తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రామలింగేశ్వర సిద్ధాంతి తుది శ్వాస విడిచారని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
టీవీ లో ప్రతిరోజూ రాశి ఫలాలు, వార ఫలాలు చెబుతూ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగు ప్రజలలో చాలా మందికి చేరువయ్యారు. ములుగు సిద్ధాంతిగా ఫేమస్ అయిన ఆయన చెప్పే రాశి ఫలాలను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లో ఉండే తెలుగు వారు కూడా ఫాలో అవుతూ ఉంటారు. గుంటూరు నుంచి వచ్చి ఆయన హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎమ్ఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో లక్షలాది క్యాసెట్లు అమ్ముడైన “శ్రీదేవి పెళ్లి” క్యాసెట్ వీరు రికార్డు చేసిందే. సినీనటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో కలిసి ఆయన వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.
జ్యోతిష్యంలో ప్రతి అంశంలోనూ ఆయన పట్టు సాధించాడు. ఆయన పద్ధతులు – లెక్కలు పరిపూర్ణంగా ఉండడమే కాక అధికశాతం అంచనాలు నిజమయ్యాయి. గత 14 సంవత్సరాల నుండి తెలుగు న్యూస్ పేపర్‌లో ఆయన అంచనాలు ప్రచురితమవుతున్నాయి. అలాగే సామాన్యుల ప్రయోజనం కోసం MAA TV ద్వారా ఆయన రాశిఫలాలు అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. NRIల కోసం (న్యూయార్క్, లండన్, సిడ్నీ, లాస్-ఏంజిల్స్, చికాగో మరియు అట్లాంటా) వారి సమయ మండలాల ప్రకారం ప్రాంతీయ క్యాలెండర్‌లను సిద్ధం చేశారు.
శ్రీ శైవ పీఠం 1889లో గుంటూరులో ములుగు నాగ లింగయ్య గారి ద్వారా ఏర్పాటు చేయబడింది.ఆయన జ్యోతిష్యశాస్త్రం మరియు వాస్తు శాస్త్రాలలో జ్ఞానానికి ప్రసిద్ధి చెందారు. ములుగు రామలింగేశ్వర ప్రసాద్ ములుగు నాగ లింగయ్య యొక్క మనవడు మరియు వారసుడు.
అలా ఇప్పుడు పీఠంలో నాగ లింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన కెరీర్‌లో రామలింగేశ్వర ప్రసాద్ గారు చెప్పిన ఎన్నో అంచనాలు నిజమయ్యాయి. “అంచనాలు నిజమైతే ఆ ఘనత మన మహర్షి మండలికే చెందుతుంది. ఒక్కోసారి నా అంచనాలు నిజం కాకపోతే అది శాస్త్రాల వల్ల కాదు నా తప్పే కావచ్చు” అని ఆయన చెబుతుండేవారు. జ్యోతిష్యశాస్త్రం తప్పక ఉపయోగపడుతుందని ఆయన బలంగా నమ్ముతారు.
ఇక శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి వేదాలు, పూజా, హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో ప్రతి మాసశివరాత్రికి పాశుపత హోమాలు నిర్వహించేవారు. అంతేగాక లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు.