iDreamPost
iDreamPost
భారతదేశానికి బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు అనేక రూపాల్లో ఉద్యమాలు జరిగాయి. సైనిక తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. మహాత్మాగాంధీ రంగ ప్రవేశంతో స్వరాజ్య సంగ్రామం కొత్త రూపు సంతరించుకుంది. శాంతి, అహింసాయుత పోరాటంతో స్వరాజ్య సాధనకు గాంధీజీ నడుం కట్టినప్పుడు దేశం యావత్తు ఆయన వెంట నడిచింది. కానీ కొందరు నేతలు ఆయనతో విభేదించారు. తుపాకులు, లాఠీలకు పని చెబుతున్న బ్రిటీషర్లను ఎదుర్కోవాలంటే సాయుధ పోరాటమే మార్గమని నినదించారు. అదే లక్ష్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా భారత జాతీయ సైన్యం (ఐ ఎన్ ఏ) ప్రాణం పోసుకుంది. 1942లో సెప్టెంబర్ ఒకటో తేదీన అంటే ఇదే రోజు సింగపూర్ లో ఈ సంస్థ పురుడు పోసుకుంది. రాస్ బిహారీ బోస్ జపాన్ సాయంతో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారు.
జపాన్ తో కలిసి బ్రిటిష్ పై పోరాటం
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జపాన్ భారత జాతీయ సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆనాడు బ్రిటన్ సైన్యం తరఫున యుద్ధంలో పాల్గొని తనకు చిక్కిన భారతీయ సైనికులు సుమారు 50 వేలమందిని జపాన్ ఇవ్వడంతో.. వారితోనే ఐ ఎన్ ఏ ఏర్పాటైంది. రాస్ బిహారీ బోస్ అధ్యక్షుడిగా, మోహన్ సింగ్ కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండేవారు. అయితే యుద్ధంలో పాల్గొనే విషయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ కు జపాన్ సైన్యంతో విభేదాలు తలెత్తడంతో దాని మనుగడ ప్రమాదంలో పడింది.
నేతాజీ చేతిలోకి సైన్యం
అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సాయుధ పోరాటం వైపే మొగ్గు చూపారు. జాతీయ కాంగ్రెస్ కలకత్తా మహాసభల్లో అదే విషయం నొక్కి చెప్పారు. అనంతరం ఆయన తన ఆశయ సాధనకు విదేశీ సాయం కోసం బ్రిటీషర్ల కళ్లుగప్పి దేశం దాటిపోయారు. సౌత్ ఈస్ట్ అసియాకు చేరుకున్న ఆయనకు 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలను రాస్ బిహారీ అప్పగించారు. నేతాజీ దాన్ని బహుముఖాలుగా విస్తరించి పటిష్ట పరిచారు. గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ పేర్లతో వేర్వేరు దళాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి మహిళా సైనికులతో ఝాన్సీ లక్ష్మీభాయి పేరుతో ఒక దళం ఏర్పాటు చేశారు. దీనికి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించారు.
సైన్యంలో కొత్తవారి చేరికలను నేతాజీ ప్రోత్సహించారు. ‘మీరు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వరాజ్యం ఇస్తాను’ అన్న ఉత్తేజపూరిత నినాదాలతో యువతను ఆకట్టుకున్నారు. జపాన్ తో కలిసి ఈ సైన్యం బర్మా, ఇంఫాల్, కోహిమా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో బ్రిటీష్ సైన్యంతో పోరాడింది. ఐ ఎన్ ఏ కు జర్మనీ, ఇటలీ, జపాన్ ప్రభుత్వాలు గుర్తింపు, మద్దతు ఇచ్చాయి. అయితే అణుబాంబు ప్రయోగం నేపథ్యంలో జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడం, 1945లో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్ర బోస్ మరణించినట్లు వార్తలు రావడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ఉనికి కోల్పోయింది.
స్వరాజ్య సాధన లక్ష్యాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ సాధించలేకపోయినా.. దాని స్ఫూర్తి రగిలించింది. 1946లో బొంబాయి కేంద్రంగా బ్రిటిష్ నౌకాదళంలో తిరుగుబాటును ప్రేరేపించింది. ఆ తర్వాత కూడా పలు తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలతో భారత్ లో ఇంకెంతోకాలం కొనసాగలేమన్న భావనకు బ్రిటీషర్లు వచ్చారు. అప్పటి నుంచే బ్రిటన్ పార్లమెంటులో భారత స్వాతంత్ర్య ప్రకటన ప్రక్రియ జోరందుకుంది.
Also Read : జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ.. మోదేపల్లి నుంచి సుప్రీం కోర్టు వరకు