iDreamPost
iDreamPost
సినిమా పరిశ్రమలో ఎవరైనా తమ ప్రస్థానం మొదలుపెట్టేది చిన్ని అడుగులతోనే. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటే అదృష్టదేవతతో పాటు అవకాశ లక్ష్మి కూడా వచ్చి మరీ ఇంటి తలుపు తడుతుంది. అంతే తప్ప ఇదేంటి నేనిలాంటి పాత్ర చేయడం ఏమిటి అని ఆలోచిస్తే ఎదగడం కష్టం. దానికి ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోనే మంచి ఉదాహరణ. ఇది 1990లో విడుదలైన కర్తవ్యం సినిమా వంద రోజుల వేడుకకు సంబంధించినది. ఇందులో నిర్మాత ఏఎం రత్నం, మెమెంటోను అందజేస్తూ బాలకృష్ణ, దాన్ని అందుకుంటూ మీనా కనిపిస్తున్నారు కదా. ఇక అసలు విషయానికి వస్తే. మీనా కర్తవ్యంలో చేసింది చాలా చిన్న పాత్ర. మెయిన్ విలన్ పండరి కాక్షయ్య కొడుకు గ్యాంగ్ చేతిలో దారుణంగా మానభంగానికి గురై కోర్టుల చుట్టూ తిరుగుతుంది.
కథలో చాలా కీలక మలుపుకు తనే కారణం. క్లైమాక్స్ లో హీరోయిన్ విజయశాంతి ప్రమేయంతో అతన్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నిడివిపరంగా మీనా ఇందులో మూవీ మొత్తం కనిపించదు. కీలకమైన సన్నివేశాలలో మాత్రమే తన ఎంట్రీ ఉంటుంది. కొంచెం కూడా గ్లామరస్ గా కనిపించే అవకాశం ఇవ్వలేదు దర్శకులు మోహనగాంధీ. అంతకు ముందు బాలనటిగా కొన్ని సినిమాలు చేసిన మీనా వయసొచ్చాక కనిపించిన మొదటి చిత్రం నవయుగం కాగా కర్తవ్యం రెండోది. పరిధి చిన్నదే అయినా మీనాకు చాలా గుర్తింపు వచ్చింది. అవార్డు ఇస్తున్న సమయంలో బాలకృష్ణ, మీనాలు పరస్పరం తాము భవిష్యత్తులో హీరో హీరోయిన్లు నటించబోతున్నామని ఊహించారో లేదో కానీ అది అక్షరాలా నిజమయ్యింది.
సీతారామయ్య గారి మనవరాలుతో వచ్చిన బ్రేక్ తో మీనాకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. తనకు కర్తవ్యం ఫంక్షన్ లో జ్ఞాపికను ఇచ్చిన బాలయ్యతో 4 సినిమాలు చేసింది. మొదటిది అశ్వమేథం. అంచనాలు ఎక్కువైపోయి ఫలితం ఆశించిన విధంగా రాలేదు. రెండోది బొబ్బిలి సింహం. సూపర్ హిట్ గా నిలిచి కలెక్షన్లతో పాటు మీనాకు ఆఫర్లను పెంచేసింది. మూడోది ముద్దుల మొగుడు. కంటెంట్ మరీ తేడా కొట్టడంతో బోల్తా కొట్టేసింది. నాలుగోది కృష్ణబాబు. సెంటిమెంట్ డ్రామా మితిమీరడంతో పాటు మీనా పాత్ర స్వయంగా బాలకృష్ణ చేతిలోనే హత్యకు గురికావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇలా ఈ కాంబోలో నాలుగు సినిమాలు వస్తే ఒకటి మాత్రం అంచనాలు నిలబెట్టుకుని సూపర్ హిట్ అయ్యింది.