iDreamPost
iDreamPost
ఆరు నూరైనా మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని… బాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మి అధికారం ఇస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలు నాశనం అయిపోయాయని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ హయాంలో విద్యుత్ రంగం చిన్నాభిన్నం అయిందని తెలిపారు. ఏపీని అందరూ అస్యహించుకునే స్థితికి తెచ్చారన్నారు. ఏపీ ఆస్తులను తెలంగాణకు దోచిపెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించామని.. నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేశామన్నారు.
అవును పార్టీకి చారిత్రక అవసరమే!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నుంచి టీడీపీని గుంజుకుని, తన టక్కు టమార విద్యలతో 14 ఏళ్లు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన చంద్రబాబుకు ఇకపై పార్టీని ముందుకు నడిపించే శక్తి లేదని ఆ పార్టీ నాయకులకు అర్థమైపోయింది. ఆ విషయం అందరి కన్నా ముందు కనిపెట్టింది కూడా అచ్చెన్నాయుడే! అందుకే పార్టీ లేదు.. భవిష్యత్తూ లేదు… అధికారం లేదూ అంటూ ఆయన… చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతర్గత సంభాషణల్లో ఆయన చేసిన ఆ వ్యాఖ్యల వీడియో బాగా వైరల్ అయింది. వాస్తవానికి ఆ వ్యాఖ్యలు పార్టీ దుస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి కూడా.
చంద్రబాబుకు వయసు మీద పడడం, గతంలో మాదిరిగా రాజకీయ ఎత్తులు పైఎత్తులు వేయలేక పోవడం అందరూ చూస్తున్నదే. తన కన్నా వయసులో చాలా చిన్నవాడైన సీఎం జగన్ ముందు కాలం చెల్లిన చంద్రబాబు ఎత్తులు, జిత్తులు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని 2019 ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో సైతం ప్రస్తావించారు. జగన్‌మోహన్‌రెడ్డి ట్రాప్‌లో పడి చంద్రబాబు రాజకీయంగా తప్పులు చేస్తూ వెనకబడుతున్నారని మోదీ అప్పట్లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిస్థితి అలా ఉండగా ఆయన వారసుడు లోకేశ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మంత్రిగా ఉండి, సామ,దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి, విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరించినా లోకేశ్ మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి శరాఘాతం అని చెప్పవచ్చు.
Also Read : రేవంత్ ఏ మాత్రం తగ్గడం లేదుగా..
తాను స్వయంగా గెలవలేనివాడు పార్టీని ఏం నడిపిస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే అచ్చెన్నాయుడు అప్పట్లో అలా వ్యాఖ్యానించారు కూడా. అయితే అచ్చెన్న చెబుతున్నట్టు వచ్చే ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి కాదు, టీడీపీకే చారిత్రక అవసరం. 2024 ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ దాదాపు మూతపడుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ పుంజుకుంటుందా?
2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక, పంచాయతీ, పరిషత్, తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికలు ఇలా అన్నింటా టీడీపీ ఓడిపోవడంతో ఇప్పటికే పార్టీ కేడర్ చెల్లా చెదురైంది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే పరిస్థితి మరింత దుర్బరమవుతుంది. అయితే సమీప భవిష్యత్తులో టీడీపీ పుంజుకొని ప్రజాభిమానం చూరగొంటుందన్న నమ్మకం కూడా ఆ పార్టీలో ఎవరికీ లేదు. ఎందుకంటే అధినేత చంద్రబాబు ఎంతసేపూ పొత్తులను నమ్ముకుని పార్టీని గట్టెక్కించాలని తాపత్రయపడుతున్నారు తప్ప సొంతంగా టీడీపీనీ బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం లేదు. చీటికి మాటికి అధికార పక్షంపై విరుచుకుపడడం తప్ప టీడీపీపై ప్రజల్లో విశ్వాసం కలిగించేలా వ్యవహరించడం లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార పక్షాన్ని నిలువరించే యత్నాలు చేయడం లేదు.
వైఎస్సార్ సీపీని కాదని తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో, తాము అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా మెరుగైన పాలన ఎలా అందిస్తామో టీడీపీ నాయకులు జనానికి వివరించలేకపోతున్నారు. రోజువారీ ప్రెస్‌మీట్లు పెట్టి పార్టీలైన్‌కి అనుగుణంగా సీఎం జగన్‌ను విమర్శిస్తే టీడీపీ పుంజుకుంటుందా అన్న అనుమానం ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బతికించుకోవడానికి ఏం చేయాలో సీరియస్‌గా ఆలోచించి, కార్యాచరణ రూపొందించడం మాని, ఇలా స్టేట్‌మెంట్‌లు ఇస్తే ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : రాజధానుల వ్యవహారం: పిటీషనర్ల వింత వాదనలు