iDreamPost
iDreamPost
రెండూ దాయాది దేశాలు.. సమకాలీన క్రికెట్‌లో రెండు జట్లు సమవుజ్జీలు… బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నిరంగాల్లోను ఒకరికి ఒకరు తీసిపోని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్లు రేపు తుదిపోరులో తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోటీ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్ల మధ్య ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
తొలిదశలోనే భారత్ వైదొలగడంతో ఈ టోర్నీపై దేశంలో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కాని తరువాత హోరాహోరీగా సాగుతున్న పోటీలు టోర్నీపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా సెమీఫైనల్స్ రెండు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ ప్రత్యర్థులు ఇంగ్లాండ్, పాకిస్తాన్‌ల మీద ఐదేసి వికెట్ల తేడాతో గెలిచినా పోరు మాత్రం చివరికంటూ ఉత్కంఠం రేపింది. దీనితో ఫైనల్స్ విజేత మీద క్రికెట్ అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి.
రెండు జట్లు సమవుజ్జీలుగా ఉండడంతో పోరు నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఐదు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన అనుభవంతో ఆస్ట్రేలియా, వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో చేదు ఫలితాలు చూసి కసితో ఉన్న న్యూజిల్యాండ్ ఇలా ఇరుజట్లు గెలుపు కోసం తలపడితే మ్యాచ్ రసదాయకంగా జరగనుంది.
వారే గేమ్ ఛేంజర్లు:
వన్డే క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉన్నా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఉత్కంఠతను కలిగిస్తాయి. కాని టీ20లో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠంగానే ఉంటుంది. ఒకటి రెండు ఓవర్లలోనే ఫలితం తారుమారు అవుతుండడం, ఒక్క లైఫ్ ఇచ్చినా ఆ బ్యాట్స్‌మెన్ వల్లే ఓటమి చవిచూడాల్సి రావడం వంటి చిత్రవిత్రమైన మలుపులతో టీ20 క్రికెట్ అభిమానుల్లో జోష్‌ను పెంచుతోంది.
ఇటు ఆస్ట్రేలియా, అటు న్యూజిల్యాండ్ రెండు జట్లలోను క్షణాలలో ఫలితాలు తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు కొదవలేదు. న్యూజిల్యాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ వంటి సీనియర్లు ఉన్నారు. వీరు కాకుండా న్యూజిల్యాండ్ జట్టులో జిమ్మి నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, డేరి మిచెల్ వంటి పించ్ హిట్టర్లు ఉండగా, ఆస్ట్రేలియాలో మాథ్యూవేడ్, మార్కెస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి భారీ హిట్లర్లు ఉన్నారు.
సెమీస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన వేడ్ బ్యాటింగ్ విధ్వంసం వల్ల గెలవాల్సిన పాకిస్తాన్ ఇంటి మొఖం పట్టాల్సి వచ్చింది. బంతిని బౌండరీలకు తరలిస్తూ వీరు చేస్తున్న బ్యాటింగ్ విన్యాసాలు అభిమానుల్లో క్రికెట్ పట్ల మరింత ఆసక్తిని రేకెతిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రెండు జట్లలోను ప్రతిభావంతులకు కొదవలేదు. దీనితో రెండు జట్ల మధ్య గెలుపు ఎవరిది అనేదానిపై క్రికెట్ అభిమానులు ఎవరి అంచనాలతో వారున్నారు.