెలంగాణా నియోజకవర్గం హుజూరాబాద్ లో మాత్రం కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. అయితే వాటిలో 19 నామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 61 మంది నామినేషన్లు వేయగా ప్రస్తుతానికి బరిలో 42 మంది ఉన్నట్టు అధికారులు దృవీకరించారు. వాటిలో ఉపసంహరణ తర్వాత కనీసంగా 35 మంది వరకూ బరిలో ఉండే అవకాశం ఉంది. దాంతో అసలే రసవత్తరంగా సాగుతున్న హోరాహోరీ పోరు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులండడం ఆసక్తిగా మారింది.
Also Read : హుజూరాబాద్ : ప్రచార హోరు.. ఎవరో బేజారు!