iDreamPost
android-app
ios-app

ఇడ్లీ నవ్వులు పెసరట్టు కన్నీళ్లు – Nostalgia

  • Published Dec 26, 2020 | 1:12 PM Updated Updated Dec 26, 2020 | 1:12 PM
ఇడ్లీ నవ్వులు పెసరట్టు కన్నీళ్లు – Nostalgia

కమెడియన్లను హీరోగా పెట్టి హిట్లు కొట్టిన దర్శకులు చాలానే ఉన్నారు. ఇందులో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ ఎంటర్ టైన్మెంట్ సరిగ్గా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని యమలీల, అందాలరాముడు లాంటివి ఋజువు చేశాయి. అయితే హాస్య నటుడితో సీరియస్ డ్రామాను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది. ఊహించడం కొంచెం కష్టంగా ఉన్నా జంధ్యాల గారు ఆ సాహసం ఓసారి చేశారు. దాని పేరే బాబాయ్ హోటల్. 1992లో ఈ సినిమా విడుదలయ్యే నాటికి బ్రహ్మానందం టాప్ కమెడియన్. హీరోగా ట్రై చేశారు కానీ అవేమంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సమయంలో రచయిత తోటపల్లి సాయినాధ్ మనసులో అంకురార్పణ చేసుకున్న ఆలోచన బాబాయ్ హోటల్.

బెజవాడ గాంధీ నగర్ ప్రాంతంలో ఈ పేరుతో ఫేమస్ పలహారశాల ఉండేది. కానీ ఇది ఆ ఓనర్ బయోపిక్ కాదు. కేవలం టైటిల్ కోసం మాత్రమే వాడుకున్నారు. అమాయకుడు, మంచివాడు, మధ్యవయస్కుడు అయిన ఓ హోటల్ యజమాని కాలేజీ అమ్మాయిని ప్రేమించడం, ఆమె మరో యువకుడికి మనసు ఇవ్వడం, ఇది తెలుసుకుని ఇతను త్యాగం చేసి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడం అనే లైన్ మీద ఈ కథ సాగుతుంది. సాధారణంగా జంధ్యాల గారి స్టైల్ లో సాగే వినోదం కాకుండా ఇందులో సెంటిమెంట్, ఎమోషన్ ని కాస్తంత బలంగా చొప్పించారు. అగ్ర నిర్మాత కెఎస్ రామారావుకి సబ్జెక్టు విపరీతంగా నచ్చి వెంటనే నిర్మాణానికి పూనుకున్నారు.

కిన్నెర హీరోయిన్ గా కోట శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, సుత్తివేలు, గుండు హనుమంతరావు, జీడిగుంట శ్రీధర్, అనంత్ తదితరులు ఇతర కీలక తారాగణం. మాధవపెద్ది సురేష్ స్వరకల్పనలో నాలుగు పాటలు కంపోజ్ చేయించి చిత్రీకరించారు. 1992 మే 5న విడుదలైన బాబాయ్ హోటల్ సున్నిత ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ జంధ్యాల గారి హాస్యాభిమానులను, సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంత కష్టపడి బాబాయ్ పెళ్లి చేసిన ప్రేమజంట యాక్సిడెంట్ లో చనిపోవడం జీర్ణించుకోలేకపోయారు. కానీ బ్రహ్మానందం అద్భుత నటన నవ్వించడం కన్నా ఎక్కువగా గుండెలను బరువెక్కించింది. అందుకే ఇదో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది.